Share News

బరిలో 61 మంది

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:23 AM

పార్లమెంట్‌ ఎన్నికల సంగ్రామంలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. సోమవారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలకు 61 మంది బరిలో ఉండగా అందులో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి నుంచి 22 మంది, భువనగిరి స్థానంలో 39 మంది ఉన్నారు.

బరిలో 61 మంది

భువనగిరి నుంచి 39 మంది

నల్లగొండ నుంచి 22

స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల ఖరారుతో ప్రచారానికి సన్నద్ధం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : పార్లమెంట్‌ ఎన్నికల సంగ్రామంలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. సోమవారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు స్థానాలకు 61 మంది బరిలో ఉండగా అందులో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి నుంచి 22 మంది, భువనగిరి స్థానంలో 39 మంది ఉన్నారు. వారికి ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. ఇక ప్రచారాన్ని ముమ్మరం చేయడమే తరువాయి. ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా, గుర్తుల కేటాయింపులతో స్వతంత్రులు ప్రచార రంగంలోకి దిగనున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగ్గా, 26వ తేదీన పరిశీలన, సోమవారం ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 51 నా మినేషన్లు సక్రమంగా ఉన్నట్టుగా గుర్తించారు. సోమవారం 12మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి హన్మంతు కే జెండగే వెల్లడించారు. దీంతో భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల బరిలో 39మంది మిగిలారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఎంల కు చెందిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచార రథాలను ఏర్పాటుచేసుకుని ముమ్మరంగా పర్యటిస్తున్నారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్‌), క్యామ మల్లే్‌ష(బీఆర్‌ఎస్‌), డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌(బీజేపీ), ఎండీ జహంగీర్‌(సీపీఎం)తో పాటు గుర్తింపుపొందిన పార్టీల, గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో స్వతంత్ర అభ్యర్థులు ప్రచారపర్వంలోకి రానున్నారు. వారు కూడా ప్రచార రథాలను సిద్ధం చేసుకోనున్నారు.

నల్లగొండ స్థానంలో

నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి 22 మందిలో బరిలో నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 31మంది మిగలగా, సోమవారం 9మంది నామినేషన్లను ఉపసంహరించున్నారు. ఎన్నికల బరిలో 22 మంది నిలిచారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గుర్తులను కేటాయించారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీలో నిలిచారు.

ఇక ముమ్మర ప్రచారానికి..

సార్వత్రిక ఎన్నికలకు మరో 14 రోజులు మాత్రమే ఉం ది. పోలింగ్‌ మే 13వతేదీన ఉండటంతో ప్రచారానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ అనుచరులతో ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార రథాలు గ్రామాల్లో, పట్ట ణాల్లో తిరుగుతూ గెలిపించాలని కోరుతున్నారు. భువనగి రి లోక్‌సభ పరిధిలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌, ఇబ్రహీంపట్నం, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా అగ్రనేతలతో బహిరంగ సభలు నిర్వహించేందుకు అన్నిపార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు. మే 3న ప్రధాని నరేంద్రమోదీతో బీజేపీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. చౌటుప్పల్‌లో నిర్వహించే ఈ సభకు జిల్లా నుంచి జనం తరలివెళ్లేలా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వాహనాలు సిద్ధం చేస్తున్నారు. మిగతా పార్టీల వారు కూడా పలు చోట్ల బహిరంగసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Apr 30 , 2024 | 12:29 AM