Share News

పాడి రైతులకు పశుగ్రాసం కొరత

ABN , Publish Date - Aug 25 , 2024 | 12:17 AM

వానాకాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో అంటే వేసవి కాలంలో పశుగ్రాసానికి గడ్డుకాలం ఏర్పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో భూముల విలువ పెరగడం, రైతులు పశువులకు ఏ మాత్రం భూమి వదలకుండా వరి, పత్తి పం టలు సాగుచేయడంతో పశువుల గడ్డికి బీడు భూములు లే కుండా పోయాయి.

పాడి రైతులకు పశుగ్రాసం కొరత

రానున్న రోజుల్లో మరింత గడ్డుకాలమే

గ్రాసం కొరత తీర్చేందుకు అధికారుల ప్రణాళికలు

ఉమ్మడి జిల్లాలో సబ్సిడీపై 155క్వింటాళ్ల విత్తనాలు

నల్లగొండ: వానాకాలంలో పశుగ్రాసం కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో అంటే వేసవి కాలంలో పశుగ్రాసానికి గడ్డుకాలం ఏర్పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో భూముల విలువ పెరగడం, రైతులు పశువులకు ఏ మాత్రం భూమి వదలకుండా వరి, పత్తి పం టలు సాగుచేయడంతో పశువుల గడ్డికి బీడు భూములు లే కుండా పోయాయి. పశుగ్రాసం కొరత తీరాలంటే రైతులు వ్యవసాయ భూముల్లో కొంత భాగాన్ని గ్రాసానికి కేటాయించాలని, దీంతో పాలు, మాంసం ఉత్పత్తి పెరిగి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 10లక్షలకు పైగా పశుసంపద ఉంది. గేదెలు, ఆవులతో పాటు ఎద్దులు, మేకలు,గొర్రెలు, తదితర జీవాలకు పశుగ్రాసం అవసరం. అ యితే రైతులు పూర్తిగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేస్తుండటం తో పశుగ్రాసంపై దృష్టి సారించడం లేదు. అవసరం అనుకుం టే కొంత గడ్డిని కొనుగోలు చేస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా పశుగ్రాసం పెంపకానికి భూమి, నీరు కేటాయించాల్సి వస్తుందన్న భావంతో రైతులు పట్టించుకోకపోవడంతో గ్రాసం సమ స్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పాడి రైతులకు పశుగ్రాసం వి త్తనాలు సరఫరా చేసి ఆ తరువాత ఇతర పశువుల అవసరా లకోసం గడ్డినిసేకరించే ప్రయత్నాలు అధికారులు చేపట్టనున్నారు.

ఇతర జిల్లాల నుంచి ఎండుగడ్డి కొనుగోలు

ఉమ్మడి జిల్లాలో పశుగ్రాసం కొరత కారణంగా మూగ జీవాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో 14లక్షలకు పైగా పశుసంపద ఉండగా ప్రస్తుతం 10 లక్షలకు పడిపోయింది. రైతులు యాంత్రీకరణపై దృష్టి సారిం చి పశువులను కొనుగోలు చేయలేక గడ్డి తెచ్చి మేపలేక పాడి ని దూరం పెడుతున్నారు. ఇక పాడి ఉన్న రైతులు పశుగ్రా సం కారణంగా ఇతర జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్‌ గడ్డికి రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ధర ఉంది. వరి నూర్పిడి సమయంలో హార్వేస్టర్లతో కోతలు సాగిస్తుండటంతో ఆ గడ్డి పనికి రాకుండాపోతోంది. కొందరు రైతు లు వరి కోతల సమయంలో గడ్డి కట్టలను యంత్రాల ద్వారా చుట్టి ఉంచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా పా ల ఉత్పత్తులపై ఆధారపడే రైతులకు గడ్డి కొనుగోలు భారం గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో వాణిజ్య పంటల తో పాటు మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసేవారు. దీంతో వాటి సొప్ప పచ్చి మేతగా పాడి పశువులకు ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది.

పచ్చిమేతతో పాల ఉత్పత్తులను పెంచేలా

ఉమ్మడి జిల్లాలో పశుగ్రాసం కొరత నివారించేందుకు ప్రభు త్వం చర్యలు ప్రారంభించింది. పాడి పశువులకు పచ్చిమేత కోసం 75శాతం సబ్సిడీతో పశుగ్రాసం విత్తనాలు అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా పాడి రైతులకు సబ్సిడీపై విత్తనా లు ఇవ్వాలని నిర్ణయించి ఉమ్మడి జిల్లాలో 155మెట్రిక్‌ టన్ను ల పశుగ్రాసం విత్తనాలను జిల్లా పశుసంవర్ధక శాఖకు కేటాయించింది. ఈ విత్తనాలు అన్ని పశుసంవర్ధకశాఖకు చెందిన కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. 5కి లోల గడ్డి విత్తనాల సంచి ధర రూ.455 కాగా, ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో రూ.144కే అందజేస్తోంది. నల్లగొండ జిల్లాకు 120మెట్రిక్‌ టన్నులు, యాదాద్రి జిల్లాకు 25 క్వింటాళ్లు, సూర్యాపేట జిల్లాకు 10క్వింటాళ్ల గడ్డి విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. గతంలో పశుసంవర్ధక శాఖను సబ్సిడీ విత్తనాల గురించి ఇండెంట్‌ కోరగా, నల్లగొండ జిల్లాకు అత్యధికంగా విత్తనాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఆ యా జిల్లా ఇండెంట్‌ ప్రకారం విత్తనాలను కేటాయించారు. ఈ విత్తనాలను పశుసంపద కలిగిన రైతులకు సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఈ విత్తనాలు ఒకసారి వేస్తే పలుమార్లు సార్లు కటింగ్‌ చేస్తూ గ్రాసాన్ని ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత ద్వారా పాలదిగుబడులు సైతం పెరుగుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో పాల దిగుబడి తగ్గిపోవడం తో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా నుంచి గతంలో పాల ఎగుమతి ఉండగా, ప్రస్తుతం ప్రైవేట్‌ కంపెనీల పాల ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.

భారంగా మారిన పశుపోషణ

పశు పోషణ పాడి రైతులకు భారంగా మారింది. దీనితోనే రైతులు పశుసంపదను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున పాల ఉత్పత్తులతో ఆర్థికంగా గట్టెక్కేవారు. ప్రతీ రోజు వివిధ కంపెనీలకు 2.50లక్షల లీటర్లకు పైగా పాలు ఎగమతి చేసి 15 రోజులకోసారి పాడి రైతులు డబ్బు పొందేవారు. దీంతో వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ప్రస్తుతం పాలదిగుబడి 50శాతానికి పడిపోయింది. పచ్చిమేత, దాణా ధరలు పెరిగాయి. దీంతో పాడి గేదెలతోపాటు ఆవులను పెంచేందుకు రైతులు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే పశుగ్రాసం విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి పశుసంపదను పెంచేలా ప్రణాళిక అమలుచేస్తోంది.

గడ్డి విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి : సదానందం, నల్లగొండ జిల్లా పశువైద్యాధికారి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాడి రైతులకు పశుగ్రాసం విత్తనాలు అందజేస్తున్నాం. 75శాతం సబ్సిడీతో విత్తనాలు ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని అన్ని పశుసంవర్ధకశాఖ కేంద్రాల్లో ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. పశుసంపద ఉన్న రైతులు వీటితో గ్రాసాన్ని పెంచి పాల దిగుబడి పెంచుకోవాలి.

Updated Date - Aug 25 , 2024 | 12:17 AM