రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడి మృతి
ABN , Publish Date - Apr 09 , 2024 | 11:56 PM
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ వద్ద ఈ నెల 4వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
అదే ప్రమాదంలో ఈ నెల 4న చెల్లెలు మృతి
చికిత్స పొందుతున్న తల్లి
ఆటో ప్రమాదంలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య
సూర్యాపేట రూరల్ / నాగారం, ఏప్రిల్ 9: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ వద్ద ఈ నెల 4వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో అదే రోజు ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ఉపాధ్యాయురాలు లావణ్య(26)చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన మృతి చెందింది. ఇదే ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న గొలుసు మోక్షిత(7) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలునాయక్ తెలిపారు. మోక్షిత చెల్లెలు వేదాశ్విని (17నెలలు) ప్రమాదం జరిగిన రోజే మృతిచెందింది. తల్లి గొలుసు సంధ్య గాయపడి ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంధ్య అత్తగారి ఊరు హైదరాబాద్ కాగా, తల్లిగారి ఊరు నాగారం మండలం పసునూరు గ్రామం. ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటికి వచ్చిన సంధ్య సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు పిల్లలతో కలిసి ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బలమైన గాయాలు తగిలిన వేదాశ్విని అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మోక్షిత హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సంధ్య ఇద్దరు పిల్లలూ మృతి చెందడం, ఆమె కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నండటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా సంధ్య కుటుంబ నియంత్రణ ఆపరేషన కుట్లు తొలగించుకోవడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడు, కుమార్తె చాలు అని సంతోషంతో కుటుంబ నియంత్రణ చేయించుకున్న సంధ్య వారిద్దరిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతోంది.