Share News

వడగండ్లు.. కడగండ్లు

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:36 PM

వడగళ్ల వర్షం.. కడగండ్లను మిగిల్చింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన అకాలవర్షానికి సిద్దిపేట జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. బలమైన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లపై, విద్యుత్‌ తీగలపై పడ్డాయి. పలుచోట్ల ఇళ్లు కూలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

వడగండ్లు.. కడగండ్లు
సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో నేలవాలిన వరి

అకాల వర్షంతో అపార నష్టం

2,800 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఇప్పటి వరకు 1,794 మంది రైతుల వివరాల సేకరణ

50కి పైగానే కూలిన ఇళ్లు

విద్యుత్‌శాఖకూ తప్పని ఆర్థిక భారం

పరిహారం కోసం బాధితుల ఎదురుచూపు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 20 : వడగళ్ల వర్షం.. కడగండ్లను మిగిల్చింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన అకాలవర్షానికి సిద్దిపేట జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. బలమైన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లపై, విద్యుత్‌ తీగలపై పడ్డాయి. పలుచోట్ల ఇళ్లు కూలిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యుత్‌ తీగలు తెగిపడడం, స్తంభాలు విరగడంతో గంటల తరబడిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బుధవారం పంట నష్టంపై వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్‌ పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. అలాగే కూలిన ఇళ్లపై వివరాలు సేకరించారు.

నష్టం అంచనాల్లో అధికారులు

జిల్లాలోని సిద్దిపేటఅర్బన్‌, సిద్దిపేట రూరల్‌, నంగునూరు, చిన్నకోడూరు, దుబ్బాక, రాయపోల్‌, గజ్వేల్‌, బెజ్జంకి, కోహెడ, మిరుదొడ్డి, భూంపల్లి మండలాల్లో మంగళవారం కురిసిన వడగళ్ల వానకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2,800 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1794 మంది రైతుల వివరాలను సేకరించారు. జిల్లాలో 90కి పైగా విద్యుత్‌ స్తంభాలు విరిగినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. అదే విధంగా విద్యుత్‌ తీగలు సైతం తెగడంతో నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చేస్తున్నారు. ఇక ఈదురుగాలులకు, వడగళ్ల తాకిడికి దాదాపు 50కి పైగానే ఇళ్లు కూలినట్లు తెలుస్తున్నది. శిథిలావస్థకు చేరిన ఇళ్లతోపాటు నివాసయోగ్యమైన ఇళ్లు కూడా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పుర, బారా ఇమామ్‌ ఏరియాల్లో అధిక నష్టం సంభవించింది. తమకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

పిడుగుపాటుకు పాడి గేదె మృతి

చిన్నకోడూరు మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని కొండెంగలకుంటలో మంగళవారం రాత్రి పిడుగుపాటుకు పాడిగేదె మృతిచెందింది. గ్రామానికి చెందిన రైతు సందబోయిన ఓజయ్య రోజుమాదిరిగానే మంగళవారం సాయంత్రం గేదెను బావి వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున వెళ్లి చూడగా గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. మృతి చెందిన పాడి గేదె విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు.

ఆందోళనలో అన్నదాతలు

సిద్దిపేటఅగ్రికల్చర్‌/కోహెడ/చిన్నకోడూరు: యేటా మార్చి చివర్లో, లేదంటే ఏప్రిల్‌లో అకాల వర్షాలు రైతులకు నష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఈ సారి 3.38 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. పంట పొట్టదశకులో ఉండగా వడగళ్లు రైతులకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కెట్‌యార్డులో ఉన్న పొద్దుతిరుగుడు గింజలు తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలూ దెబ్బతిన్నాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన ఆడేపు దత్తాద్రి రూ.3లక్షలు పెట్టుబడి పెట్టి ఎకరంలో బీర, మరో ఎకరంలో కాకర సాగుచేశాడు. నిన్న కురిసిన ఈదురుగాలులు, వడగళ్లకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన వాపోయాడు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 20 , 2024 | 11:36 PM