Share News

రేషన్‌ కార్డులొచ్చేనా?

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:38 AM

రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తొమ్మిదేళ్లుగా గత ప్రభుత్వ పాలనలో రేషన్‌ కార్డులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో, ఈ ప్రభుత్వంలోనైనా కార్డులొచ్చేనా? అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు దశాబ్ధ కాలంగా జిరాక్స్‌ కాగితాలను పట్టుకొనే రేషన్‌ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు.

రేషన్‌ కార్డులొచ్చేనా?

జిరాక్స్‌ కాగితాలతోనే బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు

కొత్తకార్డుల కోసం వినియోగదారుల నిరీక్షణ

జిల్లాలో 2.16లక్షల ఆహార భద్రతాకార్డులు

గతంలో లబ్ధిదారుల వివరాలు సేకరించిన పౌరసరఫరాల శాఖ

తొమ్మిదేళ్లయినా జారీచేయని వైనం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తొమ్మిదేళ్లుగా గత ప్రభుత్వ పాలనలో రేషన్‌ కార్డులు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో, ఈ ప్రభుత్వంలోనైనా కార్డులొచ్చేనా? అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. సుమారు దశాబ్ధ కాలంగా జిరాక్స్‌ కాగితాలను పట్టుకొనే రేషన్‌ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన తెల్ల రేషన్‌కార్డులు బహుళ ప్రయోజనాల(మల్టీపర్ప్‌స)కు ఉపయోగపడేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకుల పంపిణీకి మాత్రమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిమితం చేసింది.

గత ప్రభుత్వం రేషన్‌కార్డులను రద్దుచేసి, వాటి స్థానం లో ఆహార భద్రతాకార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొత్త కార్డులకోసం లబ్ధిదారులు తొమ్మిదేళ్లుగా వేచిచూస్తున్నారు. కార్డు ఉన్న వారికి కుటుంబంలోని మూడేళ్లు దాటిన వారందరికీ ఆరుకిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆహారభదత్రాకార్డులుగా పేరు మార్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కార్డులు లబ్ధిదారుల కు పంపిణీ చేయలేదు. త్వరలోనే కొత్త కార్డులను పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. జిల్లాలో మొత్తం 2.16లక్షల ఆహార భద్రతాకార్డులున్నాయి. అయితే తొమ్మిదేళ్లుగా కాగితాలను జిరాక్స్‌ తీయించుకుని లబ్ధిదారు లు బియ్యం, ఇతర సరుకులను తీసుకుంటున్నారు. గత బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్డు జారీ ప్రక్రియను వాయిదాలతోనే సరిపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలోనైనా కార్డులు ముద్రిస్తారా? లేదా? అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రతీనెలా లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నప్పటికీ, కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. గతంలో కుటుంబసభ్యులు సహా అన్నీ డిజిటల్‌కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలోనైనా కొత్తగా ఆహారభద్రతాకార్డులు అందుతాయన్న ఆశలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై సమీక్షించి కార్డులజారీతోపాటు సరుకుల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.

గతంలో వివరాల సేకరణ

కొత్త రేషన్‌కార్డులను జారీచేయాలని గతంలో పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారుల వివరాలు సేకరించారు. కుటుంబ వివరాల పొందుపర్చాల్సిన ప్రొఫార్మాలను రేషన్‌ డీలర్లకు అందించారు. డిక్లరేషన్‌ ఫాంలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మండలాలకు పంపారు. జిల్లాలోని రేషన్‌డీలర్ల వారీగా ప్రతీ కుటుంబలోని సభ్యుల ఫొటోలు, వివరాలతో కూడిన ముసాయిదా ఆహార భద్రతా కార్డుల డిక్లరేషన్‌ను తీసుకున్నారు. కుటుంబంలోని సభ్యులందరీ ఫొటోలతో కూడిన వివరాలను సేకరించి అధికారులకు పంపారు. సంబంధిత ప్రొఫార్మాలో ప్రధానంగా కుటుంబసభ్యులు పేర్లు తప్పుగా ఉన్న పక్షంలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పించారు. ఆహార భద్రతాకార్డుల్లో కొత్త సభ్యులను చేర్చుకోవడం, కుటుంబ సభ్యులు కాని పక్షంలో వారి పేర్లను తొలగించడం, చిరునామా, చౌకధరల దుకాణం మార్పులు తదితర వివరాలు పొందుపరిచేందుకు అవకాశం కల్పించింది. కుటుంబ యాజమాని సెల్‌ఫోన్‌ నెంబర్లను సేకరించారు. కుటుంబంలోని సభ్యులందరీ పేర్లును నమోదు చేసుకుని పక్కాగా కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేసింది. ఆహారభద్రతాకార్డులను మహిళల పేరుపై జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల వద్ద వివరాలు సేకరించినప్పటికీ, ఇప్పటివరకు కొత్తగా కార్డులు పంపిణీకాలేదు. దీంతో కొత్తకార్డులు ఎప్పుడొచ్చేనా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 2.16లక్షల ఆహార భద్రతాకార్డులు

జిల్లాలో 2015 నుంచి ఈ-పాస్‌ విధానం ద్వారా బి య్యం పంపిణీ చేస్తుంది. కొవిడ్‌-19 ఆపత్కాల సమయం నుంచి ఆహార భద్రతాకార్డుదారులకు ప్రతీ సభ్యునికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,16,841 ఆహార భద్రతాకార్డు లు ఉండగా వీటిలో 13,734 అంత్యోదయ ఆహారభద్రతా కార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 515 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ప్రతీనెలా 4216.320 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అంత్యోదయ ఆహార భద్రతాకార్డుదారులకు 13.734 మెట్రిక్‌ టన్నుల చక్కెరను పంపిణీ చేస్తున్నారు. రేషన్‌దారుల సంపూర్ణ ఆరోగ్యంకోసం జిల్లాలో పోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తుంది. ప్రతీనెలా 4,500 మెట్రిక్‌టన్నుల పోర్టీఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. గతంలో రేషన్‌షాపుల్లో పంపిణీ చేసిన చక్కెర, గోధుమలు, కందిపప్పు, చింతపండు, కారంపొడి, పుసుపు, ఉప్పు, గోధుమపిండి, కిరోసిన్‌ సరఫరా చేసేది. ప్రస్తుతం వీటన్నింటినీ నిలిపివేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మంజూరు

రేషన్‌ కార్డుల విషయమై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మంజూరు చేస్తాం. సకాలంలో లబ్ధిదారులకు అందజేస్తాం. ఎవరూ ఇబ్బంది పడవద్దని ఓ అధికారి అన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:38 AM