Share News

ఒక ఎంపీ సీటు కోరతాం

ABN , Publish Date - Feb 10 , 2024 | 11:00 PM

హుస్నాబాద్‌, ఫిబ్రవరి 10: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీలో దిగే అవకాశాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి చెప్పారు.

ఒక ఎంపీ సీటు కోరతాం
హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్‌, ఫిబ్రవరి 10: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీలో దిగే అవకాశాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి చెప్పారు. ఒక వేళ అదే జరిగితే రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని తమకు ఇవ్వాలని కోరతామని అన్నారు. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, అసెంబ్లీ సమావేశాల తర్వాత కలిసి మాట్లాడతామని వెల్లడించారు. శనివారం వెంకట రెడ్డి హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాకముందే దానిపై అనేక ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. దేశంలో ఇండియా కూటమి ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ ఉంటుందని, కూటమిలో నుంచి కొంత మంది వెళ్లి పోయినా ఏం ఫర్వాలేదని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భూములపై సర్వేనెంబర్ల వారీగా సమగ్ర సర్వే చేయాలని అన్నారు. నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, మొహం చల్లక ఇప్పుడు రాముడి పేరుతో ఆయన ఓట్లు అడుగుతున్నారని వెంకట రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - Feb 10 , 2024 | 11:00 PM