Share News

నిప్పుల కొలిమి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:53 PM

గత ఏడాదికి భిన్నంగా ఈ సంవత్సరం మార్చి మొదటివారం నుంచే సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జనంతో పాటు మూగజీవాలు సైతం తల్లడిల్లిపోతున్నాయి.

నిప్పుల కొలిమి

మండుతున్న ఎండలు

భానుడి భగభగతో తల్లడిల్లుతున్న జనం

మూగజీవాలది అదే పరిస్థితి

నల్లగొండ, ఏప్రిల్‌ 3: గత ఏడాదికి భిన్నంగా ఈ సంవత్సరం మార్చి మొదటివారం నుంచే సూర్యుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జనంతో పాటు మూగజీవాలు సైతం తల్లడిల్లిపోతున్నాయి. ఏప్రిల్‌ ప్రారంభమైన మూడు రోజుల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 1న 40 డిగ్రీలు, 2న 40.5, 3న 40.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఈ ఎండలు ఇంకా రెండు నెలలకు పైగా ఉంటాయని వాతావరణ నిపుణులు ప్రక టనతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండలకు వడ గాడ్పులు తోడవుతున్నాయి. జూనలో మృగశిర కార్తె వచ్చేనాటికి అడపాదడపా అకాల వర్షాలు కురిస్తేనే కొంతమేర వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలుంటాయి. వర్షాలు పడకపోతే ఎండలు అధిక మయ్యే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఎండల తీవ్రతకు తాగునీటికి కూడా కటకట ఏర్పడింది. మనుషులతో పాటు మూగజీవాలు సైతం తాగునీటికి తల్లడిల్లే పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి తాగునీటి విడుదల కావ డంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. అధిక ఉష్ణోగ్రతతో నాగార్జునసాగర్‌లో కోతులు తాగునీటి కోసం మినీట్యాంకు ఎక్కి అందులో పడి 30 కోతులు చనిపోవడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తోంది.మూగజీవాలు నీటికోసం ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఈ ఘటన అద్దంపడుతోంది. అదేవిధంగా పక్షులు సైతం చెరువులు కుంటల్లో నీరు లేక అల్లాడుతున్నాయి. ఇదిలా ఉంటే చిన్నారులు, వృద్ధులు ఎండలకు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేడిమి తగ్గటం లేదు. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. పగటిపూట చాలా ప్రాంతాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై జనం లేక వెలవెలబోతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు మంచినీటితో పాటు కూల్‌డ్రింక్‌లను, పండ్ల రసాలు, మజ్జిగను తీసుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలోకి వెళ్లేవారు గొడుగులతోపాటు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:53 PM