Share News

సీఎం అవుతావని రేవంత్‌రెడ్డికి ఆనాడే చెప్పా

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:32 AM

ప్రజల కోసం పోరాడుతున్న తపన చూసి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని సీఎం రేవంత్‌రెడ్డికి జైలులో ఆనాడే చెప్పానని క్షమాభిక్ష ఖైదీ తరి నాగయ్య అన్నారు.

సీఎం అవుతావని రేవంత్‌రెడ్డికి ఆనాడే చెప్పా
తరి నాగయ్య

క్షమాభిక్షపై విడుదలైన ఖైదీ నాగయ్య

నిడమనూరు, జూలై 4: ప్రజల కోసం పోరాడుతున్న తపన చూసి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని సీఎం రేవంత్‌రెడ్డికి జైలులో ఆనాడే చెప్పానని క్షమాభిక్ష ఖైదీ తరి నాగయ్య అన్నారు. భార్య మీద కోపంతో క్షణికావేశంలో కుమారుడిని కాల్వలో ముంచి చంపిన కేసులో 16 ఏళ్లు శిక్ష అనుభవించి ప్రభుత్వ క్షమాభిక్షతో జైలు నుంచి ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటుకగూడెం గ్రామానికి చెందిన తరి నాగయ్య. విలేకరులతో జైలు అనుభవం పంచుకున్నారు. తాను తెలియక చేసిన తప్పుకు తనను నల్లగొండ జైలుకు తరలించకముందు మొదట చర్లపల్లి జైలులో ఖైదీగా శిక్ష అనుభవించానని తెలిపారు. అక్కడ ఉన్న సమయంలోనే ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా చర్లపల్లి జైలుకు రిమాండ్‌ ఖైదీగా వచ్చారని గుర్తుచేశారు. జైలులో ఆయనకు సహాయకుడిగా పనిచేశానని, రేవంత్‌రెడ్డితో అనేక విషయాలపై మాట్లాడానని తెలిపారు. ప్రజల కోసం ఆయన ఎంతో తపన పడేవారన్నారు. ఆయన తపన చూసి కచ్చితంగా సీఎం అవుతాడని, ఆయనతో పాటు ఖైదీలకు కూడా ఆనాడే చెప్పానన్నారు. జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కోసం ఒత్తిడి తేవాల్సిందిగా అప్పట్లో ఆయన్ను అనేకసార్లు కోరానని తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు బతుకుదెరువు కోసం ఉపాధి కల్పిస్తానని ఆనాడే రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే తనలాంటి అనేక మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్షకు మోక్షం లభించిందన్నారు. అనేక ఇంటర్వ్యూల్లో రేవంత్‌రెడ్డి తన పేరు ప్రస్తావించాడని గుర్తుచేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తాననాన్నరు. తెలియక చేసిన తప్పుకు తాను 16 ఏళ్లు జైలులో గడిపాపానని, శేష జీవితం కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. సీఎం తనకు ఉపాధి కల్పించాలని నాగయ్య అన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 08:41 AM