Share News

నెత్తురోడ్లు

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:47 PM

సూర్యాపేట జిల్లాలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నిత్యం నెత్తురోడుతోంది. ఇంటి నుంచి వాహనాల్లో బయటికి వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా చేరుకుంటారనే నమ్మకం సన్నగిల్లుతోంది.

నెత్తురోడ్లు

ఆరు రోజుల్లో 13 మంది మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు

నెత్తురోడుతున్న హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి

సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లాలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నిత్యం నెత్తురోడుతోంది. ఇంటి నుంచి వాహనాల్లో బయటికి వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా చేరుకుంటారనే నమ్మకం సన్నగిల్లుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్ర సమీపంలో జాతీయ రహదారిపై ఈ నెల 4వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆరు రోజుల్లో జరిగిన ఐదు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. అందులో యువకులతో పాటు ఇద్దరు చిన్నారులూ ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ, పోలీస్‌ శాఖ, ఆర్టీసీ సంస్థల ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది రెండు పర్యాయాలు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో వాహన డ్రైవర్లు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.

సూర్యాపేటలో ఈ నెల 4న లారీని ఆటో వెనక నుంచి ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. సంఘటనా స్థలంలో ముగ్గురు చ నిపోగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదాని కి ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయగా, మరొకరు బాధ్యతను మరిచి రోడ్డు పక్కన లారీని నిలపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వీరి నిర్లక్ష్యానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీ య రహదారిపై మానసనగర్‌ వద్ద విజయవాడ వైపునకు వెళ్తున్న లారీని డ్రైవర్‌ రోడ్డుపై నిలిపాడు. అదే సమయంలో అర్వపల్లి నుంచి సూర్యాపేట పట్టణానికి 16మంది ప్రయాణికులతో వస్తున్న ఆటోడ్రైవర్‌ లారీని తప్పిం చే క్రమంలో కుడివైపునకు తిప్పాడు. దీంతో వెనక నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొనడంతో అది వేగంగా లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అర్వపల్లి నుంచి వస్తున్నప్పటి నుంచి డ్రైవర్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రమాద సమయంలోనూ ఫోన్‌ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్‌ కప్పసాటి మహేష్‌(30) శుక్రవారం మృతి చెందాడు.

యువకులను బలిగొన్న అతివేగం

సూర్యాపేట సమీపంలో ఈనెల 11న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు, రాత్రి జరిగిన ప్రమాదం లో మరో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే వయసులో అతివేగం, అజాగ్రత్తతో నిండుప్రాణాలను బలితీసుకున్నారు. ఉదయం కేతేపల్లి సమీపంలో ప్రమాదానికి గురైన సమయంలో కారు వేగం 160 కిలోమీటర్లుగా స్పీడోమీటర్‌పై ఉంది. అంత వేగంతో చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో 12న జరిగిన ఘటనలో అజాగ్రత్తతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురిలో ఇద్దరు బీటెక్‌ పూర్తి చేసిన వారు. ఈ రెండు ప్రమాదాలతో పాటు ఈ నెల 5న రాయినిగూడెంలో ఒకరు, 9వ తేదీన పిల్లలమర్రి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు.

నిలిచిన హైవే పెట్రోలింగ్‌

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం గతంలో జీఎంఆర్‌, పోలీస్‌ శాఖకు చెందిన వాహనాల్లో సిబ్బంది జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహించేవారు. రహదారిపై వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టేవారు. అంతేకాకుండా ప్రమాదాలు జరిగితే వెంటనే ఆ వాహనాలను రోడ్డు పక్కకు తీయించేవారు. కానీ ఇటీవల జీఎంఆర్‌ సంస్థ వాహనాల పెట్రోలింగ్‌ చేయడం లేదు. అదే విధంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు ఉన్నప్పటికీ వారు రహదారిపై ఎక్కడో ఒక చోట నిలుపుకుంటున్నారే తప్పా పెట్రోలింగ్‌ చేయడంలేదు.

ప్రమాదాల నివారణకు చర్యలు

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్‌-65 అధికారులు చర్యలు చేపట్టారు. తరచూ ప్రమాదాలు జరిగే 16 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతానికి జీబ్రా లైన్లు వేయడంతో పాటు, మరికొన్ని చోట్ల ప్రత్యేక లైట్లను ఏర్పాటుచేశారు. ఆయా రోడ్డు క్రాసింగ్‌ల వద్ద సర్వీస్‌ రోడ్లను నిర్మిస్తున్నారు. అదే విధంగా అండర్‌పాసింగ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఏడాదిలో 211 రోడ్డు ప్రమాదాలు

పేట జిల్లా పరిధిలో పలు రహదారులపై ఈ ఏడాదిలో ఇప్పటివరకు 211రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 95 మంది మృతి చెందగా, 213 మంది గాయపడ్డారు. జిల్లాలో జాతీయ రహదారి కాకుండా మిగిలిన రహదారులను ఇటీవల నూతనంగా నిర్మించారు. వీటిపై కూడా వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఇటీవల 10 రోజుల వ్యవధిలో సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమా రు 15 మందికి వరకు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు పోలీసులు ఒకటి రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టి ఆ త ర్వాత వదిలేస్తున్నారు. ఆటోలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జరిమానాలు విధించా రు. తర్వాత ప ట్టించుకోవడం లేదు.

ప్రమాదాలకు కేంద్రాలుగా...

సూర్యాపేట జిల్లాలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు షరామామూలుగా మారాయి. జాతీయ రహదారి విస్తరణకు ముందు అనేక ప్రమాదాలు జరుగుతుండేవి. అందుకోసం రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించారు. అయితే విస్తరణ అ నంతరం వాహనాల సంఖ్యతో పాటు వాహనాల వేగం పెరిగి ప్రమాదాలు తగ్గుము ఖం పట్టలేదు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పరిధిలో 65వ నెంబరు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి, ఖాసీంపేట క్రాస్‌రోడ్డు, వల్లభాపురం, గుంజలూరు స్టేజీ, గుంపుల, సూర్యాపేటరూరల్‌ ప రిధిలో టేకుమట్ల, రాయినిగూడెం, పిల్లలమర్రి, సూర్యాపేట పట్టణ పరిధిలో జనగాం క్రాస్‌రోడ్డు, అంజనాపురికాలనీ, వ్యవసాయ మార్కెట్‌ క్రాస్‌రోడ్డు, రాజీవ్‌పార్కు, ఎఫ్‌సీఐ గో దాం వద్ద, మునగాల మండలంలోని ముకుందాపురం, తాడ్వాయి స్టేజీ, మాధవరం, ఆకుపాము ల,కోదాడ పట్టణంతోపాటు మండల పరిధిలోని పలుప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.

నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు

జిల్లాలో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపిన 921 మందిపై కేసులు నమోదుచేశారు. అదేవిధంగా అతి వేగంతో వెళ్లిన 41,797 మందిపై, పరిమితికి మించి ప్రయాణిస్తున్న 862 మందిపై, వాహన కాగితాలు లేకుండా ప్రయాణం చేస్తున్న 691 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 3,815 మందిపై, సీట్‌ బెల్టు ధరించకుండా వెళ్తున్న 2,369 మందిపై, వాహన నెంబరు ప్లేట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్న 865 మందికి జరిమానాలు విధించారు. అయితే పోలీసులు రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు మాత్రం పట్టణాలు, మండల కేంద్రాల్లో చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారులపై డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలు లేకపోలేదు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి : రాహుల్‌హెగ్డే, సూర్యాపేట జిల్లా ఎస్పీ

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. వాహనదారులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి. డ్రైవర్ల అజాగ్రత్త వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై చర్యలు చేపడుతున్నాం. ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్‌ కూడా నిర్వహిస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దు. యువత వేగ నియంత్రణ పాటించాలి. రోడ్డు ప్రమాదాలను అరికట్టే విషయంలో ప్రజల్లో కూడా మార్పు రావాలి.

Updated Date - Apr 14 , 2024 | 11:47 PM