Share News

11 నుంచి యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:15 AM

అఖిలాంఢకోటి బ్రహ్మాంఢనాయకుడు స్వయంభూ పాంచనారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించనున్నారు.

11 నుంచి యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, మార్చి8: అఖిలాంఢకోటి బ్రహ్మాంఢనాయకుడు స్వయంభూ పాంచనారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ ఉద్ఘాటన తర్వాత రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతీ ఏడాదీ ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వరకు 11 రోజుల పాటు వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 17న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 18న బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవం, 19న దివ్యవిమాన రథోత్సవ పర్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, 21వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం, పండిత సన్మానంతో వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఈ నెల 11 నుంచి 21 వరకు కొనసాగనున్న వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11రోజుల పాటు స్వామివారి నిత్య, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేయనున్నారు.

నిత్య, మొక్కుక ల్యాణాలు..సుదర్శన హోమ పూజల నిలివేత

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిఽధిలో ఈ నెల 11 నుంచి 21 వరకు కొనసాగనున్న వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామివారి నిత్య, మొక్కుకల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేయనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ 11రోజులపాటు రాత్రివేళ నిత్యార్చనల అనంతరం రాత్రి 8.15గంటల నుంచి 9గంటల వరకు బలిహరణం, రాత్రి నివేదన జరుపుతారు. రాత్రివేళ 8గంటలకు అలంకార తిరువీధి సేవలు, సర్వ దర్శనాలు ఆరంభించి రాత్రి 10గంటలకు శయనోత్సవ దర్శనం, ఆలయ ద్వారబంధనంగావిస్తారు. ఈ నెల 17 నుంచి 19 వరకు నిత్యార్చనలు, భోగములు, 20, 21వ తేదీల్లో భక్తులు జరిపించుకునే అభిషేకం, నిత్యార్చనలు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. కాగా స్వామి సన్నిధిలో మొక్కు సేవలు ఈ 11రోజుల పాటు సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు నిర్వహిస్తారు.

అధికారుల సమీక్షలు.. సూచనలు

యాదాద్రీశుడు లక్ష్మీనృసింహుల వార్షిక వేడుకల కోసం అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ పక్కా ప్రణాళికతో నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకనుగుణంగా అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి సైతం ఇటీవల యాదగిరిక్షేత్రాన్ని సందర్శించి ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల నిఘాతోపాటు డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలకు పూజలు

యాదగిరీశుడి వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలకు ప్రధానాలయంలో సంప్రదాయరీతితో అర్చకస్వాములు పూజలు నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని స్వయంభువుల వద్ద, అనంతరం ముఖమండపంలోని ఉత్సవమూర్తుల వద్ద ఆహ్వాన పత్రికలకు ఆచార్యులు పూజలు నిర్వహించి అధికారులకు అందజేశారు. బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవ ఆహ్వాన పత్రికలకు పూజల నిర్వహించడం ఆలయ సంప్రదాయం.

Updated Date - Mar 09 , 2024 | 01:15 AM