విజయ సంకల్పం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:07 AM
ప్రధాని నరేంద్రమోదీ విజయసంకల్ప సభ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్‌గూడలో పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన పర్యటన
మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి భారీగా జనాలు
అభిమానుల పూల వర్షం.. ఆకట్టుకున్న ప్రధాని ప్రసంగం
పటాన్‌చెరు, మార్చి 5: ప్రధాని నరేంద్రమోదీ విజయసంకల్ప సభ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్‌గూడలో పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ‘నా తెలంగాణా ప్రజలారా..’ అంటూ ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో ప్రధాని అనేక అంశాలను ప్రస్తావించారు. కుటుంబ పార్టీలతో దేశం వెనకంజ వేస్తున్నదని పేర్కొనడం ద్వారా బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలను విమర్శించారు. తనకు కుటుంబం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ‘మేరా భారత్.. మేరా పరివార్..’ అంటూ తిప్పికొట్టారు. స్వార్థం లేకుండా జీవితం మొత్తం దేశానికే అంకితం చేశానని పేర్కొన్నప్పుడు కార్యకర్తలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. మోదీ అంటే నమ్మకమని.. భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన చెప్పినపుడు మోదీ.. మోదీ.. నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ప్రధాని తన ప్రసంగాన్ని వందేమాతరం అంటూ ముగించారు.
ఘన స్వాగతం..
సభా వేదిక వద్దకు ప్రధాని మోదీ హెలీకాప్టర్‌లో గవర్నర్ తమిళిసైతో కలిసి ఉదయం 11:30కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండాసురేఖ, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తదితరులు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రూ. 6,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మౌలాలీ నుంచి లింగంపల్లి వరకు నడవనున్న ఎంఎంటీఎస్ రైలుకు జెండాపూపి ప్రారంభించారు. మామిడిపల్లి జంక్షన్ నుంచి రాంసాన్‌పల్లి వరకు నిర్మించిన 161వ హైవేను జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు ఆరు వరుసల రోడ్డు, మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు హైవే నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అధికారిక కార్యక్రమాల అనంతరం గవర్నర్, రాష్ట్ర మంత్రులు వెళ్లిపోగా.. మోదీ ఊరేగింపుగా విజయసంకల్పసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనపై కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. సభకు హాజరైన వారికి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. 12 గంటలకు ప్రధాని ప్రసంగం ప్రారంభమైంది.
భారీగా జనసమీకరణ
మోదీ సభ సక్సెస్ కావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సభకు మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. సభా ప్రాంగణంలో మూడు భారీ టెంట్లు వేసి డిజిటల్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘునంధన్‌రావు, నందీశ్వర్‌గౌడ్, యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండ్రోజుల క్రితమే బీజేపీలో చేరి జహీరాబాద్ టికెట్ సాధించిన ఎంపీ బీబీపాటిల్ ప్రధాని పక్కనే కూర్చుని ఆయనతో ముచ్చటించడం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియెజకవర్గాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేని బీజేపీకి నరేంద్రమోదీ సభతో ఎంపీ ఎన్నికల్లో సానుకూలత వస్తుందని నాయకులు చర్చించుకున్నారు.