Share News

కాంగ్రెస్‌ టికెట్‌ రఘువీర్‌కే

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:17 AM

కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితాలో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన తొలిజాబితాలో రాష్ట్రం నుంచి నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో నల్లగొండ సీటుకు క్లియరెన్స్‌ ఇవ్వగా, భువనగిరి స్థానానికి ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు.

కాంగ్రెస్‌ టికెట్‌ రఘువీర్‌కే

నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా జానా తనయుడు

తొలిజాబితాలో ప్రకటించిన అధిష్ఠానం

భువనగిరి టిక్కెట్‌కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం

నల్లగొండ, మార్చి 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితాలో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన తొలిజాబితాలో రాష్ట్రం నుంచి నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో నల్లగొండ సీటుకు క్లియరెన్స్‌ ఇవ్వగా, భువనగిరి స్థానానికి ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మాజీమంత్రి కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడైన రఘువీర్‌రెడ్డి మొదటిసారి నేరుగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందగా, తాజాగా రఘువీర్‌రెడ్డి ఎంపీగా పోటీచేస్తుండడంతో జానా తనయులిద్దరూ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ రఘువీర్‌రెడ్డి తన తండ్రి జానారెడ్డి తరఫున ఆయన పోటీచేసిన పలు ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా 2009లో నియమితులైన ఆయన ఆ తర్వాత 2014, 2018లలో పీసీసీ సభ్యుడిగా కొనసాగారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక ఆయన కార్యవర్గంలో 2021లో పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చిన్నవయసులోనే ఎంపీగా పోటీచేసే అవకాశం రఘువీర్‌రెడ్డికి దక్కడంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

భువనగిరి టిక్కెట్‌ కోసం తారస్థాయిలో ప్రయత్నాలు

నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం భువనగిరి స్థానంలో అభ్యర్థిని ఇంకా తేల్చలేదు. దీంతో ఇక్కడ టిక్కెట్‌ ఆశిస్తోన్న నేతలు తమ ప్రయత్నాలు ఉధృతం చేశారు. కోమటిరెడ్డి సోదరులకు పట్టున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌కోసం కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి, డాక్టర్‌ కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలా్‌ష్‌నేత, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ టిక్కెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. కీలకమైన నేతలే బరిలో ఉండడంతో ఈ స్థానంలో అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌కు టిక్కెట్‌ దక్కడంతో కాంగ్రెస్‌లోనూ బీసీ నేతల్లో టిక్కెట్‌ ఆశలు పెరిగాయి. తీన్మార్‌ మల్లన్న సైతం ఎంపీ టిక్కెట్‌ ఆశించినప్పటికీ ఆయనకు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చే ఆలోచనలో పార్టీ కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో టిక్కెట్‌ ఆశిస్తోన్న నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో అధిష్ఠానం ఎవరిని కరుణిస్తుందనే అంశంపై క్యాడర్‌లో ఆసక్తి నెలకొంది. గెలుపే లక్ష్యంగా ఏసమీకరణాన్ని అధిష్ఠానం ఇక్కడ అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉందని కీలకనేతలు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 01:17 AM