నీరందడం లేదని కాల్వలో రైతుల నిరసన
ABN , Publish Date - Sep 21 , 2024 | 11:15 PM
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సాగునీటి కోసం రైతులు శనివారం కాల్వలో నిలబడి నిరసన తెలిపారు.
మాడ్గులపల్లి, సెప్టెంబరు 21: నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సాగునీటి కోసం రైతులు శనివారం కాల్వలో నిలబడి నిరసన తెలిపారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని, రెండు నెలలుగా కాల్వ నీటి కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని డీ-37 కాల్వ నల్లగొండ మండలం గుండ్లపల్లి వద్ద ప్రారంభమై కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ వరకు సుమారు 27.05 కిలోమీటరు వరకు ఉంది. సుమారు 42వేల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందించడంతో పాటు 19 చెరువులను నింపేందుకు ప్రభుత్వం ఈ కాల్వ నిర్మించింది. ఏఎమ్మార్పీ కాల్వ ద్వారా నీటి విడుదల ఆగస్టు నుంచి కొనసాగుతున్నా, చివరి భూములకు నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాడ్గులపల్లి మండలం గోపాలపురం, మాచినపల్లి గ్రామాలకు చెందిన 20మంది రైతులు శనివారం కాల్వలో నిలబడి నిరసన తెలిపారు. రెండు నెలలుగా కాల్వకు నీటి విడుదల చేసినా చివరి భూములకు రావడంలేదని దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు ఎక్కువ మంది రైతులు బత్తాయి సాగు చేశారు. కాల్వకు నీరు రాకపోవడంతో బోరుబావులు అడుగంటిపోయాయని, కాల్వలో నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచితే చివరి భూములకు నీరందడంతో పాటు భూగర్భజలాలు పెంపొందుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగువన ఉన్న అన్నారం, బసిరెడ్డిపల్లి, ముశంపల్లి, ఎల్గపల్లి గ్రామాల రైతులు కాల్వకు అక్రమ తూములు ఏర్పాటుచేయడంతో నీరు చివరి భూములకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో నీటి కోసం వెళ్తే బసిరెడ్డిపల్లి గ్రామస్థులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీ-37 కాల్వ ద్వారా చివరి భూములకు నీరరందితే మాడ్గులపల్లి మండలంలోని గోపాలపురం, మాచినపల్లి, కన్నెకల్, కేశవాపురం గ్రామాల్లోని మూడు వేల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా, నీరు అందకపోవడంతో బోరుబావుల ఆధారంగా రైతులు సుమారు 1,000 ఎకరాల్లో వేసుకున్న వరి పొలాలు, బత్తాయి తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వల పర్యవేక్షణ చేసి అక్రమంగా ఏర్పాటుచేసిన తూములను తొలగించి చివరి భూములకు నీరందించాలని రైతులు బోడ యాదయ్య, జూలకంటి శ్రీనివా్‌సరెడ్డి, రమే్‌షరెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మణ్, శంకర్, వెంకటయ్య, యాదయ్య, అంజయ్య, కొమురయ్య, వెంకన్న, కొండలుతో పాటు పలువురు కోరుతున్నారు. సుమారు గంటకు పైగా నిరసన వ్యక్తం చేసి చివరి భూములకు నీరందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.