చేపపిల్లల పంపిణీపై స్పష్టతేదీ?
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:25 AM
ఉచిత చేపల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ మాట కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.

ఉచిత చేపల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ మాట కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పూర్తికావాల్సిన టెండర్ల ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనే మీమాంస మత్స్యకార్మికుల్లో నెలకొంది. కొన్నేళ్లుగా చేపల పెంపకం, విక్రయంతో జీవనోపాధి పొందుతున్న కార్మికులు ప్రభుత్వ తీరుతో ఆవేదనకు లోనవుతున్నారు.
సూర్యాపేట, జూన 26 (ఆంధ్రజ్యోతి):నీటివనరుల్లో చేపల పెంపకం కోసం ప్రభుత్వం అందించే ఉచిత చేపపిల్లల పంపిణీపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం నేటి వరకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయకపోవడంతో పథకం ఉంటుందా, ఏమైనా మార్పులు చేస్తున్నారా అనే సందిగ్ధత మత్స్యకారుల్లో నెలకొంది. సాధారణంగా మే నాటికి టెండర్లను పూర్తి చేసి ఆగస్టులో చేపపిల్లలను చెరువుల్లోకి వదులుతారు. వర్షాకాలం ప్రారంభమైనా నేటి వరకూ టెండర్లను పిలవకపోవడం అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ పథకాన్ని కొనసాగించాల్సి వచ్చినా పంపిణీలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. దీంతో చేపపిల్లల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని మత్స్య కారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలో నుంచి రెండు కిలోల చేపలు ఉన్నప్పుడే విక్రయిస్తే మంచి ధరల పలుకుతుందంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయాలనుకుంటే తొందరగా చేపట్టాలంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మత్స్యకారులను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ఉచితంగా మోపెడ్ లు, వలలు, మినీవ్యాన్లను పంపిణీ చేసింది. చేపలను తీసుకెళ్లడానికి, విక్రయించడానికి సామాగ్రిని సైతం అందజేసిం ది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు దాటింది. పథకాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో మాదిరి ఆరోపణలు రాకుండా నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేస్తే ఎంతో బాగుంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.
గత ప్రభుత్వం జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 4.23కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గతంలో నాసిరకం పిల్లల ను కూడా పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చా యి. నాలుగేళ్ల నుంచి 100 శాతం రాయితీతో ఉచితంగా విత్తన చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. పంపిణీ బాధ్యతను మత్స్యశాఖకు అప్పగించింది. వీరి పర్యవేక్షణలో కాంట్రాక్టర్లు చేపపిల్లలను పంపిణీ చేసేవారు. శాస్త్రీయమైన లెక్కలు లేకుండా డ్రమ్ములో లక్ష వంతున, ప్లాస్టిక్ సంచిలో 10వేలు, ప్యాకెట్లలో 1000 పిల్లలంటూ కాకి లెక్కలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లో వదిలారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో వదులుతున్నప్పటికీ ప్రతి చెరువులో పాతిక శాతం మేర తక్కువ సరఫరా చేస్తున్నార ని కాంట్రాక్టర్లు కోట్లలో స్వాహా చేస్తున్నారని విమర్శలున్నాయి. అయితే ఒక వేళ పథకాన్ని కొనసాగించాల్సి వస్తే ఈ పర్యాయం ఎటువంటి ఆరోపణలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారులతో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహించి పథకంలో లోపాలను సవరించే అవకాశం ఉందంటున్నారు. పంపిణీపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో చేపల పంపిణీ ఇలా
జిల్లాలో 134 మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 15,736 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాక అనధికారికంగా సభ్యులు ఉన్నారు. మూసీ రిజర్వాయర్‌తో పాటు 1,340 చెరువులు ఉన్నాయి. గతంలో వర్షాదార చెరువుల్లో 30-40ఎంఎం చేపలు, నిత్యం నీరు ఉండే చెరువుల్లో 80-100 ఎంఎం చేపలను వదిలారు. 30-40 ఎంఎం పరిమాణం గల చేపకు 62 పైసలు, 80-100 ఎంఎం చేపకు రూ.1.35పైసలు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించింది. దూరప్రాంతాల నుంచి చేపలు తేవడం వల్ల పిల్లలు చనిపోతున్నాయని భావించి స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు బాధ్యతలను అప్పజెప్పారు. అయితే పంపిణీలో అడుగడగునా నిర్లక్ష్యం కనిపించింది. సకాలంలో చేపపిల్లలను సరఫరా చేయకపోవడం, నాసిరకం పిల్లల ను సరఫరా చేయడంతో అవి చనిపోతుండడంతో మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో చేపపిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలకపోతే అవి పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరగా పంపిణీ చేయాలని కోరుతున్నారు. గత ఏడాది కూడా ఆలస్యంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో కొన్నిచోట్ల చేపలు పెరగలేదని, కేవలం 50 గ్రాముల నుంచి 100 గ్రాములు మాత్రమే పెరిగాయంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా శాస్త్రీయ లెక్కప్రకారం పంపిణీ జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వమే ఫిష్‌పాంట్స్‌ను ఏర్పాటు చేసి నాణ్యమైన పిల్లలను నిర్దేశిత పరిమాణంలో పంపిణీ చేస్తే బాగుంటుందని మత్స్యకార సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
ప్రభుత్వం నుంచి చేపపిల్లల పంపిణీపై ఎలాంటి ఆదేఽశాలు రాలేదు. త్వరలో నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. గతంలో నాలుగు సంవత్సరాలుగా చేపపిల్లల పంపిణీ చేపట్టాం.
- రూపేందర్‌సింగ్, మత్స్యశాఖ జిల్లా అధికారి