Share News

ప్రమాదాలతో తెల్లవారుతోంది

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

ప్రమాదాలతో తెల్లవారుతోంది
శ్రీరంగాపురం వద్ద లారీ కిందికి దూసుకెళ్లిన కారు

మునగాల ఘటనను మరిచిపోక ముందే మరో ఘటన

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు

ఆరుగురిని మింగిన అతివేగం

కోదాడ సమీపంలో ఘటన

తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ మృతి

ఒంటరైన చిన్నారులు

భర్త, కుమార్తెను కోల్పోయిన ఇల్లాలు

కోదాడ / కోదాడ టౌన, ఏప్రిల్‌ 25 : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అతివేగం, అజాగ్రత్త, ప్రధాన కారణం కాగా, దూరప్రయాణంతో అలసిపోతున్న డ్రైవర్లు తెల్లవారుజామున నిద్రమత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 22న మునగాలలో ఆగి ఉన్న లారీని ఢీకొని దంపతుల మృతిని మరిచిపోకముందే గురువారం తెల్లవారుజామున కోదాడ మండలం శ్రీరంగాపురంలో అదే తరహాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు.

శ్రీరంగాపురం వద్ద రోడ్డుపై నిలిచిన లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. లారీ కిందకు కారు దూసుకెళ్లి చిక్కుకోవడంతో క్రేనసహాయంతో మృతదేహాలను, క్షతగాత్రులను బయటకుతీశారు. కారులో 10మంది ఉండగా ముగ్గురు దంపతులతో పాటు నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నాయనమ్మలను కోల్పోయి ఇద్దరు చిన్నారులు ఒంటర య్యారు. అదేవిధంగా తండ్రి, కుమార్తె మృతి చెందారు.

రెండు రోజుల్లో ఎనిమిది మంది

హైదరాబాద్‌-విజయవాడ హైవే రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాలనుకునే వారికి ఇదే ప్రధాన రహదారి. విజయవాడకు తెల్లవారుజామున చేరుకోవాలనుకునే వారు హైదరాబాద్‌లో అర్ధరాత్రి సమయంలో బయలుదేరుతారు. అప్పటికే రోజువారి పనులతో అలసటతో ఉండే డ్రైవర్లు సూర్యాపేట దాటే వరకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి బడలికలో ఉంటుంటారు. అయితే అప్పటికే తెల్లవారుజాము అవుతుండటంతో చల్లనిగాలికి నిద్రమత్తులోకి జారుకుంటుంటారు. ఈ మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. వేగంగా ప్రయాణిస్తూ ఆగి ఉన్న వాహనాలను గుర్తించలేకపోతుండటం, నిద్రమత్తులోకి వెళ్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 22న మునగాలలో ఆగి ఉన్న లారీని అతివేగంగా కారు ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. అది మరిచిపోకముందే శ్రీరంగాపురం ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇలా తెల్లవారేలోగా హైవేపై ప్రమాదాలు సాధారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున ప్రైవేట్‌ బస్సు అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఇంటిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

జిల్లా పరిధిలో 20 మంది

జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో 20 మంది మృతి చెందారు. ఖమ్మం ఫైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు, సూర్యాపేట సమీపంలో కారు, లారీకి మధ్య ఆటో చిక్కుకున్న సంఘటనలో ఆరుగురు, టేకుమట్ల వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు, ముకుందాపురం వద్ద ఇద్దరు, కోదాడ వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు మొత్తంగా 20మంది మృతి చెందారు.

కనిపించని భద్రతా చర్యలు

హైవేపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా నేషనల్‌ హైవ్‌ అఽథారిటీ వారు భద్రతా చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా బ్లాక్‌స్పాట్‌(నిత్యం ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల) వద్ద చర్యలతో పాటు అవసరం ఉన్న చోట ఫైఓవర్లను నిర్మించి, ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చర్యలు కాకుండా ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:32 PM