అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ABN , Publish Date - Jan 25 , 2024 | 11:32 PM
అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎన్జీ కళాశాల నుంచి రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ హరిచందన
నల్లగొండ టౌన్, జనవరి 25: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎన్జీ కళాశాల నుంచి రామగిరి మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 80ఏళ్లు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద ఉండే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ఓటరు జాబితాలో వారి పేరును సరిచూసుకోవాలని సూచించారు. త్వరలో జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇది వరకు ఓటరుగా ఉన్న వారు సైతం మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 2023 నవంబరు 1కి మూడేళ్ల ముందు, అంటే 2020 నవంబరు 1 నాటికి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైనవారు, నియోజకవర్గంలో నివాసితులైనవారు ఓటరుగా నమోదుకు అర్హులని తెలిపారు. అదనపుకలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. అనంతరం యువ ఓటర్లకు ఫొటో ఓటరు గుర్తింపు కారులను కలెక్టర్ పంపిణీ చేశారు. 80 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లను ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్డీవో రవి, వివిధ శాఖల అధికారులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స వాలంటీర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.