Share News

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - May 21 , 2024 | 11:13 PM

తూప్రాన్‌, మే 21: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని ఆర్కియాలజీశాఖ కమిషనర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి పేర్కొన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లి కొనుగోలు కేంద్రంలో మాయిశ్చర్‌ను పరిశీలిస్తున్న భారతిహోళికేరి

రైతులు ఆందోళన చెందవద్దు

ఆర్కియాలజీశాఖ కమిషనర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి

తూప్రాన్‌, మే 21: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని ఆర్కియాలజీశాఖ కమిషనర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యం రవాణా చేసేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుండ్రెడ్డిపల్లిలో ఐదులారీలు, మల్కాపూర్‌లో రెండు లారీలు అవసరమని చెప్పగా ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలని సూచించారు. భారతిహోళికేరి వెంట అదరనె కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఐకేపీ ఏపీఎం రుక్మిణీ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు మంగళవారం రోడ్డెక్కారు. తూప్రాన్‌ పట్టణంలోని నర్సాపూర్‌ రోడ్డులో రవాణాశాఖ అధికారి శ్రీనివా్‌సరావు, తహసీల్దార్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో లారీలను సమకూర్చే పనులు చేపట్టారు. రోడ్డున వెళ్లే ఖాళీ లారీలను నిలిపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించారు.

నిలువ ఉన్న ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాలి

చేగుంట, మే 21: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉన్న ధాన్యాన్ని త్వరగా రైస్‌ మిల్లులకు తరలించాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు, కేంద్రాల వివరాలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని షేర్‌పల్లి, నర్సంపల్లి, నర్సంపల్లి పెద్దతండా, జప్తి శివనూర్‌, సంకాపూర్‌, వల్లూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తరలించామని తెలిపారు. ఆరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహణకురాలుగా పనిచేసిన సీసీ సుల్తానాను, అధికారుల పనితీరును ఆమె అభినందించారు. నార్సింగి కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నాయని, వాటిని త్వరలో తరలించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.

తహసీల్దార్‌ కార్యాలయ సందర్శన

చేగుంట తహసీల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు మంగళవారం సందర్శించారు. మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉన్న ధాన్యాన్ని రెండు, మూడురోజుల్లో రైస్‌ మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, నార్సింగి, చేగుంట తహసీల్దార్లు ఖరీమ్‌, గియ వున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ చివరిదశకు చేరింది

దుబ్బాక, మే 21: జిల్లాలో ధాన్యం సేకరణ చివరి దశకు చేరిందనీ, కొనుగోలు చేసిన రెండు, మూడురోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలును రెండు, మూడురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్డీవో పీడీ జయదేవ్‌ హర్యా, జిల్లా పౌరసరఫరాల అధికారి హరీశ్‌, డీఎ్‌సవో తనూజ ఉన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 21: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లాల ప్రత్యేకాధికారి భారతిహోళికేరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ మనుచౌదరి, సంబంధిత అధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదిరోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు, ఇంకా రావాల్సిన ధాన్యంపై జిల్లా వ్యవసాయ అధికారి పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ డీఆర్డీఏ జయదేవ్‌ఆర్యా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:13 PM