Share News

మనకు దక్కేనా?

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:43 PM

లోక్‌సభ ఎన్నికల సమరం వేడెక్కింది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలైంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు, ప్రధాన అభ్యర్థులు విజయం కోసం పావులు కదుపుతున్నారు. అసెంబ్లీల వారీగా పరిస్థితిని సమీక్షించుకోవడంతో పాటు విజయానికి సాధించాల్సిన ఓట్లపై లెక్కలు కడుతున్నారు.

మనకు దక్కేనా?

ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు

గెలుపుకోసం వ్యూహాలు

గత ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నేతలు

అసెంబ్లీ, లోక్‌సభకు ఓటింగ్‌ సరళిలో తేడా

ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల యత్నం

ఓటర్ల మనోగతంపైనే అందరి దృష్టి

నల్లగొండ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల సమరం వేడెక్కింది. గురువారం నామినేషన్ల ఘట్టం మొదలైంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు, ప్రధాన అభ్యర్థులు విజయం కోసం పావులు కదుపుతున్నారు. అసెంబ్లీల వారీగా పరిస్థితిని సమీక్షించుకోవడంతో పాటు విజయానికి సాధించాల్సిన ఓట్లపై లెక్కలు కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్‌ ఎన్నికలకు వస్తున్న తేడాలను గమనిస్తూ ఈసారి ఎలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర పరిస్థితులు, స్థానిక నియోజకవర్గ అభ్యర్థుల పనితీరు ఆధారంగానే జరిగితే, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ పరిస్థితులు, జాతీయ పార్టీల మేనిఫెస్టోలు, నినాదాలు ఎన్నికలను ప్రభావం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండుసీట్లలోనూ గెలుపు కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు తమ బలాబలాలను సమీక్షించుకుంటూ ప్రత్యర్థుల పరిస్థితిని అంచనావేస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ..

ఉమ్మడి జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించగా, బీఆర్‌ఎస్‌ రెండు సీట్లలో మాత్రమే గెలిచింది. బీజేపీ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. అయితే లోక్‌సభకు వచ్చేసరికి జిల్లాలో అసెంబ్లీ ఒరవడిని కొనసాగించి రికార్డు మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొంది కాంగ్రె్‌సను వెనక్కినెడతామనే విశ్వాసంలో బీఆర్‌ఎస్‌ ఉంది. అదే సమయంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలతో ఉమ్మడి జిల్లాలోనూ రెండు సీట్లు తమవేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రె్‌సకు 7,66,069 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 4,78,631 ఓట్లు, బీజేపీకి 73,449 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ అభ్యర్థులకు 2,87,438 ఓట్లు అదనంగా వచ్చాయి. భువనగిరి లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు 8,16,241 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు 5,59,396 ఓట్లు, బీజేపీ అభ్యర్థులకు 73,181 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రె్‌సకు 2,56,845 ఓట్లు అదనంగా లభించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పు ఉటుందనే విషయం గత ఎన్నికల ద్వారా తెలుస్తోంది. లోక్‌సభకు వచ్చేసరికి ప్రజలను ప్రభావితం చేసే అంశాలు మారుతున్నాయని, ఓట్లు రాబట్టడంలో పార్టీల వైఖరి కూడా మారుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆంశం ఆసక్తిరేపుతోంది.

2014 జమిలీ ఎన్నికల్లోనూ తేడాలు

2014లో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి గెలిస్తే, భువనగిరి స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ గెలిచారు. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఏడు సీట్లకు సూర్యాపేటలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుపొందగా, దేవరకొండలో కాంగ్రెస్‌ మిత్రపక్షం సీపీఐ గెలుపొందితే, మిగిలిన ఐదు సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. భువనగిరి పరిధిలోని ఏడు సీట్లలో నకిరేకల్‌ మాత్రమే కాంగ్రెస్‌ గెలిస్తే, జనగామలో బీజేపీ మిత్రపక్షం టీడీపీ గెలుపొందింది. మిగిలిన ఐదు సీట్లలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నల్లగొండ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు 4,41,254 ఓట్లు దక్కితే, ఎంపీ అభ్యర్థి సుఖేందర్‌రెడ్డికి 31వేలు అదనంగా 4,72,093 ఓట్లు వచ్చాయి. టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులకు 2,39,156 ఓట్లు రాగా, లోక్‌సభకు బరిలో నిలిచిన కూటమి అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 50వేల ఓట్లు అదనంగా 2,78,937 ఓట్లు దక్కాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో 2,77,826 ఓట్లు వస్తే, లోక్‌సభ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్వల్పంగా తగ్గి 2,60,677 ఓట్లు మాత్రమే లభించాయి. భువనగిరి లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు 3,25,094 ఓట్లు దక్కితే, లోక్‌సభకు వచ్చేసరికి ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 90వేల పైచిలుకు ఓట్లు అదనంగా మొత్తం 4,17,751 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో 4,48,599 ఓట్లు వస్తే, లోక్‌సభ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు 4,48,245 ఓట్లు వచ్చాయి. బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో 1,98,095 ఓట్లు రాగా, కూటమి ఎంపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి స్వల్పంగా తగ్గి 1,83,217 ఓట్లు మాత్రమే లభించాయి. ఇలా జమిలి ఎన్నికల్లో సైతం ఓటర్లు స్పష్టమైన భేదాన్ని చూపారు.

గత ఎన్నికల్లో మారిన సీన్‌

అసెంబ్లీకి 2018లో ఆరునెలల తేడాతో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పులో తేడా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ పరిధిలో బీఆర్‌ఎ్‌సకు 6,06,215 ఓట్లు దక్కితే, హుజూర్‌నగర్‌ మినహా ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు. 2019 లోక్‌సభకు వచ్చేసరికి 5,00,346 ఓట్లు మాత్రమే ఆ పార్టీ సాధించగా, ఎంపీ సీటును గెలవలేకపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో 5,06,34 ఓట్లతో ఒక్క హుజూర్‌నగర్‌ స్థానం మాత్రమే గెలవగా, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి 20వేల పైచిలుకు ఓట్లు అదనంగా సాధించి 5,26,028 ఓట్లు పొందడమే కాకుండా ఎంపీగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 65,690 ఓట్లు వస్తే, లోక్‌సభకు వచ్చేసరికి 52,709 ఓట్లు మాత్రమే దక్కాయి. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ దాదాపు ఇదే సరళి కొనసాగింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 5,95,503 ఓట్లు బీఆర్‌ఎస్‌కు వస్తే, మునుగోడు మినహా మిగిలిన ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలుపొందారు. అదే 2019 లోక్‌సభకు వచ్చేసరికి ఆ పార్టీకి దాదాపు 70వేల ఓట్లు తగ్గి, 5,27,756 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రె్‌సకు అసెంబ్లీ ఎన్నికల్లో 5,37,374 ఓట్లు దక్కగా, లోక్‌సభకు వచ్చేసరికి ఓట్లు స్వల్పంగా తగ్గి, 5,32,795 దక్కాయి. కానీ, ఎంపీ సీటు మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 40,276 ఓట్లు వస్తే, పార్లమెంట్‌కు వచ్చేసరికి 65,451 ఓట్లు దక్కాయి.

Updated Date - Apr 18 , 2024 | 11:43 PM