Share News

తొలి రోజు 7 నామినేషన్లు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:40 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ స్థానాలకు తొలిరోజు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలి రోజు 7 నామినేషన్లు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందనకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌

ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ఈ నెల 25వ తేదీ వరకు గడువు, 29న ఉపసంహరణ

నల్లగొండ, భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 18: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ స్థానాలకు తొలిరోజు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్లగొండ లోక్‌సభ స్థానానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన, భువనగిరి స్థానానికి జిల్లా ఎన్నికల అధికారి హనుమంతు కే.జెండగే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. అనంత రం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. నల్లగొండలో తొలి రోజు నలుగురు అభ్యర్ధులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండకు చెందిన మాజీ ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌ స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన ప్రతిపాదకుడు మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సోషలిస్టు పార్టీ (ఇండియా) తరఫున రచ్చ సుభద్రారెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ను, ప్రజావాణి పార్టీ తరపున లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. మొదటి రోజు ప్రధాన పార్టీ అయిన బీజేపీ అభ్యర్థి తరపున ఆ పార్టీ నాయకులు నామినేషన్‌ దాఖలు చేశారు.

భువనగిరి పార్లమెంట్‌ నియోజవకర్గంలో తొలిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు భువనగిరిలోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి హనుమంతుకె.జెండెగకు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రజవాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థిగా బెతి నరేందర్‌ ఒక సెట్‌, మరో స్వతంత్ర అభ్యర్థి మర్రి స్వామి ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచి రోజు చూసుకుని నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈనెల 20, 21, 22, 24 తేదీల్లో మంచి రోజు లు ఉండటంతో ఈ తేదీల్లో అత్యధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. శుభఘడియలు ఉన్న రోజుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ అనుచరగణంతో ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, నామినేషన్ల సందర్భంగా ఆర్వో కార్యాలయమైన కలెక్టరేట్‌ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించారు. అదేవిధంగా ప్రతీ అభ్యర్థికి మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారు. నామినేషన్లకు ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉంది. సెలవు రోజుల్లో మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26న నామినేషన్లను పరిశీలించనుండగా, 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించేందుకు గడువు ఉంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్‌ నిర్వహించనుండగా, జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

క్యామ, కంచర్లకు భీపాంలు అందజేసిన కేసీఆర్‌

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేస్తున్న క్యామ మల్లే్‌ష, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా కంచర్ల కృష్ణారెడ్డికి గురువారం హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఫాంలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:40 PM