Share News

నిప్పుల కొలిమి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:54 AM

భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు విలవిల్లాడారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 44.8, సూర్యాపేట జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నిప్పుల కొలిమి

నిడమనూరులో 44.8డిగ్రీలు ఫ ‘సూర్యా’పేట 44.7డిగ్రీలు

సూర్యాపేటటౌన్‌ / నల్లగొండ, ఏప్రిల్‌ 17 : భానుడి ఉగ్రరూపంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు విలవిల్లాడారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 44.8, సూర్యాపేట జిల్లాలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లేందుకు వెనుకడుగు దీంతో దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువ గా ఉండడంతో రోజు కూలి పనులకు వెళ్లే వారు ఒక రోజు కూలీకి వెళ్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. రోడ్లపై తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్లవిక్రేతలు గొడుగు నీడలో వ్యాపారం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో గరిష్ఠంగా 44.8 డిగ్రీలు, చింతపల్లి మండలం గొడకండ్ల గ్రామంలో కనిష్ఠంగా 39.1డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో గరిష్ఠంగా 44.7డిగ్రీలు, తుంగతుర్తి మండలంలో కనిష్ఠంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గరిష్ఠంగా గుండాల మండలంలో 43.5 డిగ్రీలు, తుర్కపల్లి మండలం మన్నెవారి తుర్కపల్లి గ్రామంలో 39.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లాలోని 10 ప్రాంతాల్లో 44డిగ్రీలకు పైగా, సూర్యాపేట జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో 44డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలకు చిన్న పిల్లలు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారు.

పండ్ల రసాలకు పెరిగిన డిమాండ్‌

జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పండ్ల రసాల సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం పనినిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు గొంతు తడారకుండా పండ్ల రసాలను తీసుకుంటున్నారు. దీంతో ఆయా వ్యాపారాలకు డిమాండ్‌ పెరిగింది. నిమ్మకాయల సోడా, పండ్లు, చెరుకు రసాలు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు.

బయటకు రావాలంటే భయమేస్తోంది: సరోజన, గృహిణి

ఎండ తీవ్రతతో బయటకు రాలేకపోతున్నాం. ఇంట్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. నిత్యం ఫ్యాన్లు, కూలర్లను వాడాల్సి వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కరెంట్‌ బిల్లు అధికంగా వచ్చేలా ఉంది. ఏచిన్న పని ఉన్నా ఉదయం చూసుకుంటున్నాం.

అవసరమైతేనే బయటకు రావాలి: కోటా చలం, డీఎంహెచవో

అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. వడదెబ్బ తగిలితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స తీసుకోవాలి. ఎండ నుంచి ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తలపై వసా్త్రలు ధరించాలి. నిత్యం మంచినీటిని సేవించాలి. ఏచిన్న సమస్య ఉన్నా వైద్యుల సలహాలు పాటించాలి. వడదెబ్బ తగిలితే 108కి సమాచారం ఇవ్వాలి.

Updated Date - Apr 18 , 2024 | 12:54 AM