Share News

ఫలించిన పోరాటం

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:42 AM

యాదగిరికొండపైకి ఆటోలను ప్రభుత్వం అనుమతించడంతో ఆటో కార్మికుల ఆనందానికి అవధుల్లేక ఆనంద డోలికల్లో నిండిపోయారు. యాదగిరిక్షేత్రానికి విచ్చేసే భక్తులను కొండపైకి, కొండకిందకు చేరవేస్తూ గత 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు.

ఫలించిన పోరాటం

625 రోజుల తర్వాత కొండపైకి ఆటోలు

హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

జెండా ఊపి ఆటోలను పంపిన ప్రభుత్వ విప్‌

మొదటి ఘాట్‌రోడ్‌ గుండా అనుమతి

300 కుటుంబాలకు ఉపాధి అవకాశం

రెండు షిఫ్టుల్లో రోజుకు కొండపైకి 100 ఆటోలు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి11: యాదగిరికొండపైకి ఆటోలను ప్రభుత్వం అనుమతించడంతో ఆటో కార్మికుల ఆనందానికి అవధుల్లేక ఆనంద డోలికల్లో నిండిపోయారు. యాదగిరిక్షేత్రానికి విచ్చేసే భక్తులను కొండపైకి, కొండకిందకు చేరవేస్తూ గత 30 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఆలయ ఉద్ఘాటనకు ముందస్తుగా అప్పటి ప్రభుత్వం, దేవస్థాన అధికారుల ఆకస్మిక నిర్ణయం కారణంగా 2022 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి కొండపైకి ఆటోలను నిషేధించారు. దీంతో అప్పటి నుంచి ఆటో కార్మికులు కలవని అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు లేరు. అప్పటి దేవస్థాన ఈవో గీతారెడ్డికి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలతో పలువురు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తులసీకాటేజ్‌ వద్ద దీక్షకు దిగారు. సుమారు 625 రోజులపాటు దీక్షలు చేసినా ఏ అధికారి, మంత్రి కనికరించలేదని, ఎన్నో ఏళ్లుగా ఆటోలనే నమ్ముకుని జీవనం సాగిస్తూ, తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని పలు విధాలుగా సమస్య ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఆటో కార్మికులు నిరాశచెందారు. అయినా తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆటోలను కొండపైకి అనుమతించాలని కోరుతూ పలు విధాలుగా నిరసనలు తెలుపుతూనే వినతులు సమర్పించారు.

ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల హామీ

రాష్ట్రంలో గతేడాది అక్టోబరులో ఎన్నికల కోడ్‌ రావడంతో తమ ప్రచారాల్లో భాగంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు ఆటో కార్మికులకు ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చాయి. ఆటో కార్మికులు ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రభుత్వానికి సహకరిస్తామని పేర్కొంటూ దీక్షలకోసం వేసుకున్న టెంట్‌ను ఎత్తివేశారు. తమ సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆటో కార్మికులు కోరుతూనే ఉన్నారు. కాగా ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ గుట్టలో రోడ్‌షో నిర్వహించిన సమయంలో తమ బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రాగానే ఆటోలను కొండపైకి అనుమతిస్తామని వెల్లడించారు.

300 కుటుంబాలకు ఉపాధి అవకాశం

ఆటోలను కొండపైకి అనుమతించడంతో సుమారు 300 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 500 కుటుంబాలకు ఉపాధి లభించినట్లయింది. అయితే రోజుకు షిఫ్టులవారీగా 100 ఆ టోలను మాత్రమే అనుమతించనున్నారు. ఉదయం 3గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11గంటల వరకు రెండో షిఫ్టు కొనసాగనుంది. ఆటోలో డైవ్రర్‌తోపాటు ముగ్గురు ప్రయాణికులు, ఒక్కో ప్రయాణికుడి వద్దనుంచి రూ.25 మాత్రమే చార్జీల రూపంలో ఆటో కార్మికులు వసూలు చేయాలని, ఒక్కొ షిఫ్టులో 50 ఆటోలు, కొండపైన 25, కొండకింద 25 ఆటోలు నిలిపే విధంగా విధివిధానాలు రూపొందించిన అధికారులు నిరంతరం నిఘాను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖల దృష్టికి ఆటో కార్మికుల సమస్యను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. కొండపైకి ఆటోలను నడిపేందుకు విధివిధానాలను రూపొందించాలని సూచించారు. దీంతో అయిలయ్య ఇటు దేవస్థాన, రెవెన్యూ, పోలీసు అధికారులు, అటు ఆటో కార్మికులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి కొండపైకి ఆటోలను అనుమతించేందుకు మార్గం సుగమం చేసేందుకు తనవంతు సహకారం అందించారు. విధివిధానాలు రూపొందించిన అధికారులు మొదటి ఘాట్‌రోడ్‌ గుండా ఆటోలను కొండపైకి అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. దాదాపు రెండేళ్ల పోరాట ఫలితం కొండపైకి ఆటోలను అనుమతించేందుకు అంతా సిద్ధం కాగా బీర్ల ఐలయ్య, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, దేవస్థాన ఈవో రామకృష్ణారావు, డీసీపీ రాజే్‌షచంద్రలతోపాటు పలువురు ప్రముఖులు పచ్చ జెండా ఊపి కొండపైకి ఆటోలను అనమతించడంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ఆటో కార్మికుల కోరిక నెరవేర్చాం : ప్రభుత్వ విప్‌ అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌: గత ప్రభుత్వ హయాంలో రెండేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆటో కార్మికుల కోరికను కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నెరవేర్చామని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం గుట్టపైకి ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం గా కొద్ది దూరం ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుమారు 300మంది ఆటో కార్మికుల పొట్టకొట్టిందన్నారు. కాంగ్రెస్‌ గెలిచిన రెండు నెలల్లోనే ఆటో కార్మికుల కోరిక నెరవేర్చామన్నారు. కార్మికులు నిబంధనలు పాటిస్తూ ఆటోలు నడపాలని కోరారు. అదేవిధంగా గుట్టపైన భక్తుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. వైటీడీఏ పేరుతో జిల్లా మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి, కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిధులను దోచుకొన్నారని ఆరోపించారు. దేవుడి సొమ్ము దండుకున్న వారితోపాటు ఈఎన్సీ గణపతిరెడ్డి, కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. యాదగిరిగుట్ట నుంచి మెడికల్‌ కళాశాల తరలింపు అవాస్తమని, వచ్చే జూలై మాసంలో ఇక్కడ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీసీపీ రాజే్‌షచంద్రా, ఏసీపీ శివరాంరెడ్డి, ఆలయ ఈవో రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అన్నం సంజీవరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాగౌడ్‌, ఎంపీపీ చీర శ్రీశైలం, కౌన్సిలర్‌ ముక్కర్ల మల్లేశ్‌, సీస విజయలక్ష్మి, మాజీ వైస్‌ఎంపీపీ శివరాత్రి దానయ్య, నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, దుం బాల వెంకట్‌రెడ్డి, భిక్షపతిగౌడ్‌, వరలక్ష్మి, జ్యోతి, శ్రీవల్లి పాల్గొన్నారు.

30 ఏళ్లుగా ఆటోలు నడుపుతున్నాం : కొమ్మగాని సత్యం, ఆటో కార్మికుడు

గత 30 ఏళ్లుగా కొండపైకి ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తు న్నాం. గత ప్రభుత్వంలో అధికారులు మాపై వివక్ష చూపించారు. ఎంత వేడుకున్నా కనీసం కనికరం చూపలేదు. రెండేళ్లు ఆటోలు నడవక.. ఆటో ఫైనాన్స్‌లు చెల్లించలేక, కటుంబపోషణ భారంగా మారింది. అధికారుల సూచనల మేరకు ఆటోలు నడుపుతాం.

Updated Date - Feb 12 , 2024 | 12:42 AM