Share News

బత్తాయి సాగుకు గుడ్డుకాలం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:55 PM

ఎవుసం దండగైంది.. ఆరుగాలం చెమటోడ్చి పంట పండించినా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. మార్కెట్లలో దళారుల రాజ్యమైంది. ధర విషయంలో వా రు చెప్పిందే వేదం... కాదంటే రైతన్నకు ప్రత్యామ్నాయ మే కరువు.

బత్తాయి సాగుకు గుడ్డుకాలం

పండించినా విక్రయించుకోలేని పరిస్థితి

దశాబ్దాలుగా దళారులదే హవా

నష్టపోతున్న రైతులు

మిర్యాలగూడ (వ్యవసాయం): ఎవుసం దండగైంది.. ఆరుగాలం చెమటోడ్చి పంట పండించినా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. మార్కెట్లలో దళారుల రాజ్యమైంది. ధర విషయంలో వా రు చెప్పిందే వేదం... కాదంటే రైతన్నకు ప్రత్యామ్నాయ మే కరువు. సర్కారు పట్టించుకోకపోవడంతో బత్తాయి రైతుల వ్యథ ఇదో అంతులేని కథగా మారింది. దశాబ్దాలుగా బత్తాయి కొనుగోలులో దళారుల ప్రమేయం అధికమైంది.

నల్లగొండ ఎర్ర ఇసుక నేలలకు నెలవు. బత్తాయి పంటలకు చాలా అనువైన ప్రాంతం. నీటి వనరుల లభ్యత తక్కువగా ఉండటంతో అందుకు అనువైన బత్తాయి సాగును రైతులు చేపట్టారు. నాలుగు దశాబ్దాలుగా 1990 నుంచే పంట ప్రారంభమై 2000నాటికి సుమారు 2లక్షల ఎకరాలకు చేరుకొని బత్తాయి సాగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ మొదటి స్థానం లో నిలిచింది. ఆ సమయంలో రైతులు మంచి దిగుబడులు కూడా సాధించారు. అయినా రైతులు పెద్దగా ప్రయోజనం పొందలేక పోయారు. కాలక్రమేణా వాతావరణంలో మార్పులతో తోటలు దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. పెట్టుబడులు భారీగా పెరిగాయి. కాయకు స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో పూర్తిగా దళాలరులదే రాజ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలపాలయ్యారు. 2010 నుంచి బత్తాయి సాగు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 40వేల ఎకరాలకు మాత్రమే బత్తాయి పరిమితమైంది.

వారు చెప్పిన ధరకే

బత్తాయిని తోటల వద్ద బేరం కుదుర్చుకునేందుకు ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు ప్రాంతానికి చెందిన వ్యాపారులు నల్లగొండ ప్రాంతానికి సీజన్‌ వారీగా వస్తుంటారు. రైతుల ను మచ్చిక చేసుకుని వారు వ్యాపారాలు చేస్తుంటారు. ఇక్కడ వ్యాపారులు సిండికేట్‌గా మారి డిమాండ్‌ను అనుసరించి ధర నిర్ణయిస్తుంటారు. తోటల వద్దకు ఏ వ్యాపారి వచ్చినా వారు నిర్ణయించుకున్న ధరకు మించి పెట్టరు. అంతా పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వేసవిలో వచ్చే కత్తెర కాయ దిగుబడులు చాలా తక్కువగా ఉంటాయి. డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో మార్కెట్‌ కంటే కనీసం టన్నుకు రూ.20వేల వరకు తక్కువ గా రైతుకు వ్యాపారులు చెల్లిస్తున్నారు. జూన్‌ నుంచి సీజన్‌ కాయకు టన్నుకు రూ.20వేలకు మించి ఎపుడూ వ్యాపారు లు ధరపెట్టరు. పైగా టన్నుకు క్వింటా కోత విధిస్తారు. 20 టన్నుల బత్తాయికి రెండు టన్నులు సూట్‌ కింద పోతుంది. అన్నీపోగా రైతులకు పెట్టుబడి మిగిలే పరిస్థితి ఏర్పడింది.

కొనుగోలు, చెల్లింపుల్లో మోసాలు

బత్తాయి వ్యాపారులు ఏళ్ల తరబడి ఈ ప్రాంతం లో వ్యాపారాలు చేస్తుండటంతో రైతులను మచ్చిక చేసుకున్నారు. కొన్ని కాయలు టన్నుల లెక్కన కొనుగోలుచేసి గుత్తా కింద మాట్లాడుకొని ఒప్పందం చేసుకుంటారు. ఈ వ్యాపారులు బత్తాయిని ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటా రు. వ్యాపారులు మార్కెట్‌ బాగా ఉన్నపుడు పోటీ పడి కొనుగోలు చేస్తారు. తోటల్లో కొంత కాయలు కోశాక, తరువాత మార్కెట్‌లో ధర పడిపోయిందంటారు. బాగా నష్టం వచ్చిందని కోతలు నిలిపివేస్తా రు. ధర గురించి మాట్లాడాలని, లేదంటే కాయలు తమకొద్దని రైతులకు చెబుతారు. అప్పటి నుంచి పం చాయితీలు, పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లడం సర్వసాధారణం గా మారతాయి. చివరికి ధర తగ్గించి వ్యాపారి చెప్పి న ధరకే రైతులు ఒప్పుకోవాల్సిన దుస్థితి. తోటకు ఒక వ్యాపారి బేరం కుదుర్చుకుంటే ఏ వివాదం ఏర్పడినా, మరో వ్యాపారి ఆ తోట వద్దకు రారు. దీంతో రైతులు భారీగా నష్టపోవాల్సివస్తోంది. కాయ బేరం అయినప్పుడు కొంత మేరకు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. కాయలు తెంపిన తరువాత లారీ కాంటా వేసి నగదు చెల్లిస్తుంటారు. కొంత మంది రైతులతో ఉన్న సంబంధాలను ఆసరా చేసుకుని తరువాత చెల్లిస్తామని పరారయిన ఘటనలు దశాబ్దాల నుం చి వందల్లో ఉన్నాయి. కొంత మంది వ్యాపారులు కోట్లల్లో ఎగనామం పెట్టిన సంఘటనలు ని త్యకృత్యంగా మారాయి. చాలా మంది రైతులు ఇప్ప టివరకు లక్షల్లో నష్టపోయారు. రైతులు వ్యాపారుల ను వెతుకుతూ వెళ్లి వారి స్వగ్రామాల్లో పట్టుకున్నా, అక్కడ ఏమీచేయలేక పోవడంతో వారి నుంచి రూ పాయ కూడా వెనక్కి తీసుకోలేకపోయారు. కొంత మంది ఐపీ పెట్టడంతో రైతులు లబోదిబోమంటూ ఇంటి దారి పట్టారు. ప్రతీ బత్తాయి రైతుకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. సాగులో ఎన్ని కష్టాలు ఉన్నా భరిస్తున్నామని, కాయ విక్రయాల్లో మోసపోతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ మద్దతు కరువు

నాలుగు దశాబ్దాలుగా బత్తాయి సాగు జరుతున్నా మా ర్కెట్‌లో దోపిడీని అరికట్టడం, వ్యాపారులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు పేర్కొంటున్నా రు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నా, ప్రభుత్వాలు స్పందించడం లేదు. రైతుల గోస ఆలకించే వారే లేరు. బత్తాయికి కనీస ధర క ల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మార్కెట్‌లో దోపిడీ

బత్తాయిని విక్రయించాలంటే హైదరాబాద్‌ గడ్డిఅన్నారం మార్కెట్‌కు తీసుకెళ్లాలి. ప్రారంభంలో రైతులు మార్కెట్‌కు వెళ్లినా ధర పలికేది కాదు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు. కొన్ని కాయలకు కనీస ధర ఇచ్చి మిగతా కాయలను నామమాత్రపు ధరకు కోనుగోలు చేసేవారు. వందకు కమీషన్‌ రూ.4తోపాటు కూలీలు, గుమస్తా, రవాణా ఇతర ఖర్చులు వందకు రూ.10 పైగా ఖర్చు వచ్చేది. ధర లేనప్పుడు చేతి ఖర్చులు కూడా వచ్చేవి కావు. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో టన్ను బత్తాయికి రూ.50వేల వరకు ఉండగా, రైతుకు దక్కేది మాత్రం రూ.30వేల నుంచి రూ.40వేలు మాత్రమే. దీంతో దోపిడీ తట్టుకోలేక రైతులు మార్కెట్‌ వెళ్లడానికి జంకుతున్నారు. నల్లగొండలో బత్తాయి సాగు అనుసరించి 2018లో మార్కెట్‌ ఏర్పాటు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో రైతులకు ఇక్కడా మద్దతు దక్కలేదు. దీంతో ఈ మార్కెట్‌ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఏడాదికే మార్కెట్‌ మూతపడింది.

బత్తాయికి గడ్డుకాలం : నవీన్‌రెడ్డి, రైతు, కుక్కడం, మాడ్గులపల్లి మండలం

బత్తాయి విక్రయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా మార్కెట్లు లేకపోవడం, హైదరాబాద్‌కు తీసుకు వెళ్లినా వ్యాపారుల దోపిడీకి గురవుతున్నాం. కనీస ధర చెల్లించకపోవడంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. దళారులకు కాయలు విక్రయిస్తే గిట్టుబాటు కావడం లేదు. మోసాలకు గురవుతున్నాం. మార్కెట్లో బత్తాయికి కనీస ధర చెల్లించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 19 , 2024 | 11:55 PM