Share News

ఇక ప్రచార సమరం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:34 PM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేచింది. ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లకూ ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక ప్రచారపర్వం ముమ్మరం కానుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవడంతో రానున్న 50రోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. అసెంబ్లీ ఎన్నికల విజయాల ఊపుతో కాంగ్రెస్‌, ప్రజాసమస్యలపై పోరు ఎజెండాతో బీఆర్‌ఎస్‌, దేశంలో మరోసారి మోదీ సర్కార్‌ నినాదంతో బీజేపీ ప్రచారం సాగించేందుకు సిద్ధం కాగా, ప్రజాక్షేత్రంలో సమస్యలే ఎజెండాగా సీపీఎం రంగంలోకి దిగనుంది.

ఇక ప్రచార సమరం

అసెంబ్లీ ఎన్నికల ఊపుతో కాంగ్రెస్‌

సామాజిక సమతుల్యత, దీటైన అభ్యర్థులతో బీఆర్‌ఎస్‌

మూడోసారి మోదీ సర్కార్‌ నినాదంతో బీజేపీ

రానున్న 50 రోజులు ఉమ్మడి జిల్లాలో హోరెత్తనున్న ప్రచారం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ)

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేచింది. ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లకూ ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక ప్రచారపర్వం ముమ్మరం కానుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవడంతో రానున్న 50రోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. అసెంబ్లీ ఎన్నికల విజయాల ఊపుతో కాంగ్రెస్‌, ప్రజాసమస్యలపై పోరు ఎజెండాతో బీఆర్‌ఎస్‌, దేశంలో మరోసారి మోదీ సర్కార్‌ నినాదంతో బీజేపీ ప్రచారం సాగించేందుకు సిద్ధం కాగా, ప్రజాక్షేత్రంలో సమస్యలే ఎజెండాగా సీపీఎం రంగంలోకి దిగనుంది.

యువనేతలతో బరిలోకి కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని ఆధిక్యత సాధించిన కాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికల్లో యువనేతలను బరిలో దింపింది. నల్లగొండ అభ్యర్థిగా పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి టికెట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి ప్రస్తుత మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించగా, ఈసారి యువనేతలకు పోటీ చేసే చాన్స్‌ దక్కింది. 2009నుంచి నల్లగొండ స్థానం లో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుస్తూ వస్తుంటే, భువనగిరిలో ఒక్క పర్యాయం 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందారు. లోక్‌సభకు వచ్చేసరికి ఈ సీట్లలో కాంగ్రె్‌సకు అనుకూలంగా తీర్పు వస్తుండడం, తమకు కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ భావిస్తోంది. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఆ పార్టీకి ప్లస్‌ పాయింట్‌గా నాయకులు చెబుతున్నారు. మంత్రులు, టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయం చేసుకోవడం ప్రస్తుత అభ్యర్థులకు ఒక ఎత్తయితే అనుభవజ్ఞులు, సామాజిక సమీకరణాలు కలిసొచ్చే బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా జనాల్లోకి వెళ్లేందుకు అనుసరించే వ్యూహమే వీరికి ప్రధాన ప్రచారాంశం కానుంది.

దీటైన నేతలతో కదన రంగంలోకి బీఆర్‌ఎస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురవడంతో లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ వ్యూహం మార్చింది. ఒక సీటును బీసీలకు, మరోసీటును పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు కీలక నేతకు కేటాయించింది. నల్లగొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌కు టికెట్‌ ఇచ్చింది. ఉద్యమ సమయం నుంచి 2014లో భువనగిరి సీటులో విజయం తప్ప బీఆర్‌ఎ్‌సకు లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ప్రాతినిథ్యం దక్కలేదు. ఈసారి మాత్రం సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంతో పాటు, పారాచూట్‌ లీడర్లను తోసిరాజని క్యాడర్‌ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపికచేయడం, జిల్లాలో నెలకొన్న ప్రధాన సాగునీటి సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీసుకురావడం, రైతాంగాన్ని తమవైపు చూసేలా మార్చగలిగామనే అంశాలు కలిసొస్తాయని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పూర్వపు ప్రజాప్రతినిధులకే బీజేపీ టికెట్‌ కేటాయించడం, పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీ క్యాడర్‌ ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తుండడం బీఆర్‌ఎ్‌సకు ప్రతికూల అంశంగా చెబుతున్నారు. కలిసొస్తాయని భావిస్తున్న సామాజిక సమీకరణాల సమతుల్యత, ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సాగునీటి ఇక్కట్లు, కరువు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించే ప్రచార వ్యూహమే ఆ పార్టీ అభ్యర్థులకు కీలకం కానుంది.

మూడోసారి మోదీ సర్కార్‌ నినాదమే బీజేపీ వ్యూహం

కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్‌ కొలువు దీరనుందని, బీజేపీ సాధించే 400 సీట్లలో నల్లగొండ జిల్లాకు ప్రాతినిథ్యం ఉండాలనే నినాదంతోనే ఆ పార్టీ జిల్లాలో ప్రచారం సాగించనుంది. రెండు సీట్లకు దీటైన అభ్యర్థులను బరిలో దింపాలనే లక్ష్యంతో రెండుసీట్లకు బీఆర్‌ఎస్‌ పూర్వపు నేతలకే టికెట్‌ ఇవ్వడం జిల్లాపై ఆ పార్టీ దృష్టిసారించిన విషయాన్ని తెలుపుతోంది. భువనగిరి స్థానం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్‌ కేటాయించగా, నల్లగొండ స్థానం నుంచి హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి టికెట్‌ ప్రకటించింది. ఈ ఇద్దరు నేతలు బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులే కావడంతో, ఆ పార్టీ ఓటింగ్‌ను తమవైపు తిప్పుకుంటామనే సంకేతాలతో పాటు, బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని పార్టీ అంచనా వేస్తోంది. అవినీతిరహిత పాలనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ , బీఆర్‌ఎస్‌ పార్టీలు అవినీతి, కుటుంబపాలనతో భ్రష్టుపట్టిస్తున్నాయనే అంశాలను బీజేపీ ప్రధానంగా జిల్లాలో ప్రచారం చేయనుంది. కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలుచేయడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది.

మతతత్వంపై పోరు పేరుతో సీపీఎం

భువనగిరి నుంచి సీపీఎం తమ అభ్యర్థి జహంగీర్‌ను రంగంలోకి దించింది. కేంద్రంలో మతతత్వ బీజేపీ పాలనలో దేశంలో విద్వేషాలు పెరిగాయని, ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని, దేశంలో అవినీతిని ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని వీటిని నియంత్రించడమే లక్ష్యంగా తమ పార్టీ ఎన్నికల ప్రచారం సాగిస్తుందని సీపీఎం చెబుతోంది. రైతాంగం కరువుతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం పట్టించుకోవడం లేదని ఈ సమస్యను ప్రస్తావిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాన పార్టీలను ప్రజాసమస్యలపై ఎండగట్టడమే లక్ష్యంగా తమ ప్రచారం సాగించేందుకు సీపీఎం సన్నద్ధమవుతోంది.

Updated Date - Mar 28 , 2024 | 11:34 PM