Share News

ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:05 AM

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో నిర్వహిస్తున్న తవ్వకాల్లో తాజాగా మార్చి 29న 2 వేల ఏళ్ల కిందటి సీసపు నాణేలు బయటపడ్డాయి.

ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు
ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో మార్చి 29న తవ్వకాల్లో బయటపడ్డ సీసపు నాణేలు

మోత్కూరు, ఏప్రిల్‌ 2 : సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో నిర్వహిస్తున్న తవ్వకాల్లో తాజాగా మార్చి 29న 2 వేల ఏళ్ల కిందటి సీసపు నాణేలు బయటపడ్డాయి. ఇవి శాతవాహనుల సామంతులైన మహాతలవరుల కాలం నాటి నాణేలుగా భావిస్తున్నారు. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇక్కడ బౌద్ధధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని చెబుతారు. ఫణిగిరి కొండపై సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ బౌద్ధక్షేత్రం విస్తరించి ఉంది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రాల్లో ఫణిగిరి క్షేత్రం ఒకటి. అమరావతి, నాగార్జునకొండ బౌద్ధక్షేత్రాల కంటే ఈ క్షేత్రం గొప్పదంటారు. ఇక్కడ ఇక్ష్వాకులు 11 ఏళ్లు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1941లో అప్పటి నైజాం ప్రభువు కాలంలో ఈ క్షేత్రంలో తొలిసారి తవ్వకాలు జరిపారంటున్నారు. ఆ తర్వాత రాష్ట్ర పురావస్తు శాఖ వారు 2001 నుంచి 2007 వరకు ఒకసారి 2015లోనూ ఫణిగిరి గుట్టపై తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మహాస్థూపం, చైతన్య గుహలు, స్థూపాలు, గృహలు, శిలా మండపాలు, బుద్ధుడి పాదాలు, బుద్ధడి ప్రతిమలు, పాత్రలు, చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతమి జీవిత కథలు, అపురూపంగా మల్చిన శిల్పాలు, శాతవాహలు, ఇక్ష్వాకులు, మహాతరవరుల నాణాలు, బొమ్మలు బయటపడ్డాయి. కుండలు, కూజలు, కప్పులు, టైల్స్‌, బౌద్ధుల గదులు బయటపడ్డాయి. ఇందులో 32 గదులు ఉన్నాయి. బుద్ధుడి పాదాలు, బుద్ధుడి వ్యక్తిత్వానికి ప్రతీకలుగా భావించే అష్టమంగళం, చిహ్నాలు, మర్మచక్రం, మిఽథునం, అంకుశం, యజ్ఞాశం, ఖడ్గం, సప్తి, పిరస్నం గుర్తులు లభించాయి. ప్రపంచంలో ఎక్కడా లేని బుద్ధుడి తలపాగా ఇక్కడ లభ్యమైందని చెబుతారు. గతంలో ఇక్కడ బుద్ధవనం ప్రాజెక్ట్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. తరచుగా దేశ, విదేశాల బౌద్ధ మత గురువులు, పురావస్తు పరిశోధకులు, అధ్యయనకారులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. మార్చి 11న ఈ బౌద్ధక్షేత్రంలో మ్యూజియం ఏర్పాటు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, పురావస్తుశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్‌, డైరెక్టర్‌ భారతీ హోళీకేరీ, కలెక్టర్‌ వెంకటరావు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ మరోసారి తవ్వకాలు చేపట్టారు. రోజూ 65 నుంచి 75 మంది కూలీలు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. ఆదివారం సెలవు రోజు తప్ప మిగతా రోజుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో గత నెల 29న 2 వేల ఏళ్ల కిందటి 3,700 సీసపు నాణేలు బయటపడ్డాయి. వాటిని కూలీల సమక్షంలోనే లెక్కించి భద్రపర్చినట్టు తెలిసింది. పురావస్తు శాఖ డైరెక్టర్‌ వచ్చి పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

Updated Date - Apr 03 , 2024 | 12:05 AM