Share News

భువనగిరి ఖిల్లా లోగో డిజైన్‌ పోటీలు

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:45 PM

చారిత్రాత్మక భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లాపై చేపట్టాల్సిన అభివృద్ధి పనుల డీపీఆర్‌ చివరి దశకు చేరింది.

భువనగిరి ఖిల్లా లోగో డిజైన్‌ పోటీలు

ఈ నెల 10లోపు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు

భువనగిరి టౌన్‌, జనవరి 5: చారిత్రాత్మక భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లాపై చేపట్టాల్సిన అభివృద్ధి పనుల డీపీఆర్‌ చివరి దశకు చేరింది. డీపీఆర్‌లో భాగంగా భువనగిరి లోగో డిజైన్‌, ట్యాగ్‌లైన్‌ కోసం టూరిజంశాఖ నామినేషన్లను ఆహ్వానించింది. అందుకు ఈ నెల 10వ తేదీ చివరి గడువు. భువనగిరి ఖిల్లా ఇతివృత్తాన్ని చాటేలా లోగో రూపకల్పన, క్యాచీ ట్యాగ్‌లైన్‌ను పంపాలని అధికారులు తెలిపారు. స్థానికులతో పాటు దేశవాసులు, ప్రవాస భారతీయులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. లోగో లేదా ట్యాగ్‌లైన్‌ను లేదా రెండింటినీ రూపొందించి పోటీల్లో పాల్గొనవచ్చు. పోటీల్లో గెలుపొందిన లోగో, ట్యాగ్‌లైన్‌పై పర్యాటకశాఖకు మాత్రమే సంపూర్ణ అధికారం ఉంటుంది. అవసరమైతే మార్పులు చేర్పులు కూడా చేస్తారు. ఆశించిన నాణ్యత మేరకు నామినేషన్లు రాని పక్షంలో ఎంపికలను నిలిపివేసే అధికారం కూడా టూరిజంశాఖకు ఉంది. భువనగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చేదిద్దే లక్ష్యంతో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపిక చేసి రూ.100 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు అభివృద్ధి పనుల డీపీఆర్‌ను ఇంజనీర్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ రూపొందిస్తోంది. అభివృద్ధి పనులను కూడా ఈ సంస్థనే నిర్వహించే అవకాశం ఉంది. డీపీఆర్‌లో భాగంగా ఖిల్లా అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించే లక్ష్యంతో లోగో, ట్యాగ్‌ లైన్‌ పోటీలను నిర్వహిస్తోంది. త్వరలోనే మరిన్ని విభిన్న రకాల పోటీలు, ప్రజాభిప్రాయ సేకరణలు సదస్సులు నిర్వహించనున్నట్టు సమాచారం. లోగో డిజైన్‌, ట్యాగ్‌లైన్‌ నామినేషన్లను ఈ నెల 10లోపు ఛీడటౌడ్చఛ్చీఛీటజీఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు నామినేషన్లను పంపవచ్చు. పూర్తి వివరాలకు ఇదే వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 11:45 PM