Share News

‘అధిక వడ్డీ’పై కొరడా..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:22 AM

అనుమతి లేని ఫైనాన్స్‌లపై దాడులు

‘అధిక వడ్డీ’పై కొరడా..!
ఓ ఫైనాన్స్‌ వ్యాపారి ఇంటిలో దాడి చేసిన పోలీసులు

ఏకకాలంలో 24 బృందాలుగా తనిఖీలు

38 కేసులు.. రూ. కోటిపైనే స్వాధీనం

డాక్యుమెంట్లు.. బంగారం.. వెండి కూడా..

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 13: సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీతో వారి నడ్డి విరుస్తున్న ప్రైవేట్‌ ఫైనాన్స్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జిల్లాలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం.. ఫైనాన్స్‌ దందా నడిపిస్తున్న వారిపై శనివారం ఏకకాలంలో దాడులు చేశారు. జిల్లా మొత్తంగా 24 బృందాలుగా ఏర్పడి దాడులు చేయడంతో వడ్డీ, అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారులు హడలిపోయారు. కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్ల వారీగా అనుమతులు లేని ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారుల సమాచారాన్ని ముందే సేకరించారు. తర్వాత ఏకకాలంలో దాడులకు ఉపక్రమించారు.

సిదిపేట జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఫైనాన్స్‌ సంస్థలను ఏర్పాటు చేసి, సామాన్యుల అవసరాలకు డబ్బు అప్పుగా ఇస్తున్నారు. వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందుకోసం వారి ఆస్తులు.. ఇతరత్రా తనఖా పెట్టుకుంటున్నా.. అవసరాన్ని బట్టీ వడ్డీ రేటు ఉంటుందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు, వైద్యం వంటి అవసరాలకు తప్పనిసరిగా అప్పులు చేసి.. అధిక వడ్డీ చెల్లిస్తూ ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం సాయ్రంతం ఒక్కసారిగా అలాంటి వ్యాపారాలు చేసే వారిపై దాడులు చేసి వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, డబ్బులు.. పలువురు కుదువ పెట్టిన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అధిక వడ్డీలు, అనుమతి లేకుండా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ. 1,21,27,120 నగదు, 490 డాక్యుమెంట్లు, 70 తులాల బంగారం, 13 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కార్యాలయాలకు తాళం..

జిల్లాలో అక్రమ వడ్డీ వసూలు చేస్తున్న ఫైనాన్స్‌ సంస్థలపై నేడు రేపు పోలీసులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు తమ సంస్థల కార్యాలయాలకు తాళాలు వేసి పారిపోయినట్లు సమాచారం. అలాంటి వారి కోసం మరో రెండు రోజుల పాటు వరుసగా దాడులు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు జిల్లాలో ఏకకాలంలో అధిక వడ్డీ, అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారం చేసే సంస్థలు, వ్యక్తులపై దాడులు చేయడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధిక వడ్డీ వసూలు చేస్తే చర్యలు

అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డాక్టర్‌ బి. అనురాధ హెచ్చరించారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీలకు డబ్బులు ఇచ్చి.. అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతితో ఫైనాన్స్‌ కంపెనీలు నిర్వహించే వారినే నమ్మాలని, అనుమతి లేకుండా వ్యాపారం చేసే వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వాట్సాప్‌ నెంబర్‌ 8712667100కు లేదా, స్థానిక పోలీసు వారికి, లేదా డయల్‌100కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

- సీపీ డాక్టర్‌ బి.అనురాధ

Updated Date - Apr 14 , 2024 | 12:22 AM