Share News

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు?

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:03 PM

నర్సాపూర్‌కు 500ఇళ్ల మంజూరు 252 ఇళ్ల నిర్మాణం పూర్తి ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదలు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు?
నర్సాపూర్‌ పట్టణంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 252 ఇళ్లు

నర్సాపూర్‌, ఫిబ్రవరి 17: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2016లో నర్సాపూర్‌ పట్టణంలో చేపట్టిన 500 డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో పూర్తయిన వాటిని ఇప్పటికీ పేదలకు పంపిణీ చేయలేదు. నిర్మాణం పూర్తయిన దాదాపు 250 ఇళ్లను గత ఎన్నికలకు ముందు పంపిణీ చేయాలని భావించారు. అర్హులు అధిక సంఖ్యలో ఉండడంతో పంపిణీ చేస్తే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్‌ రావడంతో ఇళ్లను పంపిణీ చేస్తారనే ఆశతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

మూడువేల దరఖాస్తులు

నర్సాపూర్‌లో చేపట్టిన 500 ఇళ్లకు మూడువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చి కూడా ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుదారుల్లో నైరాశ్యం నెలకొంది. ఎన్నోసారు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లను సందర్శించి, త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పడం తప్ప అమలు చేయలేదు.

పరిగణలోకి పాత దరఖాస్తులేనా?

బీఆర్‌ఎస్‌ హయాంలో మూడువేలకు పైగా దరఖాస్తులు రాగా.. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుందో లేదోనన్న సందేహం ఆశావహుల్లో నెలకొన్నది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ఇంకా స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో ఆశావహులు గందరగోళంలో పడ్డారు.

Updated Date - Feb 17 , 2024 | 11:03 PM