Share News

ప్రాణం తీసిన అప్పు

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:23 AM

కుటుంబ అవసరాలు, వ్యాపారం కోసం బంధువుల వద్ద రూ. కోటికిపైగా అప్పు చేశాడు.

ప్రాణం తీసిన అప్పు
పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ నోట్‌, శంకరయ్య(ఫైల్‌)

అప్పుల వారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

నాగార్జునసాగర్‌, జూన 26: కుటుంబ అవసరాలు, వ్యాపారం కోసం బంధువుల వద్ద రూ. కోటికిపైగా అప్పు చేశాడు. అప్పు తీర్చాలని బంధువులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏమి చేయాలో అర్థం కాలేదు.. అప్పులు తీర్చే మార్గం లేక ఉరివేసుకుని తానువు చాలించాడు. బుధవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ సంపత తెలిపిన వివరాల ప్రకారం.. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కండెల శంకరయ్య(35) నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీలో నివాసం ఉంటాడు. పందుల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. పందులు కొనుగోలు చేసి విక్రయించేవాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని తన చెల్లెలి భర్త(బావ), బావ సోదరి(వదిన) వద్ద రెండేళ్లలో రూ.కోటి తీసుకున్నాడు. తమకు డబ్బులు కావాలని వారు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో జూలై 5వ తేదీలోపు అప్పు తిరిగి ఇవ్వాలని బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. పది రోజులుగా ఈ పంచాయితీ నడుస్తోంది. అయితే ఈ నెల 24వ తేదీ సోమవారం శంకరయ్యను అప్పు ఇచ్చిన బంధువులు ఏపీలోని మాచర్లలో పట్టుకుని, అక్కడినుంచి గజ్వేల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శంకరయ్యపై అతని బంధువులు దాడి చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకరయ్య మంగళవారం రాత్రి హిల్‌కాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన శంకరయ్య సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో పెట్టి గదిలోని ఫ్యానకు ఉరివేసుకున్నాడు. బుధవారం ఉదయం భార్య ఉదయం ఆరు గంటల సమయంలో నిద్రలేచి చూసే సరికి శంకరయ్య ఫ్యానకు ఉరివేసుకొని వేలాడుతుండంతో ఆమె వెంటనే చుట్టు పక్కల ఉన్న బంధువులను పిలిచింది. తాడు కోసి శంకరయ్యను కిందకు దించగా అప్పటికే మృతిచెందాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో లభించిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ తనను వేధిస్తున్నారని, కోటి రూపాయల అప్పుకు మరో కోటి రూపాయలు వసూలుచేస్తూ దందా చేస్తున్నారని లేఖలో రాశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య సోదరుడు నారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శంకరయ్యకు భార్య, కుమార్తె ఉన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:23 AM