Share News

ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట ప్రభుత్వ భూమి

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:14 PM

రెవెన్యూ ఉన్నతాధికారుల అండదండలతో ధరణి ఆపరేటర్‌ అక్రమాలకు పాల్పడ్డాడు.

ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట ప్రభుత్వ భూమి
జగదీష్‌ ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట నమోదు చేసిన ప్రభుత్వ భూమి ఇదే

ధరణి ఆపరేటర్‌ భూఅక్రమాలు

36.23 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపు

మొత్తం భూమి విలువ రూ.18 కోట్లపైనే

తల్లి, చెల్లి, కుటుంబ సభ్యుల పేరిట ఆనలైనలో నమోదు

మరింత విచారణకు కలెక్టర్‌ ఆదేశం

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 21 : రెవెన్యూ ఉన్నతాధికారుల అండదండలతో ధరణి ఆపరేటర్‌ అక్రమాలకు పాల్పడ్డాడు. ఏకంగా ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యుల పేరు ధరణి రికార్డుల్లో నమోదు చేయించారు. డిజిటల్‌ పాస్‌పుస్తకాలు పొంది మూడేళ్లుగా రైతుబంధు పొందుతున్నాడు. ఎకరం, రెండు ఎకరాలు కాదు ఏకంగా 36 ఎకరాల పైనే ధరణిలో చేర్చి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు పొందడం గమనార్హం. మొత్తం భూమి విలువ రూ.18 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ధరణి ఆపరేటర్‌ను రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారిస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో ధరణి పోర్టల్‌లో చోటుచేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని ఒక రెవెన్యూ అధికారిపై భూమార్పిడికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్న సమయంలో హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో జరిగిన అక్రమ భూమి పట్టా మార్పిడి వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. తానొక్కడినే తప్పు చేయలేదని, ఇలాంటి తప్పులు హుజూర్‌నగర్‌ మండలంలో చాలా జరిగాయని చెప్పినట్లు సమాచారం. దీంతో ఽధరణి ఆపరేటర్‌ భూదందా వ్యవహారం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. అయితే వెలుగుచూసింది గోరంత కాగా ఇంకా కొండంత ఉందని రెవెన్యూ వర్గాలే పేర్కొంటున్నాయి.

హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ధరణి ఆప రేటర్‌ వత్సవాయి జగదీష్‌ తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద ఏకంగా 36. 23 ఎకరాల భూమిని ధరణ పోర్టర్‌లో నమోదుచేసినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్రవారం రాత్రి వెల్లడించారు. 2019-20లో హుజూర్‌నగర్‌ మం డలంలో పనిచేసిన ఉన్నతాధికారుల అండదండలతోనే ధరణి ఆపరేటర్‌ జగదీష్‌ ఈ దందాకు పాల్పడినట్లు సమాచారం. హుజూర్‌నగర్‌ మండలంలోని బూరుగడ్డ రెవెన్యూ పరిధిలో వేణుగోపాలస్వామి దేవాలయం, గోపాలపురం శివారు, పెద్దచెరువు, నల్లచెరువు ప్రాంతాల్లో 36.23 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉంది. ఆ భూమిని కొంతమంది వ్యక్తులు సాగు చేసుకుంటున్నారు. ఎకరం ఇక్కడ రూ.50 లక్షలపైనే ఉంది. ఈ భూమి విలువ సుమారు రూ.18కోట్లపైనే ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కోట్లు విలువచేసే భూమిని రెవెన్యూ అధికారుల అండందండలతో జగదీష్‌ అతడి కుటుంబ సభ్యుల పేరు మీద పోర్టర్‌లో నమోదు చేశాడు. బూరుగడ్డ గ్రామంలో 439 సర్వే నెంబర్‌లో 164 ఎకరాల 12 కుంటల భూమి, 604 సర్వే నెంబర్‌లో 164 ఎకరాల భూమి ఉంది. అతిపెద్ద సర్వేనెంబర్లు కావడంతో ప్రభుత్వ మిగులు భూమి అధికంగా ఉంది. వీటితో పాటుగా 602, 608, 1041 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉండగా వాటన్నింటిని ధరణి ఆపరేటర్‌ కుటుంబ సభ్యుల పేరు మీద పోర్టర్‌లో నమోదుచేసినట్లు అధికారులు గుర్తించారు. 2019 నవంబరు నుంచి 2020 ఫిబ్రవరి మధ్య కాలంలో భూమి బదలాయింపులు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూమి బదలాయింపుతో పాటు రైతుబంధు, రైతురుణమాఫీ లబ్ధికూడా పొందినట్లు సమాచారం. ప్రభుత్వ భూమి పట్టా మార్పుపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాసులు విచారణ జరిపి మూడు రోజుల కిందట నివేదిక అందించారు. ఆ నివేదిక వివరాలను డీపీఆర్‌వో రమేష్‌ శుక్రవారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. అదేవిధంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ధరణి ఆపరేటర్‌ జగదీ్‌షను డిస్మిస్‌ చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో జగదీ్‌షను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వ భూమి బదలాయింపు

హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలోనే కాకుండా హుజూర్‌నగర్‌ పట్టణం, లింగగిరి, అమరవరం, వేపలసింగారం, శ్రీనివాసపురం గ్రామాల్లో సైతం ధరణిలో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూములను పక్కనే ఉన్న భూస్వాముల పేరు మీద ధరణి పోర్టర్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలుఉన్నాయి. హుజూర్‌నగర్‌ పట్టణంలో 1041, 608, 154, 273 సర్వేనెంబర్లతో పాటు మరికొన్ని నెంబర్లలో సుమారు 300 ఎకరాలపైనే ప్రభుత్వ భూములను సన్న, చిన్నకారు రైతులకు, భూస్వాములకు ధరణి పోర్టర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసినట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌ పట్టణంలోని గోవిందాపురం, ముక్త్యాల మేజర్‌ కాల్వ సమీపంలో రామస్వామి గుట్టకు వెళ్లే దారిలో, వేపలసింగారం రోడ్డు, మట్టపల్లి, లింగగిరి రోడ్డులోని ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల పేర్ల మీద రికార్డుల్లోకి ఎక్కించినట్లు సమాచారం. ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని రికార్డులలో అక్రమంగా నమోదుచేసినట్లు విమర్శలు ఉన్నాయి. ధరణి వచ్చినప్పటి నుంచి ఆనలైనలో నమోదు చేయగా అంతకుముందు మాన్యువల్‌గా రికార్డుల్లో నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అధికారులకు తెలిసిన, బయటపడిన సమాచారం రూపాయిలో 10 పైసల వంతేనని, మిగిలిన 90 శాతం భూముల పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ భూముల లెక్కలు తీసి బదలాయింపు జరిపిన వివరాలపై విచారణ చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

జగదీష్‌ పట్టా చేసిన ప్రభుత్వ భూములు ఇవే

బూరుగడ్డ గ్రామంలోని సర్వే నెంబర్‌ 439/55/ 5లో 8 ఎకరాల 38 గుంటలు, 604/116లో 7.32 గుంటల భూమిని పచ్చిపాల ప్రియాంక పేరు మీద పోర్టర్‌లో నమోదు చేశారు. మొత్తంగా 15.7 ఎకరాలు ఆమె పేరు మీద నమోదుచేశారు.

సర్వే నెంబర్‌ 604/58లో 4.38 గుంటలు మడిపల్లి స్వప్న సోదరి పేరు మీద నమోదుచేశారు.

హుజూర్‌నగర్‌లోని 602/102/1లో 0.01 గుంటలు, 608/16లో 8.0 ఎకరాల భూమిని జగదీష్‌ తల్లి వత్సవాయి ఇందిర పేరు మీద నమోదు చేశారు.

అదేవిధంగా 1041/144లో 6.25 ఎకరాలు, 1041/368/3/2/5లో 0.10 గుంటల భూమిని ఇందిర పేరు మీద ఇలా మొత్తం 36.23 కుంటల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ధరణి పోర్టర్‌లో నమోదు చేసినట్లు విచారణలో తేలింది.

విచారణకు ఆదేశం

బూరుగడ్డలో 36.23 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌ వ్యక్తుల పరం చేసిన అక్రమాలపై పూర్తి విచారణ కోసం అదనపు కలెక్టర్‌ లతను కలెక్టర్‌ తేజ్‌సనందాలాల్‌ పవార్‌ నియమించారు. అప్పటి అధికారులపై సైతం విచారణ చేయాలని ఆదేశించారు. ధరణ ఆపరేటర్‌పైనే నెపమంతా నెట్టేసి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కోట్లు విలువచేసే భూమి ఉన్నతాధికారుల సహకారం లేకుండా డిజిటల్‌ సంతకాలు ఎలా చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో అప్పటి అధికారు లను కూడా విచారించనున్నట్లు సమాచారం.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేశాం

కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశాల మేరకు బూరుగడ్డలోని పలు సర్వే నెంబర్లకు సంబంధించి విచారణ చేశాం. ధరణి ఆపరేటర్‌ జగదీష్‌ అతడి తల్లి, చెల్లి, కుటుంబ సభ్యుల పేరు మీద 36.23 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఆనలైనలో నమోదు చేసినట్లు విచారణలో తేలింది. నివేదికను కలెక్టర్‌కు అందించడంతో అదనపు కలెక్టర్‌ లతను పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు. మండలంలో, పట్టణంలో ధరణిలో జరిగిన అవకతవకలప మరోసారి కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం.

శ్రీనివాసులు, ఆర్డీవో, హుజూర్‌నగర్‌

Updated Date - Sep 21 , 2024 | 11:14 PM