Share News

కాంగ్రెస్‌ను గెలిపిస్తేమూసీ ప్రక్షాళన

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:24 AM

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా ఉన్న మూసీ నదిని రూ.60 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ను గెలిపిస్తేమూసీ ప్రక్షాళన

ఎస్‌ఎల్‌బీసీ, బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌ సహా సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం

యాదాద్రిని యాదగిరి గుట్టగా మారుస్తాం

కోడ్‌ ముగిశాక భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం

నాతోపాటు వెంకట్‌రెడ్డికే సీఎం అయ్యే అర్హత ఉంది

లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, కేడీకి బుద్ధి చెప్పాలి

భువనగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 21: ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా ఉన్న మూసీ నదిని రూ.60 వేల కోట్లతో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం రాత్రి భువనగిరిలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి డబుల్‌ ఇంజన్‌ లాంటివారని, ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే త్రిపుల్‌ ఇంజన్‌లా భువనగిరి అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వివక్షకు గురైన ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామని, అసంపూర్తిగా ఉన్న బస్వాపూర్‌ ప్రాజెక్టుకు రూ.400కోట్లు కేటాయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భూనిర్వాసితులకు పరిహారం అందజేసి మిగులు పనులు పూర్తిచేసి ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తామన్నారు. గంధమల్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల రైతులకు సాగు నీరందించే ధర్మారెడ్డి, బునాదిగాని, మూసీ కాల్వల పనులను పూర్తిచేస్తామన్నారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తూ భక్తులకు అవసరమైన వసతులను ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కల్పిస్తామన్నారు. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆనగా చెబుతున్నా ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేస్తానని వాగ్ధానం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, 30వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కాదని ఎవరైనా అంటే భువనగిరి అడ్డాగా బహిరంగ చర్చకు కాంగ్రెస్‌ సిద్ధమని సీఎం సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీలో తనతోపాటు ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే ఉందని, కోమటిరెడ్డి బ్రదర్స్‌ తనకు కుడి, ఎడమలైతే మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలంగాణ కాంగ్రె్‌సకు ఉద్ధండులని సీఎం అన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీపై విమర్శలు

భువనగిరి కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల దాడి కొనసాగించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి మాజీ సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చాడన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల నుంచే కూలిపోతోందని కేసీఆర్‌ ప్రచారం చేస్తున్నాడని, రాష్ట్రంలో కాంగ్రె్‌సను బలహీన పరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. అందులో భాగంగా భువనగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను ముందు పెట్టి వెనుకాల బీజేపి అభ్యర్థికి మద్దతుగా బూర ఊదుతున్న నీచుడు కేసీఆర్‌ అని విమర్శించారు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే ఉరికించి కొడతామన్నారు. ప్రభుత్వమేమి ఫుల్‌ బాటిల్‌ కాదని ఎద్దేవా చేశారు. నల్లగొండ ఫ్లోరైడ్‌ పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దే అని అన్నారు. బీజేపీ మతం, దేవుడు, కేంద్ర దర్యాప్తు సంస్థల కేంద్రంగా రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యంగ రక్షణ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీలేదని విమర్శించారు. దేశాన్ని మోదీ ముంచుతుండగా, రాష్ట్రాన్ని తన కుటుంబంకోసం ఓ కేడి ముంచాడని, మోదీ, కేడీ ఇద్దరు ఒకటేనని అన్నారు. త్వరలో రాహుల్‌గాంధీ నాయకత్వం లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రె్‌సతో కలసి రావాలన్నారు. ఇప్పటికే సీపీఐ తమతో కలసి పనిచేస్తుండటం హర్షనీయమని, మరో వామపక్ష పార్టీ కూడ వారి నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలన్నారు.

జోష్‌ నింపిన సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో

అడుగడుగునా ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భువనగిరిలో నిర్వహించిన రోడ్‌షో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సీఎం హోదాలో తొలిసారిగా భువనగిరిలో పర్యటించిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానికులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. స్థానిక హైదరాబాద్‌ చౌరస్తాలో ఓపెన్‌టా్‌ప వాహనంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వవిప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనీల్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మందుల సామేల్‌, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడి,్డ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షో నిర్వహించి వినాయకచౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు సాగిన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌కు రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో బారులు తీరిన ప్రజ లు, కార్యకర్తలు సీఎంపై పూల వర్షం కురిపించారు. షేక్‌హాండ్‌ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు నిలువరించారు. అలాగే సీఎం ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. విపక్షాలపై వేసిన సెటైర్లు, విమర్శలకు ప్రజలు కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. జై కాంగ్రెస్‌, పీఎం రాహు ల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు. రోడ్‌షో అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు.

భారీ జనసందోహం.. ట్రాఫిక్‌ మళ్లింపు

సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌తో భువనగిరిలో భారీ జన సందోహం నెలకొన్నది. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణ చేయడంతో పాటు సీఎంను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో భువనగిరి జనసంద్రమైంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను పట్టణ శివారు ప్రాంతాల్లోనే పోలీసులు నిలిపివేశారు. దీంతో వారందరూ కాంగ్రెస్‌ జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలోకి చేరారు. అలాగే ట్రాఫిక్‌ను పోలీసులు బైపాస్‌ రోడ్డుకు మళ్లించినా ఇక్కట్లు తప్పలేదు. ఇదే అదనుగా జేబుదొంగలు చేతివాటం చూపడంతో పలువురి జేబులకు చిల్లులు పడ్డాయి. డీసీపీ ఎం.రాజే్‌షచంద్ర ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు కొనసాగింది. సీఎం రోడ్‌షోను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్యే కుంభం అనీల్‌కుమార్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మునిసిపల్‌ చైర్మెన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వాన్ని ముట్టుకుంటే మాడిపోతారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముట్టుకుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ సహా ఎవరైనా మాడి మసైపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ ఎంపీ స్థానాన్ని ఐదు లక్షలు, భువనగిరి స్థానాన్ని నాలుగు లక్ష ల మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనతో ఉమ్మడి జిల్లా సమస్యలకు నెలవుగా మారిందన్నారు. బీజేపీ కేంద్రంలో పదేళ్లు అఽధికారంలో ఉండి రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు చేసిందేమీ లేదని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నా, నిధులు తేలేని దద్దమ్మ అని విమర్శించారు. తాను ఎంపీగా ఐదేళ్లపాటు పోరాడటంతో కేంద్రం ఎయిమ్స్‌కు రూ.1150కోట్లు మంజూరు చేసిందన్నా రు. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులను మంజూరు చేయించానన్నా రు. మునగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని, మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ టార్గెట్‌లో ఓ పొట్టాయన మాత్రమే మిస్‌ అయ్యారని, కానీ త్వరలోనే అందుకు తగిన పరిహారం చూడనున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, మందుల సామెల్‌, వేముల వీరేశం మాట్లాడుతూ, అవినీతి బీఆర్‌ఎ్‌సకు, దురహంకార బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:24 AM