Share News

వైభవంగా దివ్యవిమాన రథోత్సవం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:51 PM

యాదగిరికొండపై అనుబంధ ఆలయం పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరుడు కొలువుదీరిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం లక్షబిల్వార్చనలు, రాత్రి వేళ దివ్యవిమాన రథోత్సవ ఘట్టాలు శాసో్త్రక్తంగా కొనసాగాయి.

వైభవంగా దివ్యవిమాన రథోత్సవం
దివ్యాలంకార శోభితుడు రామలింగేశ్వరుడిని సేవలో రఽథం వద్దకు తీసుకువస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, మార్చి9: యాదగిరికొండపై అనుబంధ ఆలయం పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరుడు కొలువుదీరిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం లక్షబిల్వార్చనలు, రాత్రి వేళ దివ్యవిమాన రథోత్సవ ఘట్టాలు శాసో్త్రక్తంగా కొనసాగాయి. శివాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వరుడిని ఆరాధించిన అర్చకులు నిత్యహవనం, శివపంచాక్షరీ, మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు, వేద ఇతిహాస పారాయణ పఠనం చేశారు. అనంతరం ప్రధానాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వరస్వామిని కొలుస్తూ శివపార్వతుల సహస్రనామ పఠనాలతో గంట పాటు లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం నిత్య పూజాకైంకర్యాలు, వేద పారాయణ పఠనం, యాగశాలలో నిత్య లఘు పూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు.

యాత్రాజనుల పూజల సందడి

యాదగిరీశుడి సన్నిధిలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో యాత్రాజనులు పెద్దసంఖ్యలో క్షేత్ర సందర్శనకు తరలివచ్చారు. యాత్రాజనుల సంచారంతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్టాండ్లు, కొండపైన ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల ప్రాంతాలు సందడిగా కనిపించాయి. స్వామివారి ధర్మదర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు అర గంట సమయం పట్టినట్టు, సుమారు 20వేల మందికి పైగా యాత్రికులు ఇష్టదైవాలను దర్శించుకున్నట్టు, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.28,00,487 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. స్వామికి నిత్యపూజా కైంకర్యాలు శాసో్త్రక్తంగా కొనసాగాయి. ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవాలను నిర్వహించారు.

కన్నుల పండువగా రథోత్సవం

యాదగిరికొండపైన శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రామలింగేశ్వరస్వామి దివ్య విమానరథంపై భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశాడు. ఆలయ బాహ్యప్రాకారంలో స్వామివారి దివ్యవిమానరథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించారు. పట్టువసా్త్రలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో పర్వవర్ధినీ అమ్మవారిని, రామలింగేశ్వరుడిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక సేవలో తీర్చిదిద్దారు. ప్రధానాలయంలో ఊరేగించి బాహ్యప్రాకారంలోని దివ్యవిమాన రథం వద్ద ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దిన పురోహితులు, అర్చకబృందం రథాంగబలి, దిష్టికుంభ పూజలను నిర్వహించారు. అనంతరం దివ్యవిమాన రథంపై కల్యాణమూర్తులను అధిష్టింపజేశారు. అనంతరం దివ్యవిమాన రథాన్ని శివాలయ ప్రాకార మండపంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఊరేగింపు వేడుకలు నేత్రపర్వంగా కొనసాగాయి. ఈ విశేష పర్వాల్లో ఆలయ అనువంశీఖ ధర్మకర్త బి. నరసింహమూర్తి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మహోత్సవాల్లో రథోత్సవ విశిష్టత

నూతన కల్యాణపరులైన శివపార్వతులను శివరాత్రి మహోత్సవాల్లో దివ్యవిమాన రథంలో అధిష్టింపజేసి ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. అర్థనారీశ్వర రూపంలో పార్వతీ, పరమేశ్వరులను ఏకరూపంలో దర్శనం కలిగించే ఈ రథోత్సవ ఘట్టం శివరాత్రి మహోత్సవాల్లో మహోత్తరమైందని, అద్వైత జ్ఞానప్రకాశముని శివ పురాణం దేవస్థాన ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ వివరించారు. రథమనే దేహ భ్రాంతిని విడనాడి జ్ఞాన స్వరూపుడైన శివుడిని ఆశ్రయిస్తే కైవల్యం ప్రాప్తిస్తుందని వేదాలు తెలుపుతున్నాయని ఆయన అన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:51 PM