Share News

చెర్వుగట్టుపై ఘనంగా దోపోత్సవం

ABN , Publish Date - Feb 21 , 2024 | 12:21 AM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున దోపోత్సవం నిర్వహించారు.

చెర్వుగట్టుపై ఘనంగా దోపోత్సవం
దోపోత్సవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న సిబ్బంది

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 20 : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున దోపోత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠింపజేసి, ఆలయవీధుల్లో కల్యాణమంటపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం సంప్రదాయాలను అనుసరిస్తూ దోపోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి విశేష ఉత్సవాల్లో ఒకటైన దోపోత్సవ విశిష్టతను, వృత్తాంతాన్ని ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ భక్తులకు వివరించారు. అనంతరం ఉదయం అష్టోత్తర శత కలశాలతో స్వామివారికి అర్చకులు శ్రీకాంతశర్మ, సతీశ శర్మ, సురేశ శర్మ, నాగఫణిశర్మలు అభిషేకం సూర్యనమస్కారాలు, దీక్షా హోమాలు, బలిహరణ మహాపూర్ణాహుతి నిర్వహించారు. స్వామి వారి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ఆరోహణం చేసిన ధ్వజాన్ని అవరోహణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య త్రిశూల స్నానం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం ఉత్సవ పూజాక్రతువుల్లో పాల్గొన్న వారికి పండిత సన్మానంచేశారు. రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవలను నిర్వహించారు. వేడుకలో దేవస్థాన ఈవో సిరికొండ నవీనకుమార్‌, ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరెడ్డి, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, వల్లూరి శంకర్‌, శ్రీనివా్‌సరెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, వంశీ, రాజయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2024 | 12:21 AM