Share News

పార్లమెంటు ఎన్నికలకు హిందుత్వ ఎజెండా

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:24 AM

రానున్న పార్లమెంటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు హిందుత్వ ఎజెండాతోనే పార్టీ కార్యక్రమాలు ఉండాలని, ఆ దిశగా ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ రాష్ట్రకమిటీ కమిటీ నిర్ణయించింది. ఆసక్తిగల నేతలు విస్తృతంగా కార్యక్రమాల భారాన్ని మోసి టికెట్లు సాధించుకోవాలని, తద్వారా పార్టీని, వారి రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక నేతలకు సూచించింది. ఈ నేపథ్యంలో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. త్వరలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎ్‌స.ప్రభాకర్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది.

పార్లమెంటు ఎన్నికలకు హిందుత్వ ఎజెండా

రామాలయ ప్రారంభాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం

పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్‌ నమోదుపై నజర్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

రానున్న పార్లమెంటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు హిందుత్వ ఎజెండాతోనే పార్టీ కార్యక్రమాలు ఉండాలని, ఆ దిశగా ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ రాష్ట్రకమిటీ కమిటీ నిర్ణయించింది. ఆసక్తిగల నేతలు విస్తృతంగా కార్యక్రమాల భారాన్ని మోసి టికెట్లు సాధించుకోవాలని, తద్వారా పార్టీని, వారి రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక నేతలకు సూచించింది. ఈ నేపథ్యంలో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. త్వరలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎ్‌స.ప్రభాకర్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది.

నల్లగొండ పార్లమెంటు పరిధిలోని రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, తదితర కీలక నేతలు సుమారు 70మందితో బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం సుదీర్ఘ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసేందుకు ఎంత మంది ఆసక్తిగా ఉన్నారని ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి ఆరా తీయగా, సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది సిద్ధమని ప్రకటించారు. ఫిబ్రవరి మొదటివారంలో పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, ఏప్రిల్‌ చివరకు పోలింగ్‌ పూర్తవుతుందని, ఆ మేరకు నాయకత్వం ప్రజల్లోకి వెళ్లాలని, అధిష్ఠానం నిత్యం కార్యక్రమాలు ఇస్తూ వెళ్తుందని, ఆసక్తిగల నేతలు దీన్ని వినియోగించుకొని రాజకీయ భవిష్యత్‌ను సుస్థిరం చేసుకోవాలని వారికి చింతల సూచించారు.

రామజన్మభూమిపై ఆశలు

రామజన్మభూమి అయోధ్యలో ఈనెల 22న రామాలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటర్ల మనసులో బీజేపీ స్థానాన్ని సుస్థిరం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. 22న రామాలయం ప్రారంభం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని అన్ని ప్రధాన పట్టణాల కూడళ్లలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి ప్రసారం చేసి రామాలయ నిర్మాణం బీజేపీ సాధించిన విజయంగా చూపించాలని చూస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులే నిర్వహించాలని, అనుసంధానంగా అదే రోజు నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని అన్ని దేవాలయాలను స్వచ్ఛ ఆలయ్‌ పేరుతో పరిశుభ్రం చేసి పూజలు చేయించాలని, గ్రామగ్రామాన దీన్ని నిర్వహించాలని అధిష్ఠానం ఆదేశించింది. అదే రోజు దేవాలయాల్లో దీపాలు వెలిగించాలని, పూజలు నిర్వహించాలని, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో 5వేల దీపాలతో శోభాయాత్ర నిర్వహించాలని మార్గనిర్దేశం చేసింది. ఈ తరహాలో చేపట్టాల్సిన ఆరేడు కార్యక్రమాలను నల్లగొండ సమావేశానికి హాజరైన కీలక నేతలకు ఇన్‌చార్జి వివరించారు. దేవాలయాల వద్ద బీజేపీ జెండాలు లేకున్నా కాషాయ జెండాలు, పార్టీ కీలక నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తే ఇది బీజేపీ కార్యక్రమంగా ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. రామాలయ అక్షింతల కార్యక్రమం సక్సెస్‌ కావడంతో ఆదే తరహాలో ఇతర కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయించింది. అయోధ్యకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. వాటిలో వెళ్లాలనుకునే వారి నుంచి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున వసూలు చేసి 75శాతం మంది తటస్థులు, 25శాతం బీజేపీ నేతలు ఉండేలా చూడాలని పార్టీ స్థానిక నేతలను ఆదేశించింది. ఈ కార్యక్రమం నిరంతరం సాగనుంది. తిరుపతిలో సేవ మాదిరిగా అయోధ్యలోనూ సేవ చేసేందుకు పార్లమెంట్‌ పరిధిలో 50 మందిని సిద్ధం చేసి, వారు అక్కడే ఉండేందుకు వసతులు కల్పించనున్నారు. రామాలయం ప్రారంభానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనను ఆసరా చేసుకొని కాంగ్రెస్‌ హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ప్రచారాన్ని విస్తృతం చేయాలని పార్టీ అధిష్ఠానం స్థానిక నేతలకు సూచించింది.

పోటీదారుల సమాచారం సేకరణ

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచే వారిలో మన్నెం రంజిత్‌యాదవ్‌, నాగం వర్షిత్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, జితేందర్‌ గుప్తా, బండారు ప్రసాద్‌, లాలునాయక్‌తోపాటు మరికొందరు ముం దుకు వచ్చారు. అదేవిధంగా నల్లగొండలో ప్రముఖ వైద్యుడు మాతృనాయక్‌ సైతం బీజేపీ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు ఆయనతో సంప్రదింపులు చేసినట్టు తెలిసింది. పార్లమెంట్‌ స్థానం పరిధిలో 4లక్షలకుపైగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. మాతృ 25 ఏళ్లుగా వైద్యవృత్తిలో స్థానింగా ఉండటం, మిర్యాలగూడ నియోజకవర్గ వాసి కావడం, ఉద్యోగరీత్యా నల్లగొండ, దేవరకొండ నియోజకవర్గాల్లో పనిచేయడం ఆయనకున్న సానుకూల అంశా లు. ఇక ఏకైక బీసీ అభ్యర్థిగా రంజిత్‌ యాదవ్‌ ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమతున్న వేళ పార్టీ నేతలు మిత్రులు, బంధువులను ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాలని చింతల సూచించారు. విశ్వకర్మ యోజన కింద వృత్తి పనివారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం, ఈ పథకం గడువును పెంచిన అంశం సైతం చర్చకు వచ్చింది. యువత, మహిళా ఓటర్లపై ప్రధానంగా దృష్టిసారించి ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

జిల్లా అధ్యక్షుల మార్పు

కొందరు జిల్లా అధ్యక్షులు పార్టీ మారడం, బాధ్యతలు నిర్వహించడం తమ వల్ల కాదని తెగేసి చెప్పడం, కొందరి పనితీరు పూర్తిగా అధమంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో జిల్లా అధ్యక్షులను మార్చాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంక్రాతి పండుగకు ముందే కొత్త అధ్యక్షుల జాబితా వెలువడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఏ మేరకు మార్పు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. కాగా, నల్లగొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నాగం వర్షిత్‌రెడ్డి, లాలునాయక్‌ ఆసక్తిగా ఉన్నారు. వీరు ఆసక్తిగా ఉన్నారా? లేదా? అని తెలుసుకునేందుకు రేసులో ఉన్న ఆయా జిల్లాలోని నేతలకు రాష్ట్ర పార్టీ నుంచి ఇప్పటికే ఫోన్లు చేసి అభిప్రాయాన్ని సేకరించినట్టు సమాచారం.

Updated Date - Jan 12 , 2024 | 12:24 AM