Share News

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తీన్‌మార్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:37 PM

అత్యంత ఉత్కంఠగా సాగిన శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తీన్‌మార్‌

చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపు

మూడో ప్రయత్నంలో తీన్మార్‌ మల్లన్నకు దక్కిన విజయం

అన్ని రౌండ్లలో ఆయనదే ఆధిక్యత

విజయ సంకేతం చూపుతున్న తీన్మార్‌ మల్లన్ల

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): అత్యంత ఉత్కంఠగా సాగిన శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనంతరం సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రాకే్‌షరెడ్డి కంటే మల్లన్నకు ఎక్కువ ఓట్లు రావడంతో విజేతగా అధికారులు నిర్ణయించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్న ఆధిక్యత చాటగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డి సైతం బలమైన పోటీ ఇచ్చారు. చివరి వరకు కాంగ్రెస్‌, బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థుల నడుమ పోటాపోటీ ఉత్కంఠగా సాగింది. అశోక్‌కుమార్‌ మినహా మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు 48మంది ఎలిమినేషన్‌లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు తీన్మార్‌ మల్లన్న, రాకేశ్‌రెడ్డికి దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. మొత్తం 52మంది అభ్యర్థుల్లో రాత్రి 10గంటలవరకు అధికారికంగా ప్రకటించిన ప్రకారం మొదటి 47 మంది స్వతంత్ర అభ్యర్థుల బ్యాలెట్ల నుం చి వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కలుపుకొని కాం గ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,24,899 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,05,524 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,956, స్వతంత్ర అభ్యర్థి పాలకూ రి అశోక్‌కుమార్‌కు 30,461 ఓట్లు వచ్చాయి. అశోక్‌, ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్‌ తరువాత కూడా మల్లన్నకే ఆధిక్యత ఉన్నా, కోటా ఓట్లు రాకపోవడంతో ఎన్నికల సంఘం అనుమతి మేరకు ఆయన్ను విజేతగా ప్రకటించే ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన చేపట్టారు.

ఎవ్వరికీ రాని కోటా ఓట్లు

మొదటి ప్రాధాన్యంలో 29,697 ఓట్లు సాధించిన కీలక స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌ ఎలిమినేషన్‌లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కూడా ప్రధాన అభ్యర్థుల్లో ఎవ్వరికీ ఏకపక్షంగా రాలేదు. ఆయన ఎలిమినేషన్‌ తర్వాత బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్‌ చేసి, ఆయన బ్యాలెట్లలో ద్వితీ య ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఆయనకు వచ్చిన 43,313 బ్యాలెట్లలో ద్వితీయ ప్రాధాన్యతలోనూ పోటాపోటీగా ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డికి బీజేపీ క్యాడర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు ఆయన ఇటీవల వరకు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటేసిన ఓటర్లలో సింహభాగం ద్వితీయ ప్రాధాన్య ఓటు రాకే్‌షరెడ్డికి వేస్తారని భావించినా, వారి అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు గణనీయంగా రావడంతో ఆధిక్యత కొనసాగిం ది. అయితే బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్‌ తర్వాత కూడా కోటా ఓటు ఎవ్వరికీ రాలేదు.

2021 మాదిరిగానే చివరి వరకు ఉత్కంఠ

ఇదే స్థానానికి 2021లో జరిగిన ఎన్నికలోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఆ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న, తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరామ్‌, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌, సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డి, యువతెలంగాణ పార్టీ నుంచి రాణిరుద్రమరెడ్డి తదితరులు పోటీచేశారు. వారిలో ప్రేమేందర్‌రెడ్డి నాలుగో స్థానంలో ఉండగా, ఆయన ఎలిమినేషన్‌ తర్వాత కూడా మొద టి, రెండో స్థానాల్లో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), స్వ తంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నల్లో ఎవ్వరికీ కోటా ఓటు రాలేదు. మూడో స్థానంలో ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఎలిమినేట్‌ చేసి ఆయనకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. కోటా ఓటు కు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేరడంతో ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఆ ఎ న్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మల్లన్నే, ప్రస్తుత ఉపఎన్నికలో కాం గ్రెస్‌నుంచి బరిలో దిగి,తీవ్రపోటీలోనూ సంచలన విజయం నమోదు చేశారు.

మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా

జర్నలిస్టుగా, ప్రశ్నించే గొంతుకగా చిరపరిచితుడైన తీన్మార్‌ మల్లన్న ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2015లో ఆయన మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. ఆతర్వాత 2021లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి బీఆర్‌ఎ్‌సకు బలమైన పోటీ ఇచ్చారు. మూడో ప్రయత్నంలో ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో నేరుగా కొట్లాడిన క్రమం లో మల్లన్నపై 59వరకు కేసులు నమోదయ్యాయని, ప్రశ్నిం చే గొంతుకగా పోరాడిన మల్లన్న గెలుపు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

అన్ని రౌండ్లలోనూ ఆధిక్యతే

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అన్ని రౌండ్లలోనూ మల్లన్నకు ఓట్ల ఆధిక్యత వచ్చింది. మొత్తం 4,63,839 ఓట్లకు 3,36,013 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 25,824 ఓట్లు చెల్లకుండా పోగా, 3,10,189 ఓట్లు చెల్లాయి. కోటా ఓట్లు 1,55,095 కాగా, మొదటి ప్రాధాన్యంలో ఎవ్వరికీ కోటా రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకే్‌షరెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,967 ఓట్లు వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ అశోక్‌కుమార్‌ సహా స్వతంత్ర అభ్యర్థులందరి ఓట్లలో మల్లన్నకే ఎక్కు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓట్లలోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ధీటుగా మల్లన్న ఓట్లు రాబట్టారు. దీంతో మల్లన్న గెలుపునకు మార్గం సుగమమైంది.

సాంకేతికంగా ఓడినా నైతిక విజయం నాదే : రాకేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

ఎమ్మెల్సీగా తాను సాంకేతికంగా ఓడినా, నైతికంగా తనదే గెలుపని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో అడుగుపెట్టలేకపోయినా, తాను జనసభలో ప్రజల తరుపున ప్రభుత్వంతో పోరాడుతానని ప్రకటించారు. తన గెలుపుని అన్ని రాజకీయపార్టీలవారు కోరుకున్నారని, జేడీలక్ష్మీనారాయణవంటి మేధావులు తనకు మద్ధతునిచ్చారని, వారందరికీ కృతజ్ఞతలని తెలిపారు. 12ఏళ్లుగా ప్రజల కోసం నిచేస్తున్నానని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎన్నికలో పోరాటపటిమ చూపారని కొనియాడారు. తన ఊపిరి ఉన్నంతవరకు పట్టభద్రుల తరుపున ప్రజాక్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:25 AM