Share News

పెద్దనాన్నను కాపాడబోయి..

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:14 AM

విద్యుదాఘాతానికి గురైన పెద్దనాన్నను కాపాడబోయి యువకుడు మృతి చెందాడు.

పెద్దనాన్నను కాపాడబోయి..
అభివర్మ (ఫైల్‌)

విద్యుదాఘాతంతో యువకుడు

తిప్పర్తి, జూన 14 : విద్యుదాఘాతానికి గురైన పెద్దనాన్నను కాపాడబోయి యువకుడు మృతి చెందాడు. ఈ హృదయ విదారకర సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధి రాజుపేటలో శుక్రవారం జరిగింది. ఎస్‌ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపేట గ్రామానికి చెందిన లోకాని మట్టయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఎంబీబీఎస్‌ చదువుతుండగా, కుమారుడు అభివర్మ(20) బెంగుళూరులో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం సెలవులు ఉండటంతో ఇంటి దగ్గరే ఉన్న యువకుడు తండ్రి, పెదన్నాన్న లోకాని రామనాథంలతో కలిసి పొలానికి నీరు పెట్టడం కోసం గ్రామశివారులోని చెరువు వద్దకు వెళ్లారు. మోటార్‌ను చెరువు నీటిలో బిగిస్తున్న క్రమంలో నీటిలో తేలిన విద్యుత తీగ రామనాథంకు తగిలి కిందపడిపోతుండగా అభివర్మ ఆయన్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు విద్యుదాఘాతానికి గురై నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న అభివర్మ తండ్రి మట్టయ్య మోటార్‌ ఫీజ్‌లు తీసి వారిని నీటి నుంచి బయటకు తీయగా కుమారుడు అభివర్మ అప్పటికే మృతి చెందాడు. అన్న రామనాథం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నల్లగొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. చికిత్స పొందుతున్న రామనాథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. మట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డీ రాజు తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కుమారుడు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Jun 15 , 2024 | 12:14 AM