Share News

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:14 AM

చౌటుప్పల్‌ మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు, తెప్పలుగా చేరుకుంటుంది.

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం
చౌటుప్పల్‌లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు

ధాన్యం ఆరబెట్టే పనిలో రైతులు

మందకొడిగా కొనుగోళ్లు

చౌటుప్పల్‌ టౌన, ఏప్రిల్‌ 13: చౌటుప్పల్‌ మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు, తెప్పలుగా చేరుకుంటుంది. శనివారం సాయంత్రం వరకు పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలలో 1128 మంది రైతులు సుమారు 40 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం రాశులను పోశారు. నాలుగు ఐకేపీ కొరుగోలు కేంద్రాలకు సుమారు నాలుగు వేల క్వింటాళ్ల ధాన్యాన్ని 104 మంది రైతులు తెచ్చారు.

భయపెడుతున్న వాన మబ్బులు...

వాన మబ్బులు భయపెడుతుండడంతో రైతులు వరి కోతలను ముమ్మరం చేశారు. కొనుగోలు కేంద్రాలలో తూకాలు వేస్తే త్వరగా ధాన్యాన్ని విక్రయించి, వెళ్లిపోవాలని రైతులు ఆరాట పడుతున్నారు. అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం రాశులు తడిసిపోవడం, పంటలకు కొంత మేరకు నష్టాలు జరుగుతుండడం వంటి పరిణామాలతో ఈ ప్రాంత రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ధాన్యం తూకాలను ఆలస్యం చేస్తుండడంతో రైతులలో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబెట్టడం, క్లీనింగ్‌ చేయడం వంటి పనులను రైతులు పూర్తి చేసి తూకాల కోసం ఎదురు చూస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కోసం 18 కేంద్రాలు

మండలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో పీఏసీఎస్‌ 14 కేంద్రాలు, ఐకేపీ 4 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు తూకాల కాంటాలు, మ్యాచర్‌ మిషన లను పంపించారు. రైతులకు నీడ కోసం చలువ పందిళ్ల ఏర్పాటు, దాహం తీర్చుకునేందుకు మంచినీటి వసతి కల్పించారు. 14 పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలలో 320 మంది, నాలుగు ఐకేపీ కేంద్రాలలో 40 మంది హమాలీలను నియమించారు. ఒక్కో కేంద్రంలో రెండు నుంచి నాలుగు వరకు తూకాల కాంటాలను ఏర్పాటు చేశారు. రైతులకు టార్ఫాలిన కవర్లను అందజేశారు.

తూకాలకు అనుమతి

ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తూకాలను వేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, కానీ ధాన్యం నిర్ణీత మ్యాచర్‌ రాకపోవడంతో తూకాలను వేయడం లేదని ఐకేపీ ఏపీఎం హరి తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో తూకాలు వేయించ లేకపోతున్నామని, పచ్చిగా ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించామని ఆయన తెలిపారు.

పీఏసీఎస్‌ కేంద్రాలో ్ల15 నుంచి..

14 పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో ఈ నెల 15నుంచి ధాన్యం తూకాలను వేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. కొన్ని డిమాండ్లతో మిల్లర్లు చేస్తున్న ఆందోళనతో ధాన్యం తూకాలకు ఆలస్యం జరుగుతోంది. మిల్లర్లు ధాన్యం తూకాలను వేసేందుకు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మిల్లర్ల పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు కావాలనే జాప్యం చేస్తూ దొంగ చాటుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం పట్ల రైతు సంఘాలు మండి పడుతున్నాయి.

Updated Date - Apr 14 , 2024 | 12:14 AM