పటేల్, పట్వారీ వ్యవస్థ ఉంటే భూసమస్యలు వచ్చేవి కావు
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:49 PM
పటేల్, పట్వారీ వ్యవస్థ ప్రస్తుతం ఉంటే భూసమస్యలు వచ్చేవి కావని రాజ్యసభ మాజీ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు(వీహెచ) అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హన్మంతరావు
సూర్యాపేట టౌన, జూలై 23: పటేల్, పట్వారీ వ్యవస్థ ప్రస్తుతం ఉంటే భూసమస్యలు వచ్చేవి కావని రాజ్యసభ మాజీ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు(వీహెచ) అన్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు తమ పేరున పట్టా చేయడం లేదని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన అరుణ, ఆమె కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ, పుల్లమ్మ సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ మహిళలను రామాపురం గ్రామంలో వీహెచ మంగళవారం పరామర్శించారు. అనంతరం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామాపురం గ్రామానికి చెందిన రైతు మేడం ముత్తయ్యకు వారసత్వంగా వచ్చిన భూమిని 2016నుంచి ఇతరులు కబ్జా చేయడం బాధాకరమన్నారు. రైతుకు వచ్చిన భూసమస్య విషయంలో అప్పటి రెవెన్యూ అధికారులదే పూర్తి బాధ్యత అని అన్నారు. ‘ధరణి’ లోపాలను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో నాయకులు, అధికారులతో కలిసి పలు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంతరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తాను ఉంటానని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్, గోదాల రంగారెడ్డి, కోతి గోపాల్‌రెడ్డి, ధరావత వీరన్ననాయక్, మల్లేష్, చిరువేళ్ల శబరి, గండూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.