సాహసం శ్వాసగా... లక్ష్య సాధనకు
ABN , Publish Date - May 17 , 2024 | 12:06 AM
ప్రపంచ పర్వతారోహణ రంగంలో అతి క్లిష్టమైన ఏడు ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించే లక్ష్యంలో భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో సాహసానికి సిద్ధమయ్యారు.
ఏడు పర్వతాల లక్ష్యంలో ఐదో పర్వతం అధిరోహణకు సిద్ధం
ఈ నెల 20న అమెరికా వెళుతున్న పర్వతారోహకురాలు అన్విత
జూన 10లోగా పూర్తి చేసేందుకు ప్రణాళిక
భువనగిరి టౌన, మే 16: ప్రపంచ పర్వతారోహణ రంగంలో అతి క్లిష్టమైన ఏడు ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించే లక్ష్యంలో భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో సాహసానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నాలుగు పర్వతాలను అధిరోహించిన ఆమె ఐదో లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు అమెరికాలోని అలస్కాకు శుక్రవారం బయలుదేరి వెళుతున్నారు. ఉత్తర అమెరికాలోని సముద్ర మట్టానికి 7వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెనాలీ పర్వతాన్ని మే 20న అధిరోహించడం ప్రారంభించి, జూన 4 నుంచి 10వ తేదీ మధ్యన పూర్తి చేయనున్నారు. ఏడు పర్వతాల అధిరోహణ లక్ష్యంలో ఇప్పటివరకు ఆమె నాలుగు పర్వతాలను అధిరోహించారు. 2020 జనవరిలో 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఖిలిమాంజారో (ఆఫ్రికా), 2021 డిసెంబరు 7న 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్‌బ్రస్ (యూరప్), 2022 మే 16న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 8,848.86 మీటర్ల మౌంట్ ఎవరె్‌స్ట(ఆసియా ఖండం), 2022 డిసెంబరు 17న 4,892 మీటర్ల ఎత్తైన విన్సన (అంటార్కిటికా) పర్వతాలను అధిరోహించారు. తాజాగా తన లక్ష్యసాధనలో ఐదో పర్వతమైన డెనాలీ పర్వత అధిరోహణకు ఎంచుకున్నారు. త్వరలోనే మిగతా రెండు పర్వతాలైన 6వేల మీటర్ల ఎత్తైన అకాంగోవా(సౌత ఆఫ్రికా), 2,228 మీటర్ల ఎత్తైన ఖోజిస్కో (ఆస్ర్టేలియాలో) పర్వతాలను అధిరోహించి లక్ష్యాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు. అన్విత ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ (టార్క్) ఎండీ ఎవరెస్టర్ బి.శేఖర్‌బాబు పర్యవేక్షణలో భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందారు. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తైన రినాక్ పర్వతాన్ని, 2019లో పశ్చిమబెంగాల్‌లో 6,400 మీటర్ల బీసీరాయ్ పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లడక్‌లోని 6వేల మీటర్ల ఎత్తైన ఖడే పర్వతాన్ని, 2022 సెప్టెంబరు 21న మైనస్ చలిలో నేపాల్‌లోని 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న మనస్లూ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా రికార్డును సొంతం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంప్‌సలో ఎంబీఏ పూర్తిచేసిన ఆమె తన 24వ ఏట పర్వతారోహణను ప్రారంభించారు. లక్ష్యసాధనను పూరిచేస్తూనే తాను శిక్షణ తీసుకున్న భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ చేసేవారికి కోచగా వ్యవహరిస్తున్నారు.