Share News

30 నుంచి మట్టపల్లిలో పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:21 AM

మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

30 నుంచి మట్టపల్లిలో పవిత్రోత్సవాలు
మట్టపల్లిలో పవిత్రోత్సవాలకు ముస్తాబైన మహాక్షేత్రం

నాలుగు రోజుల పాటు నిర్వహణ

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

మఠంపల్లి, సెప్టెంబరు 25 : మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 3వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యుద్దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే అర్చనాదులు, ఇతర సేవల్లో జరిగే దోషాల పరిహారార్థం ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆలయ ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో నవీనలు బుధవారం విలేకరులకు వివరించారు. 30వ తేదీ ఆదివారం రాత్రి యాజ్ఞికుల దీక్షాధారణతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. తమిళనాడులోని శ్రీస్వాతీనక్షత్ర మహాయజ్ఞ వాటిక ట్రస్ట్‌ చైర్మన ముక్కూరు శ్రీనివాసన పంపించిన పవిత్రాలను ఆలయానికి చేరుస్తారని తెలిపారు. అనంతరం అఖండ దీపారాధన నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వాస్తుహోమాలు, పంచగవ్యరాధనలు నిర్వహించాక క్షీర గుణాధివాస ప్రోక్షణ ఉంటుందన్నారు. శయనాధివాసం, అగ్ని ప్రతిష్టాపనల తదుపరి మహాశాంతి హోమం, చతుర్వేద పారాయణం, ఇతిహాస పురాణాలు పఠిస్తారని తెలిపారు. యాజ్ఞికులు బుర్రా వాసుదేవాచార్యుల నేతృత్వంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్రోత్సవాల సమయంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు.

Updated Date - Sep 26 , 2024 | 12:21 AM