Share News

అతివేగం.. కూలీల బతుకులు ఛిద్రం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:19 AM

వారంతా రోజువారీ కూలీలు.. వయస్సు మీద పడినా కుటుంబానికి ఆసరాగా నిలవాలని తపించే మనస్సులు.. రోజంతా కష్టపడితే వచ్చే రూకలతో జీవితాన్ని గడుపుతున్న బడుగు జీవులు..

అతివేగం.. కూలీల బతుకులు ఛిద్రం
మోతె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న ఆటో, ప్రమాదానికి కారణమైన బస్సు

కూలీల ప్రాణాలు మింగిన అతివేగం

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఐదుగురు కూలీలు మృతి

మృతుల్లో భార్యాభర్తలు

మోతె మండల కేంద్రంలో విషాదం

మోతె / సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 28 : వారంతా రోజువారీ కూలీలు.. వయస్సు మీద పడినా కుటుంబానికి ఆసరాగా నిలవాలని తపించే మనస్సులు.. రోజంతా కష్టపడితే వచ్చే రూకలతో జీవితాన్ని గడుపుతున్న బడుగు జీవులు.. మిర్చి ఏరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో అతివేగానికి బలయ్యారు. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలతో పాటు మరో కూలీ మృతి చెందాడు. హృదయవిదారకర ఘటన మోతె మండల కేంద్రం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యుల రోదనతో ఘటనా ప్రాంతంతో పాటు సూర్యాపేట ఆసుపత్రి ప్రాంతాలు కన్నీటి పర్యంతమయ్యాయి.

మోతెలో కూలీలతో వెళ్తు న్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, మరో కూలీ మృత్యువాత పడ్డారు. రోజు మాదిరిగానే మోతె మండలంలో మిర్చి పంట ఏరేందుకు ఆటోలో వస్తుండగా ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అండర్‌పాస్‌ నుంచి బయటకు వస్తూ నర్సింహులగూడెం వైపు నుంచి హుస్సేనాబాద వైపు సర్వీస్‌ రోడ్డులో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొనడంతో సుమారు 50 మీటర్లకు పైగా ఆటో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి మట్టిరోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(60), చెరుకు నారాయణమ్మ(60), రేపాల గ్రామానికి చెందిన పోకల అనుసూర్యమ్మ(65)లు అక్కడికక్కడే మృతి చెం దారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్థానికులు, బస్సులోని ప్రయాణికులు గాయాలైన మిగతా కూలీలను 108 వాహనాల్లో సూర్యాపేటలోని జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయరాఘవాపురం గ్రామానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(58), కందుల గురువయ్య(63) మృతి చెందారు. మరో మహిళ సోమపంగు లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్‌ సోమపంగు పవనతో పల్లపాటి మంగమ్మ, సోమపంగు అనుసూర్య, పల్లపాటి రాములమ్మ, కత్తి విజయమ్మ, బెల్లంకొండ సరస్వతి, నరహరి రామచంద్రమ్మలు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అర సెకను తప్పినా...

రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన బస్సు ఆటోను మధ్య నుంచి చివరి భాగంలో ఢీకొట్టింది. బస్సు కనురెప్ప పాటు ఆలస్యంగా వచ్చినా ప్రమాదం తప్పేది. రోడ్డు దాటిన తర్వాత అర నిమిషం వ్యవధిలో కొద్దిదూరంలోని కూలీలు వెళ్లాల్సిన చోటకు క్షేమంగా వెళ్లేవారు.

మృతులంతా నిరుపేదలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు నిరుపేదలే. కూలి డబ్బులతో కుటుంబానికి ఆసరాగా ఉంటామని వెళ్తుంటారు. మృతుల్లో అందరు 58ఏళ్లకు పైబడిన వారు. అందరి పిల్లల వివాహాలు కాగా కూలి డబ్బులు కుటుంబానికి ఆసరాగా ఉంటాయని ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. మృతుల్లో కందుల గురువయ్య, కందుల నాగమ్మలు వీరరాఘవాపురం గ్రామానికి దంపతులు. సంఘటనా స్థలాన్ని ఆర్టీసీ హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పరిపూర్ణ పరిశీలించారు.ఆయనతో పాటు ఖమ్మం, సూర్యాపేట, మధిర డిపోల డీఎంలు కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాద వివరాలను సేకరించారు. మృతుల బంధువులు బెల్లంకొండ స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు

మోతె ఘటనకు సంబంధించిన క్షతగాత్రులతో పాటు మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. ఒకరిపై ఒకరు తలలు వాల్చుకుని కన్నీరుపెట్టారు. ఈ దృశ్యాలు ప్రతిఒక్కరినీ కంటితడి పెట్టించాయి. చికిత్స జరుగుతున్న సమయంలో క్షతగాత్రుల బంధువులు అత్యవసర వైద్య విభాగం దగ్గరకు చేరుకోవడంతో కొంతసేవు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

వేగంగా అందిన చికిత్సలు

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు జనరల్‌ ఆసుపత్రిలో వేగంగా చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావాలతో అసుపత్రికి చేరిన బాధితులకు ప్రథమ చికిత్సను అందించి, వైద్యపరీక్షలు నిర్వహించారు. కాళ్లు, చేతులు విరిగిన వారికి వెంటనే కట్లు కట్టి వైద్యం అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి వైద్యసేవల ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. సుమారు 10 మందికిపైగా వైద్యులు ప్రథమ చికిత్స వేగంగా అందించడంలో చొరవ చూపారు.

ఉలిక్కిపడ్డ మోతె

మతో మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తమ కళ్లెదుటే ముగ్గురు మహిళలు చనిపోవడం, తొమ్మిది గాయపడటం వారిని కలిచివేసింది. మండలంలో మిరప సాగు ఎక్కువగా చేస్తారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో ఇతర గ్రామాల నుంచి తీసుకువస్తుంటారు. అలా వస్తూనే బుధవారం కూలీలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం రైతులను కలిచివేసింది.

రేపాల, విజయరాఘవాపురంలో విషాదఛాయలు

మునగాల: రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల కుటుంబాలు కూలిపోయాయి. విజయరాఘవాపురం గ్రామానికి చెందిన చెవుల నారాయణమ్మ(55), కందుల నాగమ్మ(56), కందుల గురువయ్య(65) రెమిడాల సౌభాగ్యమ్మ(55), రేపాల గ్రామానికి చెందిన పోకల అన సూర్యమ్మ (60), మరో 8 మంది కూలీలతో కలసి మొత్తం 12మంది ఆటోలో కూలీ పనులకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 10 రోజులుగా మిర్చి ఏరే పనులకు వెళ్తున్నారు. ప్రతి రోజూ కూలీ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికివచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే వారి కుటుంబాలలో బస్సు మృత్యు రూపంలో విషాదం నింపింది. ఇదిలా ఉండగా మృతుల్లో విజయరాఘవాపురం గ్రామానికి చెందిన చెవుల నారాయణమ్మ ఒంటరి మహిళ. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కందుల గురువయ్య, నాగమ్మలు దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా, వారికి వివాహలయ్యాయి. వీరందరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులిద్దరూ కన్నుమూశారు. దీంతో కుటుంబం తల్లడిల్లుతోంది. రెమిడాల సౌభాగ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు కాగా వారికి వివా హలయ్యాయి. భర్త కొన్నేళ్ల కిందట మృతితో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్యమ్మకు ఇద్దరు కుమా రులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహలయ్యాయి. భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆదుకుంటాం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మోతె మండలం జాతీయరహదారిపై ప్రమాద ఘటనపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌హెగ్డేలను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీఇచ్చారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు: కలెక్టర్‌

మోతె ఘటనకు సంబంధించిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు ఆదేశించారు. ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని ఎస్పీ రాహుల్‌హెడ్గేతో కలిసి పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలను అందించాలని సూపరింటెండెంట్‌ మురళీధర్‌రెడ్డిని ఆదేశించారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలను కలెక్టర్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:19 AM