Share News

పట్టభద్రుల స్థానంలో తొలిసారి కాంగ్రెస్‌ పాగా

ABN , Publish Date - Jun 10 , 2024 | 02:01 AM

శాసనమండలి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో మొదటిసారి కాంగ్రెస్‌ పాగా వేసింది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఇప్పటివరకు జరిగిన ఐదు ఎన్నికల్లో, మొదటి నాలుగింటిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, తాజా ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) ఎమ్మెల్సీగా గెలుపొందారు.

పట్టభద్రుల స్థానంలో తొలిసారి కాంగ్రెస్‌ పాగా
ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు ధ్రువపత్రం అందుకుంటున్న తీన్మార్‌ మల్లన్న

తాజా ఉప ఎన్నికలో గెలుపొందిన తీన్మార్‌ మల్లన్న

బీజేపీ అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఆధిక్యత

30వేల ఓట్లు సాధించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ)

శాసనమండలి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో మొదటిసారి కాంగ్రెస్‌ పాగా వేసింది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఇప్పటివరకు జరిగిన ఐదు ఎన్నికల్లో, మొదటి నాలుగింటిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, తాజా ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) ఎమ్మెల్సీగా గెలుపొందారు.

ప్రశ్నించే గొంతుకగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాడిన మల్లన్న మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. 2016లో తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ద్వితీయ స్థానంలో నిలిచారు. మూడో ప్రయత్నంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా మల్లన్న 2027 మార్చి 29 వరకు కొనసాగుతారు. పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న 12 జిల్లాల్లో ఆయనకు ఎమ్మెల్సీగా ప్రోటోకాల్‌ వర్తిస్తుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొంది, ఈ స్థానానికి రాజీనామా చేయడంతో తాజా ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగు రాకే్‌షరెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా పాలకూరి అశోక్‌కుమార్‌, బక్క జడ్సన్‌తో పాటు మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), ఏనుగురాకే్‌షరెడ్డి నడుమ గట్టిపోటీ కొనసాగగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నల్లగొండకు చెందిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కుమార్‌ నాలుగో అభ్యర్థిగా నిలిచినా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా 29,697 మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించారు.

2021 కంటే పెరిగిన చెల్లని ఓట్లు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో చెల్లని ఓట్లు భారీగా నమోదవడంపై మేధావివర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. మొత్తం 3,38,179 ఓట్లు పోలవ్వగా 8.25శాతం అంటే 27,990 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2021లో మాత్రం ఈ సంఖ్య తక్కువగా ఉంది. ఆ ఎన్నికలో 2,79,970 ఓట్లు పోల్‌కాగా, 5.54శాతం అంటే 15,533 ఓట్లు చెల్లకుండా పోయాయి.

ద్వితీయ ప్రాధాన్య ఓట్లపై బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతు

ఎమ్మెల్సీ ఎన్నిక పోరు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో చెల్లని ఓట్లు 8.25 శాతం నమోదయ్యాయి. గ్రాడ్యుయేట్లు అయినా, ఓటు వేయడంలో పొరపాట్లు చేయడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించారనే వాదనా ఉంది. స్వతంత్ర అభ్యర్థుల ఎలిమినేషన్‌ రౌండ్లలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో సైతం మొదటి ప్రాధాన్యంలో ఆధిక్యత సాధించిన కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకే ఆధిక్యత దక్కింది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ రౌండ్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డికి 5,232 ఓట్ల ఆధిక్యత వచ్చింది. అయితే అప్పటికే మల్లన్నే 14,722 ఓట్ల ఆధిక్యంలో ఉండడంతో ఎన్నికల సంఘం అధిక ఓట్లు సాధించిన మల్లన్ననే విజేతగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి తొలి ప్రాధాన్య ఓట్లు 48,874 వస్తే, ద్వితీయ ప్రాధాన్య లెక్కింపులో వాటిలో 15,086 మంది ఎవ్వరికీ రెండో ప్రాధాన్యం ఇవ్వలేదు. మిగిలిన వాటిలో బీఆర్‌ఎ్‌సకు 19,510 ఓట్లు, కాంగ్రె్‌సకు 14,278 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో కొనసాగి ఉండడం, కాంగ్రె్‌సను పూర్తిగా వ్యతిరేకించే బీజేపీ అనుకూల గ్రాడ్యుయేట్లు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్‌ అయితే అందులో 80శాతం వరకు తమ అభ్యర్థికే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు దక్కుతాయని భావించిన బీఆర్‌ఎస్‌ ఆశలు ఫలించలేదు. ద్వితీయ ప్రాధాన్యంలో ఎవ్వరికీ ఓటేయని 15,086 మంది ఓటర్లు ఒకవేళ రెండో ప్రాధాన్యాన్ని కేటాయించి ఉంటే ఫలితం తారుమారయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు.

గణనీయ ఓట్లు సాధించిన అశోక్‌కుమార్‌

ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నల్లగొండకు చెందిన పాలకూరి అశోక్‌కుమార్‌ గణనీయ ఓట్లు సాధించి మూడు ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన గతంలో పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేయగా, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పోటీపరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తక్కువ ధరతో ఆన్‌లైన్‌ క్లాసుల సబ్‌స్ర్కిప్షన్‌ను ఇస్తుండడం ద్వారా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఆయన చేరవయ్యారు. ఆయన అభ్యర్థిగా బరిలో నిలవడంతో ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఆదరణ లభించినట్టుగా భావిస్తున్నారు. ఆయనకు తొలిప్రాధాన్యంలో 29,697 ఓట్లు రాగా, ఎలిమినేషన్‌ రౌండ్లలో మరో 764 ఓట్లు కలిపి మొత్తంగా 30,461 ఓట్లు వచ్చాయి.

2021లో, ప్రస్తుత ఎన్నికలో అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్య ఓట్లు

పార్టీ 2021లో వచ్చిన 2024లో వచ్చిన

అభ్యర్థి ఓట్లు అభ్యర్థి ఓట్లు

కాంగ్రెస్‌ రాములు నాయక్‌ 27,713 తీన్మార్‌ మల్లన్న 1,22,813

బీఆర్‌ఎస్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1,11,190 ఏనుగుల రాకే్‌షరెడ్డి 1,04,248

బీజేపీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 39,268 గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 43,313

టీజేఎస్‌ కోదండరామ్‌ 70,472 -

సీపీఐ జయసారథిరెడ్డి 8,732 -

స్వతంత్ర తీన్మార్‌మల్లన్న 83,629 పాలకూరి అశోక్‌కుమార్‌ 29,697

చెల్లనివి 15,533 చెల్లనివి 27,990

Updated Date - Jun 10 , 2024 | 02:04 AM