Share News

రోగులు ఏమవుతున్నారు?

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:53 PM

ఆరోగ్యం బాగు చేయించుకుందామని ఆసుపత్రికి వస్తున్న కొందరు బాధితులు కనిపించకుండా పోతున్నారు. నెలలు గడిచినా వారు ఎక్కడున్నారు.. ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది.

రోగులు ఏమవుతున్నారు?

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మిస్సింగ్స్‌!

అనారోగ్యంతో చేరి.. ఆ తర్వాత మాయం

కేసుల నమోదుతో సరిపెడుతున్న పోలీసులు

సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 6: గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన తలారి సాయికుమార్‌(25)కు ఫిట్స్‌ రావడంతో బంధువులు జనవరి 10న సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇన్‌పేషంట్‌గా చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. జనవరి 13న సాయికుమార్‌ మూత్రానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఆసుపత్రి చుట్టుపక్కల, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని సోదరి భాగ్యలక్ష్మి సంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంగారెడ్డి పట్టణంలోని ఇంద్రకాలనీకి చెందిన పట్నం జగన్నాథం(75) గత ఏడాది డిసెంబరు 1న ఉదయం 9.30 గంటలకు వైద్యం కోసం భార్య లక్ష్మితో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో కనిపించకుండా పోయాడు.

జహీరాబాద్‌ మండలం రాయిపల్లికి గ్రామానికి చెందిన ఎరుకల రమేష్‌(52) రమేష్‌ ఎడమ కాలికి గాయమైందని కుమారుడు ఎరుకల నర్సిములు గత ఏడాదిఅక్టోబరు 19న సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ అక్టోబరు 20 ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎరుకల రమేష్‌ బీడీ తాగి వస్తానని చెప్పి, బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులకు గుండె కోత

ఆరోగ్యం బాగు చేయించుకుందామని ఆసుపత్రికి వస్తున్న కొందరు బాధితులు కనిపించకుండా పోతున్నారు. నెలలు గడిచినా వారు ఎక్కడున్నారు.. ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. వారి కోసం బంధువులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ చిక్కడం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి.. తమ వారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఏడాదిలో పదుల సంఖ్యలో ఆసుపత్రి నుంచి మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నా ఇటు ఆసుపత్రి వర్గాలు.. అటు పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

సంవత్సరాలుగా ఎదురుచూపులు

వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారు కనిపించకుండా పోతుండటంతో వారి బంధువులు తట్టుకోలేకపోతున్నారు. నిన్నామొన్నటి వరకు తమలో ఒకరిగా.. కష్టసుఖాల్లో పాలుపంచుకున్నవారు ఉన్నఫలంగా అదృశ్యం కావడం వెనుక కారణాలు తెలియక ఆవేదన చెందుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా.. వారి జాడ మాత్రం తెలియడం లేదు.

ముందుకుసాగని పోలీసు దర్యాప్తు

పోలీసుశాఖలో ఖాళీలు ఎక్కువగా ఉండడం, ఉన్న సిబ్బంది రోజువారీ విధులకు సరిపోవడంతో తప్పిపోయినవారి జాడ తెలుసుకొనేందుకు సమయం సరిపోవడం లేదు. జిల్లాకేంద్రంలో వీఐపీల పర్యటనలు, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు బందోబస్తుకే సరిపోతున్నారు. కనిపించకుండా పోతున్నవారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆచూకీ 24 గంటల్లో తెలియకపోతే సంబంధిత పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. సదరు వ్యక్తి ఫొటో, వివరాలు అన్ని పోలీ్‌సస్టేషన్లలకు పంపి, ప్రసారమాధ్యమాల్లో వచ్చేలా చూడాలి. సదరు వ్యక్తి తరచూ సందర్శించే స్థల్లాల్లో విచారణ జరపాల్సి ఉంటుంది. కానీ, ఇవన్నీ చేసేందుకు తీరిక లేక పోలీసులు మిస్సింగ్‌ కేసులను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పిపోయిన వారి బంధువులు పోలీ్‌సస్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు మాత్రం చూస్తాం... వారి జాడ తెలిస్తే మేమే కబురు పెడతామంటూ సమాధానమిస్తున్నారు.

నామ్‌కే వాస్తేగా పోలీస్‌ అవుట్‌ పోస్టు

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన పోలీస్‌ అవుట్‌ పోస్టు పేరుకు మాత్రమే ఉంది. అక్కడ పోలీసు సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండరు. అక్కడ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటే రోగులు బయటకు వెళ్తే ఆపే అవకాశం ఉంటుంది.

మానసిక పరిస్థితి బాగాలేకనే..

- డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరుతున్న కొందరు రోగులు కనిపించకుండా పోవడానికి ప్రధాన కారణం మానసిక స్థితి సరిగ్గా తేకపోవడమే. కొంత మంది రోగలు వారి కుటుంబాల నిరాధరణకు గురికావడం వల్ల కూడా నిపించకుండాపోతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో మొత్తం 22 సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డు కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

Updated Date - Feb 06 , 2024 | 11:53 PM