Share News

నీరుగారిన ఉత్సాహం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:53 PM

2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10లక్షలు అందజేస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామి ఇచ్చింది. నజరాన అందుతుందనే సదుద్దేశంతో పలు గ్రామాల్లో ఆ దిశగా అడుగువేశారు.

నీరుగారిన ఉత్సాహం

ప్రోత్సాహకం లేకుండానే ఐదేళ్లు

ఈనెలతో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

సిద్దిపేట జిల్లాలో 48 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం

నజరాన కోసం ఎదురుచూస్తునే ఉన్న సర్పంచులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 3: 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10లక్షలు అందజేస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామి ఇచ్చింది. నజరాన అందుతుందనే సదుద్దేశంతో పలు గ్రామాల్లో ఆ దిశగా అడుగువేశారు. ఇలా దాదాపు జిల్లాలో 48 గ్రామపంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ నెలతో గ్రామపంచాయతీల పాలకవర్గాలకు సంబంధించిన ఐదేళ్ల గడువు పూర్తవుతుంది. ఏ క్షణంలోనైనా మళ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావొచ్చు. సర్పంచులు, వార్డు సభ్యులకు ఫిబ్రవరి నుంచి అదనపు సమయంగానే భావించే పరిస్థితి. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఈ తరుణంలో ప్రోత్సాహక నగదు పొందకుండానే పదవికి కాలం ముగియడంతో ఏకగ్రీవమైన గ్రామాల పాలకవర్గాలు ఉసూరుముంటున్నాయి.

సిద్దిపేట జిల్లాలో 499 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో 48 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ఆరునెలల వ్యవధిలోనే రూ.10లక్షల చొప్పున ప్రొత్సహక నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గడువు పూర్తవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఆయా గ్రామాల్లో ఎలక్షన్‌ నిర్వహణ లేనందున ఖర్చు ఆదా ఆవుతుంది. కావున గ్రామాల అభివృద్ధి కోసం ప్రొత్సాహకంగా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తారు. ఇలా వచ్చే నిధులతో అదనపు అభివృద్ధి చేసుకోవచ్చని బరిలో ఉన్నవారు హామీలు ఇచ్చి సర్పంచ్‌లుగా, వార్డుసభ్యులుగా కొలువుదీరారు. కానీ ఐదేళ్ల కాలంలో ఒక్కపైసా కూడా మం జూరు కాలేదు.

48 గ్రామాలు ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ మండలం అనంతగిరిపల్లి, చాంద్‌ఖాన్‌మక్తా, మాదారం, సీతారాంపల్లి, తొగుట మండలం బ్రాహ్మణబంజరుపల్లి, కానుగల్‌, గోవర్ధనగిరి, సిద్దిపేట రూరల్‌ మండలం సీతారాంపల్లి, నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌, కొదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి, రాయపోల్‌ మండలం గొల్లపల్లి, ముంగీ్‌సపల్లి, నంగునూరు మండలం జేపీ తండా, నాగరాజుపల్లి, మర్కూక్‌ మండలం ఇప్పలగూడ, మిరుదొడ్డి మండలం బేగంపేట, వీరారెడ్డిపల్లి, కొమురవెల్లి మండలం గౌరాయిపల్లి, రసూలాబాద్‌, మద్దూరు మండలం హనుమతండా, అక్కన్నపేట మండలం ధర్మారం, గొల్లపల్లి, గుబ్బడి, కుందన్‌వానిపల్లి, మంచినీళ్లబండ, మసిరెడ్డి తండా, మోత్కులపల్లి, పెద్దతండా, పోతారం(జే), బెజ్జంకి మండలం నర్సింహులపల్లి, తిమ్మయ్యపల్లి, చేర్యాల మండలం శభా్‌షగూడెం, దౌల్తాబాద్‌ మండలం కోనాపూర్‌, ముత్యంపేట, దుబ్బాక మండలం వెంకటగిరితండా, గజ్వేల్‌ మండలం కొల్గురు, రాగట్లపల్లి, శేరిపల్లి, హుస్నాబాద్‌ మండలం భల్లునాయక్‌తండా, రాములపల్లి, జగదేవ్‌పూర్‌ మండలం అనంతసాగర్‌, జంగంరెడ్డిపల్లి, కొండాపూర్‌, నిర్మల్‌నగర్‌, పీటీ వెంకటాపూర్‌, తీగుల్‌నర్సాపూర్‌, కోహెడ మండలం విజయనగర్‌కాలనీ గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవంగా పాలకవర్గాలను ఎన్నుకున్నా రు.

ఈ నెలతోనే ఆఖరు

ఏకగ్రీవమైన ఆరునెలల్లో అందాల్సిన నిధులు ఐదేళ్లయినా రాకపోవడంతో ఆయాగ్రామాల సర్పంచ్‌లు తీవ్ర నైరాశ్యంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యామని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు సమయానికి రావడంలేదనే బాధలో ఇప్పటికే సర్పంచులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు పంచాయతీల్లో ఖర్చులు పెరగడం, వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల అప్పులు చేసినవారూ లేకపోలేదు. కనీసం ఏకగ్రీవ నిధులతోనైనా ఉపశమనం కలుగుతుందని భావిస్తే వీటికీ ఎదురుచూపులు తప్పడం లేదు. మరో నెల గడిస్తే మళ్లీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

ఎన్నికల సందడి షురూ

ఈ నెలాఖరుతో గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలవాలనుకున్న ఆశావహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామాల్లో పోటీ వాతావరణం నెలకొన్నది. బిజేపీ సైతం క్షేత్రస్థాయిలో ప్రభావం చూపించడానికి సిద్ధమవుతున్నది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్‌ రావాల్సి ఉండగా జాప్యం జరిగింది. కాగా పార్లమెంటు ఎన్నికల అనంతరమే పంచాయతీ ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతున్నది. కానీ అధికారులు అన్ని విధాలుగా ఎన్నికలపై కసరత్తు పూర్తి చేస్తున్నారు. దీంతో ఎన్నికలెప్పుడొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - Jan 03 , 2024 | 11:53 PM