Share News

శిథిల భవనాలతో భయం భయం..

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:01 AM

వర్షాకాలంలో శిథిల భవనాలతో ప్రమాదం పొంచివుంది. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండగా, వాటిలో నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.

శిథిల భవనాలతో భయం భయం..

వర్షాకాలంలో పొంచివున్న ప్రమాదం

ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)/ భువనగిరిటౌన్‌,రామగిరి,దేవరకొం డ, మిర్యాలగూడటౌన్‌, డిండి, నార్కట్‌పల్లి, చింతపల్లి, మోటకొండూర్‌, భువనగిరి రూరల్‌, చౌటుప్పల్‌ రూరల్‌, చౌటుప్పల్‌ టౌన్‌, వలిగొండ : వర్షాకాలంలో శిథిల భవనాలతో ప్రమాదం పొంచివుంది. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండగా, వాటిలో నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మెజార్టీ శిథిల భవనాలను యజమానులు ఖాళీ చేయగా, మరికొన్నింటిలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రమాదాల నివారణకు వర్షాకాలం ప్రారంభానికి ముందే శిథిల భవనాలను తొలగించాలని యజమానులకు మునిసిపాలిటీ అధికారులు నోటీసు జారీ చేసిన కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఈ భవనాల కారణంగా చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్‌ విలాస్‌ సెంటర్‌ ప్రాంతంలో పాత భవనం శిథిలావస్థలో ఉంది. ఈ భ వనంలో నాలుగు నుంచి ఐదు వరకు చిరు దుకాణాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఇక్కడికి కొనుగోలుదారులు వస్తుంటారు. ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. నల్లలబావి సమీపంలో పాతబడిన భవనంలో ఓ కుటుంబం నివాసం ఉం టోంది. భీమారం రోడ్డు కృష్ణా థియేటర్‌ ప్రాంతంలో సుమారు 5 నుంచి 8 వరకు పా త భవనాలు ఉండగా, వాటిలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అలంకార్‌ థియేటర్‌ ప్రాంతంలో పాత భవనంలో కుటుంబాలు నివసించడంతో పాటు పూలదుకాణాలు నిర్వహిస్తున్నారు. బొడ్రాయి బజార్‌ సమీపంలో పలు భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుందరయ్యనగర్‌లో పేదల కోసం 2009లో అప్ప టి ప్రభుత్వం 96 ఇళ్లతో కలిపి ఒక అపార్ట్‌మెంట్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థలో ఉంది. వీటితోపా టు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు ఉన్నాయి. వర్షాలకు తడిసి ఇంటి పైకప్పులు, గోడలు నానుతున్నాయి. ఇవి ప్రమాదకరంగా ఉన్న ప్రజలు నివాసం ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి కూల్చివేయాల్సిన అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది నాగారం మండల కేంద్రంలో ఓ ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు. ఆ ఇంటిని ముందుగానే గుర్తించి ఖాళీ చేయిస్తే ప్రాణాలు దక్కేవి.

నోటీసులు జారీచేసినా

జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో గతఏడాది శిథిలావస్థ కు చేరిన భవనాలకు మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. అయి తే అది ఎక్కడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. గతంలో వర్షాకాలం ప్రారంభంలో జిల్లాలోని సూర్యాపేట మునిసిపాలిటీలో 41, కోదాడలో ఏడు, హుజూర్‌నగర్‌లో ఆరు, నేరేడుచర్లలో మూడు, తిరుమలగిరిలో ఆరు భవనాలకు మునిసిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంకా సమగ్రంగా సర్వే చేస్తే పురాతన భవనాల సంఖ్య పెరిగే అ వకాశం ఉంది. గ్రామాల్లో కూడా శిథిలావస్థకు చేరిన ఇళ్లు ఉన్నాయి. వాటిని పంచాయతీ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేయడంతోపాటు కూల్చివేయించాల్సి ఉంది.

భువనగిరిలో..

భువనగిరి పట్టణంలో 40కి పైగా శిథిల భవనాలు ఉన్నాయి. వాటిలో మెజార్టీ గృహాలు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిలో యజమానులు నివాసం ఉంటున్నారు. ఈనేపథ్యంలో మునిసిపల్‌ సిబ్బంది మూడు ఇళ్లను నేలమట్టం చేశారు. శిథిల గృహాలు పాత బస్తీలలో అధికంగా ఉన్నాయి. మునిసిపల్‌ నోటీసులపై యజమానులు స్థాని క నాయకులను ఆశ్రయిస్తుండడంతో వాటి తొలగింపులో రాజకీయ ప్రమేయం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. గత వర్షాకాలం సీజన్‌లో మునిసిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేయగా, అప్పట్లో 15కు పైగా శిథిల భవనాలను యజమానులు, మునిసిపల్‌ సిబ్బంది తొలగించారు.

మోటకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన బొట్ల శ్రీనివాస్‌ ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షానికి గోడ సహా ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో ఇంటిపై పరాదలు, ప్లెక్సీలు అడ్డుగా కప్పి నివాసం ఉంటున్నారు. ఫ భువనగిరి మండలంలో గత ఏడాది పల్లె ప్రగతి కార్యక్రమంలో 34 పంచాయతీ పరిధిలో పూర్తిగా శిథిలావస్థకు చేరిన సుమారు 800 ఇళ్లను కూల్చివేశారు. ఆరు నెలల క్రితం మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు పైకప్పు, గోడలు పూర్తిగా ధ్వంసమైన 15 ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీచేశారు. ప్రస్తుత వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఐదు ఇళ్లను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేస్తామని తెలిపారు. ఫ చౌటుప్పల్‌ మండలం దామెరలో పెరుమళ్ల అంజమ్మ, పెరుమళ్ల అమృత, సాతిరి లక్ష్మమ్మ ఇళ్లు శిథిలావస్థకు చేరి వర్షం వస్తే కూలే దశలో ఉన్నాయి. ఫ చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో విలీన పంచాయతీలు తంగడపల్లి, లింగోజీగూడెం, తాళ్లసింగారం, లక్కారం, లింగారెడ్డిగూడెంలో శిథిల గృహాలు ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన ఇళ్లు 40 నుంచి 50 వరకు ఉండవచ్చునని అధికారుల అంచనా. పెంకుటిళ్లు దెబ్బతినడంతో వర్షపు నీరు ఇంటిలోకి వస్తోందని, దీంతో ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి భయం భయంగా నివాసం ఉంటున్నామని, ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని బీసీ కాలనీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఎండి.ఖాదర్‌ కోరుతున్నాడు. ఫ వలిగొండ మండలంలో పులిగిల్ల, వేములకొండ గ్రామాల్లో శిథిల గృహాలు ఉన్నాయి. పులిగిల్ల గ్రామంలో మొత్తం 876 ఇళ్లు ఉండగా, 25 కుటుంబాలకు అసలు ఇళ్లే లేవు. వారు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కొన్ని శిథిల గృహాలు వానలకు దెబ్బతినకుండా గోడలపై టార్పాలీన్లు కప్పి పలువురు నివాసం ఉంటున్నారు.

నల్లగొండలో..

ఫ నల్లగొండ పట్టణంలో ప్రధానంగా పాతబస్తీ, మాన్యంచెల్క, అక్కచెలమ, శ్రీకృష్ణనగర్‌, బీటీఎస్‌ ప్రాంతాల్లో అధికంగా శిథిల భవనాలు ఉన్నాయి. వీటి యజమానులు ఉద్యోగం, వ్యాపారరీత్య హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో ఉండటంతో ఆలనాపాలన లేక భవనాలు శిథిలావస్థకు చేరాయి. పాతబస్తీ సిమెంట్‌ రోడ్‌లో పలు భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉండగా, అటుగా వెళ్లే బాటసారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో 70కిపైగా శిథిల భవనాలు ఉన్నాయి. ఇందులో 28 ప్రమాదకరంగా ఉన్నట్టు మునిసిపల్‌ అధికారులు గుర్తించారు. వాటిని తక్షణమే తొలగించాలని నెలరోజుల క్రితమే మునిసిపల్‌ అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా భవనాలను తొలగించడం లేదా సరిచేసుకోవాలని నోటీసులో పేర్కొన్నా, సంబంధిత యజమానులు నేటికీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ఫ దేవరకొండలో మునిసిపల్‌ అధికారులు 35 శిథిల భవనాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో 25కుపైగా భవనాలను ఖాళీ చేశారు. మరికొంత మంది ప్రత్యామ్నాయంగా రేకుల షెడ్డులను ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. అదేవిధంగా మండలంలో శిథిల ఇళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే మండల పంచాయతీ అధికారి నీలిమా ఆదేశాలు జారీచేశారు. ఫ మిర్యాలగూడ పట్టణంలో పెద్దబజార్‌. నెహ్రూనగర్‌, సీతారాంపురం, షాబూనగర్‌ తదితర కాలనీలలో శిథిల భవనాలు ఉన్నాయి. ఫ డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఏకుల చంద్రయ్యతోపాటు ఆయన భార్య రంగమ్మ, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి మట్టి గోడలతో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలకు కూలీపోయే స్థితిలో ఉన్న మట్టి మిద్దెలో కాలం వెళ్లదీస్తూ బిక్కు, బిక్కుమంటు నివాసం ఉంటున్నారు. కూలీ, నాలి చేసుకొని జీవించే వీరు పక్కాగృహం నిర్మించుకునే స్థోమతలేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఫ నార్కట్‌పల్లి మండల వ్యాప్తంగా సుమారు 200కు పైగా శిథిలావస్థకు చేరిన నివాసాలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ‘పల్లె ప్రగతి’ కింద 15 రోజుల పాటు శిథిలావస్థకు చేరిన నివాసాలను గుర్తించే కార్యక్రమం చేపట్టి ప్రమాదకర ఇళ్లను కూల్చాలని పంచాయతీ అధికారులు యజమానులకు నోటీసులు జారీచేశారు. కొన్నింటిని కూల్చగా, మరికొన్ని అలానే ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతిగది పైకప్పు పెచ్చులూడి విద్యార్థులున్నపుడే పడిన సంఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది.

నా ఇంటికి మరమ్మతు చేయించాలి

భువనగిరి జిల్లా కేంద్రంలోని శివనగర్‌కు చెందిన సుమారు 75 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు పలకబండ జంగమ్మ శిథిలావస్థకు చేరిన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆ ఇంటిని తొలగించాలని మునిసిపల్‌ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. ఆమెను మరో ఇంటికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు మునిసిపల్‌ సిబ్బంది సూచించారు. అయినా ఆమె ఇంటిని ఖాళీ చేసేది లేదని భీష్మిస్తుండడంతోపాటు, తన ప్రాణాలను కాపాడాలనుకుంటే ఇంటికి మరమ్మతులు చేయించాలని అంటోంది.

మూడు గదుల్లో రెండు కూలాయి : ఎండి.అబ్దుల్‌బీ, చౌటుప్పల్‌

శిథిలావస్థకు చేరుకున్న మూడు గదుల ఇంటిలో రెండు గదులు కూలిపోయాయి. ఉన్న ఒక్క గది కురుస్తోంది. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. వర్షం వస్తే ఇంటినిండా నీళ్లు చేరుతున్నాయి. అప్పుడు ఇంటిలో ఓ మూలకు పడుకుంటున్న.

శిథిల గృహాలను గుర్తించాం : పి.రామాంజల్‌రెడ్డి, భువనగిరి మునిసిపల్‌ కమిషనర్‌

భువనగిరిలో శిథిల గృహాలను వర్షాకా లం సీజన్‌కు ముందే గుర్తించి నోటీసులు జా రీ చేశాం. కొద్ది మంది గృహాలను తొలగించుకున్నారు. ఒకటి, రెండు ఇళ్లలో మాత్రమే యజమానులు, వారి బంధువులు ఉంటున్నారు. వారిని కూడా ఖాళీ చేయించేందు కు ప్రయత్నం చేస్తున్నాం. నోటీసులకు స్పందించకుంటే యజమానులపై చర్యలు తీసుకుంటాం. శిథిల గృహాలను తొలగించుకునే ఆర్థికస్థోమత లేనివారికి మునిసిపాలిటీ సహకరిస్తుంది.

స్వచ్ఛందంగా తొలగించుకోవాలి : సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌

నల్లగొండ పట్టణంలో 28 భవనాలు శిథిలావస్థకు చేరినట్టు గుర్తించాం. అందులో కొన్ని మరమ్మతులు చేసుకోవల్సిందిగా, మరికొన్నింటిని తక్షణమే తొలగించుకోవాలని నోటీసుల జారీ చేశాం. నోటీసులు ఇచ్చి 15 రోజులైంది. మరోమారు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను మునిసిపల్‌ సిబ్బందితో తొలగిస్తాం.

గతంలోనే నోటీసులు ఇచ్చాం : బి.శ్రీనివాస్‌, సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌

గతంలో సూర్యాపేట పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించి ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చాం. వాటిని కూల్చివేయాలని ఆదేశించాం. ఆ ఇళ్లలో నివాసం ఉండవద్దని సూచించాం. శిథిలావస్థకు చేరిన ఇళ్లు వర్షాలు వచ్చినప్పుడు నాని కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Updated Date - Jul 08 , 2024 | 01:01 AM