Share News

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:59 PM

ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా శరత్‌

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి

సంగారెడ్డి, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి నియమితులయ్యారు. ఇంతవరకు కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎ.శరత్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలుకు చెందిన వల్లూరు క్రాంతి 2016 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. ఆమె పాఠశాల విద్యను కర్నూలులో అభ్యసించారు. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, అక్కడే శ్రీరామ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఆర్నేళ్ల పాటు ఐఏఎస్‌ శిక్షణ తీసుకున్నారు. 2013, 2014లో సివిల్స్‌ రాసినా ఐఏఎస్‌ సర్వీసు రాలేదు. పట్టుదలతో 2015లో మళ్లీ రాశారు. 2016లో వచ్చిన ఫలితాలలో 65వ ర్యాంక్‌తో ఐఏఎస్‌ సాధించింది. కేంద్రం తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంతో ఆమె నిర్మల్‌ జిల్లాలో శిక్షణ పొందారు. అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రత్యేకాధికారిగా, కరీంనగర్‌ మన్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం క్రాంతి జోగులాంబ-గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. తాజా బదిలీలలో క్రాంతి అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వస్తున్నారు. ఇక క్రాంతి తల్లిదండ్రులు లక్ష్మీ, రంగారెడ్డి. సోదరి నీలిమ డాక్టర్‌గా ఉన్నారు. ఇలా ఉండగా డాక్టర్‌ ఎ.శరత్‌ 2022 జూన్‌ 18న బాధ్యతలు చేపట్టి 18 నెలలకుపైగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

మెదక్‌ ఎస్పీగా బాలస్వామి

మెదక్‌ అర్బన్‌, జనవరి 3 : మెదక్‌ జిల్లా ఎస్పీగా డా.బాలస్వామి బదిలీపై రానున్నారు. మొన్నటి వరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన రోహిణి ప్రియదర్శిని గత డిసెంబరు 17న బదిలీ అయ్యారు. అప్పటి నుంచి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎ ్‌సలను బదిలీ చేయగా 2018 బ్యాచ్‌కు చెందిన బాలస్వామిని మెదక్‌ జిల్లా ఎస్పీగా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2020లో మెదక్‌ అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌గా పనిచేశారు.

Updated Date - Jan 03 , 2024 | 11:59 PM