Share News

బ్రహ్మోత్సవ శోభ

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:38 AM

ఆర్తత్రాణపరాయణుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కొండగుహలో స్వయంభువుగా పంచరూపాల్లో వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి దివ్య సన్నిధి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది.

బ్రహ్మోత్సవ శోభ

నేటి నుంచి లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు

నిత్య, మొక్కు కల్యాణాలు, హోమ పూజలు నిలివేత

యాదగిరిగుట్ట: ఆర్తత్రాణపరాయణుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కొండగుహలో స్వయంభువుగా పంచరూపాల్లో వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి దివ్య సన్నిధి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వరకు 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందులో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలైన స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఈ నెల 17న,బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవం 18న, దివ్యవిమాన రథోత్సవం 19న నిర్వహించనున్నారు. ప్రధానాలయ ఉద్ఘాట న అనంతరం స్వయంభువు సన్నిధిలో జరగనున్న రెండో వార్షిక బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే గాక దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానున్నారు. అందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నిత్య, మొక్కు కల్యాణాలు, సుదర్శన హోమ పూజలు నిలిపివేత

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధి లో ఈ నెల 11 నుంచి 21 వరకు కొనసాగనున్న వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామివారి నిత్య, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేయనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ 11 రోజుల పాటు రాత్రి వేళ నిత్యార్చనల అనంతరం రాత్రి 8.15 నుంచి 9గంటల వరకు బలిహరణం, రాత్రి నివేదన నిర్వహిస్తారు. రాత్రి వేళ 8గంటలకు అలంకార తిరువీధి సేవలు, సర్వ దర్శనాలు ఆరంభించి 10గంటలకు శయనోత్సవ దర్శనం, ఆలయ ద్వారబంధనం చేస్తారు. ఈ నెల 17 నుంచి 19 వరకు నిత్యార్చనలు, భోగములు, 20, 21వ తేదీల్లో భక్తు లు నిర్వహించే అభిషేకం, నిత్యార్చనలు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. కాగా, స్వామి సన్నిధిలో మొ క్కు సేవలు ఈ 11రోజుల పాటు సా యంత్రం 4నుంచి 5గంటల వరకు నిర్వహిస్తారు.

విష్ణుష్కరిణిలో చక్రతీర్థ స్నానాలు

యాదగిరీశుడి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో విశే ష ఘట్టం చక్రతీర్థ పుణ్యస్నానం భక్తులందరికీ కొండపైన విష్ణుపుష్కరిణిలోనే కల్పించనున్నారు. గతంలో ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన సహజ సిద్ధమైన స్వామివారి విష్ణుపుష్కరిణిలో అర్చకస్వాములు చక్రరాజం సుదర్శన చక్రానికి అవబృతస్నానం ఆచరించిన అనంత రం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేవా రు.అయితే కొండకింద గండిచెరువు సమీపంలో భక్తుల పుణ్యస్నానాల కోసం లక్ష్మీపుష్కరిణి నిర్మించిన అధికారులు తొలిసారి బ్రహ్మోత్సవా ల్లో చక్రతీర్థస్నానాలు లక్ష్మీపుష్కరిణిలోనే కల్పించారు. కా గా, ఈ ఏడాది మాత్రం భక్తులందరికీ చక్రతీర్థ పుణ్యస్నానాలు కొండపైన విష్ణుపుష్కరిణిలో అనుమతించడం విశేషం.

తాత్కాలిక వేదికపై బ్రహ్మోత్సవ తిరుకల్యాణం

విశ్వవిఖ్యాత దివ్యక్షేత్రధామంగా, వేల కోట్ల రూపాయల తో తిరుమలతరహాలో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తాత్కాలిక వేదికపైనే బ్ర హ్మోత్సవ తిరుకల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ పు నర్నిర్మాణంలో స్వామివారి నిత్యతిరుకల్యాణం, హోమ పూ జల నిర్వహణకు ప్రత్యేకంగా మండపాల నిర్మాణం లేకపోవడంతో అష్టభుజి ప్రాకార మండపంలోనే నిర్వహిస్తున్నా రు. శాశ్వత యాగశాల, కల్యాణమండపాల నిర్మాణం లేకపోవడంతో అష్టభుజి ప్రాకార ఉత్తర దిశలోని మండపం లో తాత్కాలిక యాగశాలలో హవన పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉత్తర దిశలోని ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక ఏర్పాట్లతో స్వామివారి బ్రహ్మోత్సవ కల్యాణ వేదికను నిర్మించనున్నారు. ఈ కల్యాణ వేదికపైనే ఈ నెల 18న లక్ష్మీనృసింహుడి కల్యాణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు

ఫ ఉదయం 10గంటలకు విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాసూత్రధారణలతో తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం పలుకుతారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్స్యంగ్రహణం, అంకురారోపణ

వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో రామకృష్ణారావు

లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవ వైదిక పర్వాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం కొండపైన దేవస్థాన ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలను రూ.1.60 కోట్ల బడ్జెట్‌తో నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో రూ.60లక్షలు విద్యుద్దీపాలంకరణలకు, మిగిలిన కోటి రూపాయలు పూజా కైంకర్యాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు కేటాయించినట్టు చెప్పారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించేలా చలువపందిళ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీకి సరిపడా ప్ర సాదాలను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ప్రధానాలయంతో పాటు ఆలయ గోపురాలకు విద్యుద్దీపాలంకరణలు చేశామని, ప్రధాన రహదారులు, మెట్లమార్గం, ఆలయ ఘాట్‌రోడ్‌లో విద్యుద్దీపాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ నెల 17న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట నిర్వహిస్తామన్నారు. తిరుకల్యాణానికి ప్రధానాలయ ఉత్తర దిశలోని తిరుమాఢవీధిలో కల్యాణవేదిక ఏర్పాటుచేసి నిర్వహిస్తామన్నారు. సుమారు 5 వేల మంది భక్తులు పట్టేలా మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ నెల 18న రాత్రి వేళ స్వామివారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవ కల్యాణ టికెట్లను 600 మాత్రమే విక్రయిస్తామని, భక్తులు రూ. 3000 రుసుము చెల్లించి ఈ టికెట్లు పొందాలన్నారు. ఈ నెల 19న ఆలయ తిరువీధుల్లో నిర్వహించే దివ్యవిమాన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.

నేడు గుట్టకు సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం హోదాలో తొలిసారిగా

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆయన ఇక్కడికి రానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇప్పటికే కొండకింద పాత గోశాల ప్రాంతంలో హెలీప్యాడ్‌ వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు కొం డపైకి భక్తుల వాహనాలు, స్వయంభువుల దర్శనాలకు భక్తులను అనుమతించడం లేదని దేవస్థాన అధికారులు తెలిపారు. సీఎం ఉదయం 8.45గంటలకు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 9గంటల కు కొండకింద పాతగోశాల సమీపంలోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.అక్కడినుంచి రోడ్డు మార్గంలో మూడో ఘాట్‌రోడ్‌ మీదుగా కొండపైకి చేరుకుంటారు. కొండపైన వీఐపీ అతిథి గృహం లో కాసేపు విశ్రాంతి తీసుకుని పడమటి దిశలోని లిఫ్టు నుంచి ఉత్తర తిరుమాఢవీధిలోనికి చేరుకుంటారు. ఉత్తర పంచతల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోనికి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలోని స్వయంభువుల ను దర్శించుకుని మొక్కు చెల్లిస్తారు. అనంతరం ప్రధానాలయ ముఖమండపంలో బ్రహ్మోత్సవ తిరుకల్యాణం లో తొలి రోజు స్వస్తిపుణ్యాహావాచన పూజల్లో పాల్గొంటారు. సుమారు గంట పాటు పాల్గొని తిరుకల్యాణోత్సవానికి స్వామి, అమ్మవార్లకు అలంకరించే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తారు. పూజల అనంతరం అతిథి గృహానికి చేరుకుని అక్కడినుంచి తిరిగి కాన్వాయ్‌లో కొండకింద పాతగోశాల హెలీప్యాడ్‌ వద్దకు వెళ్తారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు రానున్నారు. కాగా, యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో ఇప్పటి వరకు నలుగురు సీఎంలు స్వామి, అమ్మవార్లకు కల్యాణ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టి.అంజయ్య, మర్రి జనార్ధన్‌రెడ్డి, నందమూరి తారకరామారావు, కేసీఆర్‌ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు పోచంపల్లి ఇక్కత్‌ పట్టుచీరలు

నేడు సమర్పించనున్న చేనేత సంఘం నాయకులు

భూదాన్‌పోచంపల్లి: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పోచంపల్లి ఇక్కత్‌ పట్టుచీరలు సిద్ధమయ్యాయి. అమ్మవారు లక్ష్మీదేవిని పద్మశాలీలు ఆడపడుచుగా భావిస్తారు. దీంతో పద్మశాలీ కుటుంబా లు అత్యధికంగా ఉన్న భూదాన్‌పోచంపల్లిలో పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్ష్మీదేవి అమ్మవారికి పట్టుచీరలు, స్వామివారికి పట్టు పంచె, శాలువాలు సమర్పించే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. భూదాన్‌పోచంపల్లి పట్టుచీరలు, వస్త్రాలు సమర్పించేందుకు ఈవో అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో 15 రోజులుగా పద్మశాలి మహాజన సంఘం భవనంలో మగ్గం ఏర్పాటు చేసి నియమ నిష్టతో చేనేత కళాకారుడు మేకల రామకృష్ణ ఈ వస్త్రాల తయారీ లో నిమగ్నమయ్యారు. వీటి కి సోమవారం ఉదయం స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు శ్రేష్ఠి ఆధ్వర్యంలో చేనేత సంఘం నాయకులు, మార్కండేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్‌ బడుగు చండికేశ్వర్‌తో కలిసి యాదగిరిగుట్టలో సమర్పించనున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:38 AM