Share News

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:15 AM

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కారోబార్‌తండాలో విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందింది.

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
నేనావత కమిలి(ఫైల్‌)

కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 25: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కారోబార్‌తండాలో విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందింది. ఎస్‌ఐ రాంమూర్తి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొండమల్లేపల్లి మండలం వడ్త్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని కారోబార్‌తండాకు చెందిన నేనావత కమిలి(45) భర్త హేమ్లాతో కలిసి తమకున్న రెండు ఎకరాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం తమ పొలంలో యూరియా చల్లేందుకు వెళ్లింది. గాలులకు తెగి పొలంలో వేలాడుతున్న 11 కేవీ విద్యుత తీగలు కమిలి తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి ఏడు గంటలైనా కమిలి ఇంకా ఇంటికి రాకపోవడంతో భర్త హేమ్లా గ్రామస్థులతో కలిసి వెతకగా, పొలంలో విగత జీవిగా కనిపించింది. కమిలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కమిలి భర్త హేమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంమూర్తి తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 12:15 AM