Share News

డబుల్‌ బెడ్‌రూం గతేంటి?

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:12 AM

గత ప్రభుత్వ పెద్దలు ప్రాతినధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇంకా పూర్తిగా లబ్ధిదారులకు అందలేదు.

డబుల్‌ బెడ్‌రూం గతేంటి?
గజ్వేల్‌ మండలం దాచారంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లు

ఇళ్లు మంజూరై ఎనిమిదేళ్లు

ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా నిర్మాణం పూర్తి

వేల సంఖ్యలో అసంపూర్తిగానే..

పలుచోట్ల ఇంకా ప్రారంభానికి నోచని పనులు

పూర్తయిన కొన్నింటిలో మౌలిక వసతులు కరువు

సిద్ధమైన వాటినీ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం

మిగతా వాటి సంగతి ఇక అంతేనా?

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, ఫిబ్రవరి 19: గత ప్రభుత్వ పెద్దలు ప్రాతినధ్యం వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇంకా పూర్తిగా లబ్ధిదారులకు అందలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కిందట ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించడంలో గత పాలకులు చొరవ చూపించలేకపోయారు. టెండర్లు ఖరారు చేసి, నిర్మాణాలు ప్రారంభించిన డబుల్‌ ఇళ్లలో ఇంకా వేల సంఖ్యలో అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలోనూ అప్పటి పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మరికొన్ని ఇళ్లు నిర్మాణాలు జరిగినా వైరింగ్‌, నీటి కనెక్షన్‌ వంటి పనులు జరగక అలాగే ఉండిపోయాయి. ఇంకా మొదలుపెట్టని ఇళ్ల సంగతేంటో వారికే తెలియాలి. అధికార వర్గాల సమాచారం మేరకు ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభంకాని చోట స్థల సమస్య ప్రధానంగా నెలకొన్నది. అలాగే, బిల్లుల చెల్లింపులోనూ జాప్యం జరుగుతుందన్న భావనతో ఆయా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

కొత్త ప్రభుత్వ నిర్ణయమేంటి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అనే పథకాన్ని తీసుకు వచ్చిన నేపథ్యంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిస్థితి ఏమిటీ అన్న ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే పూర్తయిన సగంలో ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అసంపూర్తి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాల సంగంతేంటో స్పష్టం చేయాల్సి ఉంది.

సంగారెడ్డి జిల్లాలో..

అందోలు మండలం తల్మెలలో మంజూరైన 50 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నిర్మాణం చేపట్టిన 36 ఇళ్లు ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఉన్నాయి.

చౌటకూర్‌ మండలం సరా్‌ఫపల్లి, శివంపేటలలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మాణం ప్రాంరంభానికే నోచుకోలేదు.

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన 116 ఇళ్లలో ఒక్కటీ పూర్తి కాలేదు.

హత్నూరలో మంజూరైన 30 ఇళ్లు, ఇదే మండలం సికింద్లాపూర్‌లో మంజూరైన 14 ఇళ్లలో ఒక్కటీ పూర్తి చేయలేదు.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలో మంజూరైన 30 ఇండిపెండెంట్‌ ఇళ్లు, 20 ఫ్లాట్ల నిర్మాణాల్లో ఒక్కటీ పూర్తి చేయలేదు.

కొండాపూర్‌ మండలం అలియాబాద్‌లో నిర్మాణం చేపట్టిన 220 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.

పటాన్‌చెరు మండలం చిట్కుల్‌, ముత్తంగి, మండలకేంద్రమైన జిన్నారం, ఇదే మండలంలోని కొడకంచి, గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో 400 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 240 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో 240 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.

జహీరాబాద్‌ అర్బన్‌కు సంబంధించి హోతి (కె)లో నిర్మాణం చేపట్టిన 660 ఇళ్లలో ఒక్కటీ పూర్తి కాలేదు.

మండలకేంద్రమైన మొగుడంపల్లిలో 150 ఇళ్లు, న్యాల్‌కల్‌లో 150 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారైనా ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టలేదు.

మెదక్‌ జిల్లాలో..

మండల కేంద్రమైన హవేళిఘనపూర్‌లో 40 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఈ ప్రాంతంలో సీసీరోడ్లు వేయలేదు. దాంతో లబ్ధిదారులు వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 40 ఇళ్లకు ఒక్కటే ఉన్న సెప్టిక్‌ ట్యాంకు పొంగి పొర్లుతుండడంతో దుర్వాసన నెలకొన్నది.

చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లిలో మంజూరైన ఎనిమిది ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.

సిద్దిపేట జిల్లాలో ..

గజ్వేల్‌లోని సంగాపూర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులు తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. దీంతో గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు ఇళ్ల పంపిణీ జరగలేదు.

దూళిమిట్ట మండలం బైరాన్‌పల్లిలో 18 ఇళ్లను నిర్మించినా పంపిణీ చేయలేదు.

దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్‌, పెద్ద చీకోడు, చౌదర్‌పల్లి, రఘోత్తమపల్లి, గోసాన్‌పల్లి గ్రామాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను అనధికారికంగా కేటాయించడంతో వివాదాస్పదమైంది. అదే విధంగా దుబ్బాక పట్టణంలో నిర్మించిన ఇళ్లలో 108 ఇళ్లను నేటికీ పంపిణీ చేయలేదు.

మిరుదొడ్డి మండలం భూంపల్లిలో మాత్రమే ఇళ్లను పంపిణీ చేశారు. మిగిలిన చోట్లా పంపిణీ చేయకున్నా ఎవరికివారు వెళ్లి అనధికారికంగా నివాసముంటున్నారు.

గజ్వేల్‌ మండలం దాచారంలో డబుల్‌ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. బిల్లులు ఇవ్వనందువల్లే ఆగిపోయినట్లు తెలిసింది.

తొగుట మండలం బండారుపల్లి, పెద్దమాసాన్‌పల్లి గ్రామాల్లో డబుల్‌ ఇళ్లను నిర్మించినా పంపిణీ చేయలేదు. నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానట్లుగా తెలిసింది.

ములుగు మండలం బండ మైలారంలో డబుల్‌ ఇళ్లు అర్ధాంతరంగానే నిలిచిపోయాయి.

Updated Date - Feb 20 , 2024 | 12:12 AM