ఎంపీ టికెట్లపై కసరత్తు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:53 AM
రాజకీయపార్టీల్లో లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. కేంద్రం లో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ గతానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదలచేయడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సపై ఒత్తిడి పెరిగింది.
తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సపై ఒత్తిడి
కాంగ్రెస్ టికెట్ కోసం యువనేతల పోటాపోటీ
తమకు చాన్స్ ఇవ్వాలంటున్న బీసీ నేతలు
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకి బీజేపీ గాలం
నల్లగొండ ఎస్టీలకు ఇవ్వాలని బీఆర్‌ఎస్ కీలకనేతల ప్రతిపాదన
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): రాజకీయపార్టీల్లో లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది. కేంద్రం లో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ గతానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదలచేయడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సపై ఒత్తిడి పెరిగింది. బీజే పీ ప్రకటించిన తొలిజాబితాలో ఉమ్మడి జిల్లాలోని రెండు సీట్ల లో ఒకటైన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి గా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరును ప్రకటించడం తో సామాజిక సమీకరణాలూ తెరపైకి వచ్చాయి. నల్లగొండ స్థానాని కి బీజేపీ ఎవరిని ఎంపికచేస్తుందనే అంశంతో పాటు, రెండు సీట్ల లో అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహాలు అనుసరించనున్నాయనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలోని రెండు సీట్లపై దృష్టిసారించిన బీజేపీ, భువనగి రి అభ్యర్థిగా తొలి జాబితాలోనే మాజీ ఎంపీ, బీసీనేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరును ప్రకటించింది. నల్లగొండ స్థానానికి అభ్యర్థిగా బలమైన వ్యక్తిని బరిలోదింపేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి, నూకల నరసింహారెడ్డి నల్లగొండ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధిష్ఠా నం జనాదరణ కలిగిన నేతలు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై కన్నేసినట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా సాగర్ ఆయకట్టు ప్రాంతానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేతో బీజేపీ కీలకనేతలు చర్చించారని, పార్టీలోకి వస్తే ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రతిపాదించగా, సదరు మాజీ ఎమ్మెల్యే ముఖ్యఅనుచరులు, సన్నిహితులతో ఈ విషయమై సమాలోచనలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన కీలకనేత, నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గణనీయ ఓట్లు సాధించిన పిల్లి రామరాజు యాదవ్ అభ్యర్థిత్వంపైనా బీజేపీలో చర్చ సాగుతోంది. నల్లగొండ స్థానం నుంచి కూడా బీజేపీ బలమైన అభ్యర్థినే బరిలో దించనుంది.
బీఆర్‌ఎస్ అభ్యర్థులెవరో?
లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే వ్యూహంతో ఉన్న బీఆర్‌ఎస్ పలు సమీకరణాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి ఇటు నల్లగొండ, అటు భువనగిరి నియోజకవర్గాల్లో అధిష్ఠానం ఎక్కడ అవకాశమిస్తే అక్కడ పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో పాటు, ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ స్థానం నుంచి అమిత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ తేరా చిన్నపరెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి సైతం టికెట్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఈ స్థానంలో గిరిజనుల ఓట్లు అధికంగా ఉన్నందున, ఆ సమాజికవర్గానికి చెందిన నేతను బరిలో దింపడం ద్వారా కాంగ్రెస్, బీజేపీని సులభంగా ఢీకొట్టవచ్చని భావిస్తున్న బీఆర్‌ఎ్‌సలోని కీలకనేతలు ఈ సమీకరణాలపై అధిష్ఠానంతో చర్చిస్తున్నారు. ఈ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, డాక్టర్ మాతృనాయక్, రాంచందర్‌నాయక్, వడ్త్యా రమే్‌షనాయక్ తదితర నేతల పేర్లను అధిష్ఠానానికి కీలకనేతలు సూచిస్తున్నారు. భువనగిరి స్థానం నుంచి గుత్తా అమిత్‌రెడ్డితో పాటు, తెలంగాణ ఉద్యమనేత జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ల శేఖర్‌రెడ్డి టికెట్ కోసం బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి సైతం టికెట్లను కీలక నేతలే ఆశిస్తుండడంతో, అధిష్ఠానం అభ్యర్థులను త్వరగా తేల్చాలని క్యాడర్ కోరుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఘన విజయం సా ధించిన కాంగ్రె్‌సలో ఎంపీ టికెట్లు ఎవరికి వరిస్తాయనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. యువనేతలు పోటాపోటీగా అధిష్ఠా నం వద్ద లాబీయింగ్ చేస్తుంటే, అధిష్ఠానం మాత్రం సీఎం, మం త్రులు, కీలకనేతల అభిప్రాయాలతో పాటు, సునీల్‌కనుగోలు నివేదిక ద్వారా అభ్యర్థిని ఎంపికచేసే ప్రక్రియను ముమ్మరం చేసింది. నల్లగొం డ స్థానం నుంచి తన కుమారుడు పీసీసీ ప్రధాన కార్యదర్శి కుం దూరు రఘువీర్‌రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి జానారెడ్డి అధిష్ఠానం వద్ద పావులు కదుపుతున్నారు. మరోవైపు తనకు ఏఐసీసీ ముఖ్యనేతలు ఇచ్చిన హామీ ప్రకారం టికెట్ వస్తుందనే విశ్వాసంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమే్‌షరెడ్డి ఉన్నారు. సామాజిక సమీకరణాల ప్రాధాన్యంలో తనకు అవకాశం ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కే.శంకర్‌నాయక్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ స్థానం కోసం కీలకనేతలు పోటీ పడుతుండటంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం పార్టీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. భువనగిరి సీటుకు బీజేపీ ఇప్పటికే బీసీ నేతను అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశం చర్చనీయాంశమైంది. భువనగిరి నియోజకవర్గంలో మూడు పర్యాయాలూ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ బరిలో దిగితే, రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా ఈ కుటుంబానికి చెందిన డాక్టర్ సూర్యపవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తుంటే, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి టికెట్ కోసం బలంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీసీ నినాదంతో పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ తనకు టికెట్ ఇస్తే గెలుస్తానని, అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేతలతో పాటు రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ అఽధ్యక్షుడు వెన్‌రెడ్డి రాజు, తీన్మార్ మల్లన్న సైతం టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
బీజేపీలోకి రమ్మన్న మాట వాస్తవమే : సైదిరెడ్డి, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే
హుజూర్‌నగర్: బీజేపీలోకి తనను రమ్మని ఆ పార్టీ కోరిన మాట వాస్తవమే. కానీ వెళ్లే ఆలోచనలేదు. పార్టీ మారే ఆలోచన అంతకన్నా లేదు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా. బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటా.