Share News

ప్రజా ప్రభుత్వమంటే లొంగదీసుకోవడమేనా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:03 AM

ప్రజా ప్రభుత్వమంటే ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను నయానో, భయానో, లేదంటే కొనుక్కొనో లొంగదీసుకుని తమ పార్టీలో కలుపుకోవడమేనా? అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్‌ మాజీ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

ప్రజా ప్రభుత్వమంటే లొంగదీసుకోవడమేనా?

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూరు, జూలై 7: ప్రజా ప్రభుత్వమంటే ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను నయానో, భయానో, లేదంటే కొనుక్కొనో లొంగదీసుకుని తమ పార్టీలో కలుపుకోవడమేనా? అని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్‌ మాజీ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలోని ఆయన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని, ఇచ్చిన హామీల అమలును పక్కనబెట్టి రాష్ట్ర రాజధానిలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రె్‌సలో చేర్చుకుంటున్నారన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన బెట్టి మునిసిపల్‌, సింగిల్‌విండోల చైర్మన్లను తన పార్టీలో చేరమని ఒత్తిడి చేయడం, వారు వినకుంటే కౌన్సిలర్లు, డైరెక్టర్లను ప్రలోభపర్చి అవిశ్వాసాలు పెట్టి తప్పించడం చేస్తున్నారని విమర్శించారు. మోత్కూరు, తిరుమలగిరి మునిసిపల్‌ చైర్మన్లను, మోత్కూరు, అడ్డగూడూరు సింగిల్‌ విండోల చైర్మన్లను అవిశ్వాసాలతో దించి కాంగ్రెస్‌ వశం చేసుకున్నామని మురవడం కాదు, దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి మురవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ ఇసుక అమ్ముకుంటున్నారని ఎన్నికల్లో గగ్గోలు పెట్టి, దోసెడు ఇసుక పోనివ్వనని శపథంచేసి ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు ఎమ్మెల్యే సామేల్‌ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వ అనుమతితో పోయినట్టుగానే అప్పుడు కూడా ప్రభుత్వ అనుమతితోనే ఇసుక వెళ్లింది కదా అన్నారు.

సింగిల్‌ విండోపై విచారణను స్వాగతిస్తున్నా..

మోత్కూరు సింగిల్‌విండోలో సుమారు 30ఏళ్లుగా తాను, తన కుమారుడే చైర్మన్లుగా ఉన్నామని, ఇటీవల తన కుమారున్ని అవిశ్వాసంతో దించి కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నాక జరిగిన పాలక వర్గ సమావేశంలో సింగిల్‌విండోలో 20 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తానని ఎమ్మెల్యే ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ విచారణను తాను స్వాగతిస్తున్నానన్నారు. తమ కాలంలో సింగిల్‌ విండోలో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించినా ఏ శిక్షకైనా తాను సిద్దమేనన్నారు.

సాగు చేసే ప్రతీ ఎకరాకు ‘రైతు భరోసా’ ఇవ్వాలి

ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్టుగా రైతులకు ఎకరాకు రూ.15వేలు రైతు భరోసా ఇవ్వలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులు అభిప్రాయ సేకరణ సాకుతో ఐదెకరాలలోపు వారికే రైతు భరోసా ఇవ్వడానికి కుట్ర చేస్తోందన్నారు. సాగుచేసే ప్రతీ ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్‌, జంగ శ్రీనివాస్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ పురుగుల మల్లయ్య, నాయకులు కొండా సోంమల్లు, అండెం రాజిరెడ్డి, గజ్జి మల్లేష్‌, రాంపాక నాగయ్య, పి.విష్ణుమూర్తి, మంచె గోవర్ధన్‌, మల్లం అనిత తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:03 AM